‘కఫీల్’ కష్టాలకు తెర

ABN , First Publish Date - 2020-09-04T06:34:59+05:30 IST

దేశంలో నెలకొని ఉన్న అసహన ప్రజాస్వామిక నిర్బంధ వాతావరణానికి కొన్ని పేర్లు సంకేతాలుగా మారిపోతాయి. తొంభైశాతం వైకల్యం ఉన్నప్పటికీ, కరోనా ముప్పు ఉన్నా...

‘కఫీల్’ కష్టాలకు తెర

దేశంలో నెలకొని ఉన్న అసహన ప్రజాస్వామిక నిర్బంధ వాతావరణానికి కొన్ని పేర్లు సంకేతాలుగా మారిపోతాయి. తొంభైశాతం వైకల్యం ఉన్నప్పటికీ, కరోనా ముప్పు ఉన్నా, కన్నతల్లి చనిపోయినా పెరోల్ కూడా దక్కని సాయిబాబా; ఎనిమిది పదుల వయస్సులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా, కేసు విచారణ దశలోనే ఉండి కేవలం నిందితుడే అయినా బెయిల్ లభించని వరవరరావు; హక్కులు అడిగిన పాపానికి, ఆదివాసులకు అండగా నిలిచినందుకు, చదువులలో సారమెల్ల బోధించిన నేరానికి ఉద్యమకారులు, సంఘసేవకులు, అధ్యాపకులు అనేకులు ఎడతెగని నిర్బంధంలో ఉంటున్నారు. పైన చెప్పిన వారందరూ, ఏదో ఒక ప్రజాహిత రంగాన్ని ఎంచుకుని, నిబద్ధులై పని చేస్తున్నవారు కాబట్టి బాధలను అనుభవిస్తున్నవారని సరిపెట్టుకోవచ్చు. కానీ, దేశంలో అలుముకున్న అవాంఛనీయ వాతావరణానికి బాధితులైన వారు, కొత్తగా గొంతులు విప్పి కటకటాల పాలైనవారు, ఏ పాపమూ చేయకుండా విధి నిర్వహణ చేసినందుకు బలి అయినవారు మరి కొందరున్నారు. పశుమాంసం అనుమానంతో హతుడైన మహమ్మద్ అఖ్లాఖ్, అత్యాచారానికి బలి అయిన చిన్నారి ఆసిఫా, పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థిని సఫూరా జర్గర్, ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు లేవని నోరు విప్పినందుకు అష్టకష్టాలు పడిన డాక్టర్ కఫీల్ ఖాన్- వీరు మన సమాజంలోని, వ్యవస్థలోని దుర్మార్గాన్ని గుర్తు చేసే పేర్లు, ఉదంతాలు, వ్యక్తులు. 


డాక్టర్ కఫీల్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల వైద్యుడు. 2017 ఆగస్టులో రెండు రోజుల వ్యవధిలో 60 మంది దాకా పిల్లలు ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోయారు. ఆ సమయంలో కఫీల్ ఖాన్ తన వ్యక్తిగత సంబంధాలను, డబ్బును ఉపయోగించి, కొన్ని ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించగలిగారు కూడా. ఆ ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడానికి ప్రభుత్వం చెల్లించవలసి ఉన్న బకాయిలు, ఇతర పరిపాలనాపరమైన అంశాలు కారణం. ప్రభుత్వ వైఖరిని డాక్టర్ కఫీల్ ఖాన్ బహిరంగంగా విమర్శించారు. పిల్లల మరణానికి ఆ వైద్యుని అలక్ష్యమే కారణమంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టింది. అరెస్టు చేసింది. దీర్ఘకాలం నిర్బంధంలో ఉంచింది. 


వివాదాస్పదమైన పౌరసత్వ చట్టాన్ని అనేకులు వ్యతిరేకించినట్టే డాక్టర్ కఫీల్ ఖాన్ కూడా వ్యతిరేకించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఆవరణలో జరిగిన ఒక సమావేశంలో ఆయన పౌరసత్వ చట్టాన్ని విమర్శిస్తూ మాట్లాడారు. అందుకోసమని, ఆయనపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి అరెస్టు చేశారు. షహీన్ బాగ్ తరహాలో సిఎఎకు వ్యతిరేకంగా తలపెట్టిన ఒక ఉద్యమశిబిరంలో ప్రసంగించడానికి ముంబై వెళ్లినప్పుడు ఈ ఏడాది జనవరి 29 నాడు ఆయనను యుపి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఎస్టిఎఫ్) పోలీసులు అరెస్టు చేసి మధుర జైలుకు తరలించారు. సెప్టెంబర్ 1 మంగళవారం నాడు, అలహాబాద్ హైకోర్టు కఫీల్ ఖాన్ నిర్బంధం అర్థరహితమని, చెల్లదని తీర్పు చెప్పింది. ఆయన యూనివర్సిటీలో మాట్లాడినదాంట్లో దేశద్రోహమూ చట్టవ్యతిరేకమూ ఏదీ లేదని నిర్ధారించింది. కోర్టు తీర్పు దరిమిలా, బుధవారం అర్ధరాత్రి కఫీల్ ఖాన్ విడుదలయ్యారు, భార్య, కుటుంబంతో సహా ఉత్తరప్రదేశ్ వెలుపల కొంతకాలం ప్రశాంతంగా జీవించడానికి ప్రయాణమయ్యారు. మోదీ, అమిత్ షా తరువాత స్థానంగా చెప్పుకుంటున్న యోగి ఆదిత్యనాథ్ ఇటువంటి అప్రతిష్ఠాకరమైన ఉదంతాలను నివారించాలి.


తనను నిర్మూలించేందుకు కుట్ర జరిగిందని, న్యాయస్థానం ఎంతో అద్భుతమైన తీర్పు ఇచ్చి తనకు స్వేచ్ఛ ఇచ్చిందని కఫీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, జనవరిలో తనను ముంబైలో అరెస్టు చేసి, మధుర తరలించినప్పుడు మార్గమధ్యంలో తనను ఎన్‌కౌంటర్ చేయకుండా ప్రాణాలతో ఉంచినందుకు ఎస్టిఎఫ్‌కు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఆయన ఎదుర్కొన్న వేధింపులకు, వివక్షకు సామాజిక నేపథ్యం కారణం కాదని ఎవరూ అనలేరు. రోగులపట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరించే వైద్యుడిపై నిర్లక్ష్యం ఆరోపణలు చేయడం, ప్రజాస్వామికమైన వ్యాఖ్యలు చేసినా వాటిని చట్టవ్యతిరేకంగా పరిగణించడం- కేవలం ఆ వైద్యుడు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపినందుకు ప్రతిచర్యలా? లేక మరేదైనా సందేశం ఆ చర్యలలో ఇమిడి ఉన్నదా? ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ సుధాకర్ ఉదంతం కూడా కఫీల్ ఖాన్ అనుభవం లాంటిదే. కరోనా కట్టడికి కావలసిన రక్షణసామగ్రి వైద్యులకు లేదు అని డాక్టర్ సుధాకర్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏ కొంచెమైనా మెరుగుపడిందేమో కానీ, ఆ నాటికి వైద్యులు ఎంతో ప్రమాదకర పరిస్థితులలో కరోనా వైద్యం చేస్తున్నారు. డాక్టర్ సుధాకర్‌కు అప్పుడు, ఆ తరువాత ఎదురైన అనుభవాలకు ఆయన సామాజిక నేపథ్యానికి సంబంధం లేదని అనగలమా?


దేశవ్యాప్తంగా అనేక చోట్ల పాత్రికేయులకు, సామాజిక కార్యకర్తలకు కూడా ఇటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. పెద్ద పెద్ద పేర్లున్న మీడియా సంస్థలలో పని చేసేవారి మీద కూడా కత్తి వేలాడుతున్నది. కేంద్రప్రభుత్వం కనుసన్నలలో జరిగే వేధింపులే కాదు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్బంధ విధానాలలో కొత్తపోకడలు పోతున్నాయి. సామాజిక మాధ్యమాలలో చిన్నపాటి విమర్శ కనిపించినా పోలీసుల నుంచి తాఖీదులు అందుకున్న ఉదాహరణలను రెండు తెలుగు రాష్ట్రాలలో విన్నాము. ఇక పోలీసు వేధింపులు ఆత్మహత్యలకు, గుండెపోట్లకు దారితీసిన ఉదాహరణలు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడవచ్చు. ఇటువంటి వాతావరణాన్నే న్యాయవాది ప్రశాంత భూషణ్ ఎమర్జెన్సీ తరహా వాతావరణం అన్నారేమో? ఆయన నిస్పృహలో పడి, ఉన్నత న్యాయస్థానం కూడా అప్రజాస్వామికతకు లోబడిపోయిందన్న రీతిలో వ్యాఖ్యానించారు కానీ, కఫీల్ ఖాన్ విషయంలో న్యాయస్థానం ధైర్యంగా నిలబడింది. కఫీల్ ఖాన్ తీర్పు దేశంలోని ఇతర సుప్రసిద్ధ నిర్బంధాల విషయంలో కూడా ఒక మార్గదర్శనం చేస్తుందని ప్రజాస్వామిక వాదులు ఆశిస్తున్నారు.

Updated Date - 2020-09-04T06:34:59+05:30 IST