నేపాల్‌లో కాయ్‌ రాజా కాయ్‌!

ABN , First Publish Date - 2022-07-28T09:18:14+05:30 IST

శ్రీలంక సంక్షోభంతో జూదప్రియులు రూటుమార్చి నేపాల్‌ బాట పడుతున్నారు.

నేపాల్‌లో కాయ్‌ రాజా కాయ్‌!

  • శ్రీలంక సంక్షోభంతో నేపాల్‌కు జూదప్రియులు
  • భారత్‌-నేపాల్‌ సరిహద్దులో క్యాసినో హల్‌చల్‌
  • శంషాబాద్‌ నుంచి బాగ్‌డోగ్రాకు ప్రత్యేక విమానాలు
  • ఒక్కొక్కరి నుంచి 3 లక్షల నుంచి 5 లక్షల వసూలు
  • రూ.కోట్లలో హవాలా లావాదేవీలు.. గుర్తించిన ఈడీ
  • క్యాసినో డీలర్లు చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి ఇళ్లతో
  • సహా హైదరాబాద్‌లో ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు
  • ఇద్దరికీ తెలుగు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలతో లింకులు
  • జనవరిలో గుడివాడలో క్యాసినో నిర్వహించింది ప్రవీణే


హైదరాబాద్‌, సైదాబాద్‌, బోయినపల్లి, జూలై 27(ఆంధ్రజ్యోతి): శ్రీలంక సంక్షోభంతో జూదప్రియులు రూటుమార్చి నేపాల్‌ బాట పడుతున్నారు. అక్కడి క్యాసినో నిర్వాహకులు రాయితీలు ప్రకటిస్తుండటంతో.. నేపాల్‌కు వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జూన్‌లో తెలుగురాష్ట్రాలకు చెందిన దాదాపు 200 మంది దాకా.. ఇలా నేపాల్‌లో క్యాసినోకు వెళ్లడం గమనార్హం. అలా వెళ్లినవారిలో పలువురు ప్రముఖ వ్యాపారులు ఉన్నారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు హవాలా మార్గంలో చేతులు మారినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు  గుర్తించడంతో.. ఈ వ్యవహారం బయటకు పొక్కింది. దీనిపై ఆరా తీసిన ఈడీ అధికారులు తమకు అందిన సమాచారం మేరకు.. హైదరాబాద్‌లోని క్యాసినో డీలర్లు, ఏజెంట్ల ఇళ్లు, కార్యాలయాల్లో బుధవారం సోదాలు చేశారు. సైదాబాద్‌కు చెందిన చికోటి ప్రవీణ్‌, బోయినపల్లికి చెందిన మాధవరెడ్డి ఇళ్లతో సహా ఎనిమిది చోట్ల తనిఖీలు చేశారు. బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా ఈ సోదాలు సాగాయి. ఆ ఇద్దరి సెల్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టా్‌పలను ఈడీ అధికారులు సీజ్‌ చేశారు.


ఆల్‌ఇన్‌ పేరుతో క్యాసినో!

చీకోటిప్రవీణ్‌, మాధవరెడ్డి.. క్యాసినోలను నిర్వహిస్తుంటారు. గోవాలో ప్రముఖ బిగ్‌డాడీ క్యాసినోలో వారిద్దరికీ వాటా ఉంది. వీరు కిందటి నెల (జూన్‌) 10 నుంచి 13 వరకు నేపాల్‌లోని జపా జిల్లా మోచీనగర్‌లో ఉన్న హోటల్‌ మోచీక్రౌన్‌లో ‘ఆల్‌ ఇన్‌ ఈవెంట్‌’ పేరుతో క్యాసినోను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఏజెంట్ల ద్వారా జూదరులను ఆకర్షించారు. రూ.3 లక్షలు చెల్లిస్తే.. నాలుగు రోజుల పాటు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో వసతితో పాటు మందు, విందు, సకల సౌకర్యాలుంటాయని చెప్పారు. క్యాసినోలో తీన్‌ పత్తి, అందర్‌ బాహర్‌, మ్యారేజ్‌, బాక్రత్‌, తదితర క్యాసినో ఆటలు ఆడొచ్చని ఊరించారు. నేపాల్‌లో ఈ ఈవెంట్‌ జరిగే ప్రాంతానికి.. పశ్చిమబెంగాల్‌ సిలిగురిలోని బాగ్‌డోగ్రా విమానాశ్రయం నుంచి కేవలం 20 నిమిషాల ప్రయాణమని చెప్పి ఆకర్షించారు. శ్రీలంకలో జూదం ఆడ్డానికి అలవాటుపడి.. అక్కడ సంక్షోభం వల్ల కొన్నాళ్లుగా దానికి దూరంగా ఉన్న వ్యసనపరులు వీరి మాటలు విని నేపాల్‌కు వేళ్లేందుకు సిద్ధపడ్డారు. హైదరాబాద్‌, వరంగల్‌, విశాఖపట్నం, విజయవాడ, భీమవరం, గుంటూరు, నెల్లూరు, ఏలూరుకు చెందిన దాదాపు 200 మంది రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా చెల్లించి.. ఈవెంట్‌లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వారందరినీ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో పశ్చిమబెంగాల్‌లోని బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బస్సుల ద్వారా నేపాల్‌లోని మోచీక్రౌన్‌ హోటల్‌కు తరలించారు. అక్కడే దాదాపు 200 మంది జూదరులు నాలుగు రోజుల పాటు బసచేశారు. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు నేపాల్‌ మోడళ్లతో నృత్య కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. గెలిచిన వాళ్ల దగ్గర భారీగా కమీషన్‌ తీసుకుని.. వారి డబ్బులను హవాలా మార్గంలో అందజేసినట్లుగా తెలుస్తోంది. చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి జనవరిలో కూడా నేపాల్‌లో క్యాసినో నిర్వహించారని ఈడీ అధికారి ఒకరు తెలిపారు.


నేరచరిత్ర..

హైదరాబాద్‌ సైదాబాద్‌లోని వినయ్‌నగర్‌ కాలనీకి చెందిన చీకోటి ప్రవీణ్‌కు నేరచరిత్ర ఉంది. గతంలో ఒక సినీప్రముఖుణ్ని కిడ్నాప్‌ చేశాడనే ఆరోపణ అతడిపై ఉంది. ఇరవై ఏళ్ల క్రితం చిన్న సిరామిక్‌టైల్స్‌ వ్యాపారిగా ఉన్న ప్రవీణ్‌.. తర్వాత నిర్మాతగా మారి సినిమా తీసి, విలన్‌గా నటించి దివాలా తీశాడు. అప్పుల ఊబిలో చిక్కుకుపోయి దాన్నుంచి బయటపడేందుకు వనస్థలిపురంలో ఒక డాక్టర్‌ను కిడ్నాప్‌ చేశాడు. ఆ కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత.. గోవాలో ఓ పేకాట క్లబ్బులో కొన్ని టేబుళ్లలననుఉ  లీజుకు తీసుకుని జూద నిర్వహణలో ప్రస్థానం ప్రారంభించాడు. ఆతర్వాత అంచెలంచెలుగా తన క్యాసినా సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లకు పడగలెత్తాడు. రాజకీయ, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన ప్రముఖులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలోనే.. చినజీయర్‌ స్వామిని ప్రవీణ్‌ ఒక కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు ఇటీవల వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 2017లో దీపావళి నాడు హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో పేకాట ఆడిస్తూ పోలీసులకు చిక్కాడు. అప్పుడు దాదాపు 30 మంది అరెస్ట్‌ అయ్యారు. ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రవీణ్‌.. గోవాలో క్యాసినో నిర్వహించేవాడు. ఈ ఏడాది సంక్రాంతికి గుడివాడలో క్యాసినో నిర్వహించింది ప్రవీణే. అంతేకాదు.. బిగ్‌డాడీ పేరుతో గోవాతో పాటు నేపాల్‌, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్‌, తదితర దేశాల్లో క్యాసినోను నిర్వహిస్తుంటాడు. గత నెలలో తన పుట్టినరోజు వేడుకలను చంపాపేటలోని ఒక గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, ప్రకాశ్‌గౌడ్‌, అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, బడా వ్యాపారులు, పోలీసు అధికారులు హాజరవడం గమనార్హం.


పాలు, పెరుగు అమ్ముకునే స్థాయి నుంచి..

క్యాసినో డీలర్‌ మాధవరెడ్డి కారుకు తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్నట్లు సోదాల సమయంలో ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. కారు రిజిస్ట్రేషన్‌ నంబర్‌లో ఒక నంబర్‌ను తొలగించి ప్లేట్‌ ఏర్పాటు చేసినట్లు సమాచారం. బోయినపల్లిలోని ఆర్యసమాజ్‌ పక్కన ఉండే దాసరి మాధవ రెడ్డి అలియాస్‌ ముక్కు మాధవరెడ్డి ఇంటి వద్ద సోదాలు చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వారంతా ఆసక్తిగా చూశారు. ఇటీవల జరిగిన బోనాల పండుగలో మాధవరెడ్డి ఒంటిపై దాదాపు కిలో బంగారంతో.. రక్షణగా బౌన్సర్లను పెట్టుకుని హల్‌చల్‌ చేసినట్టు వారు తెలిపారు. ఆయన ఇంట్లో తనిఖీల్లో రూ.2 వేల నోట్ల కట్టలు, భారీగా బంగారం, భూముల డాక్యుమెంట్లు లభించినట్టు సమాచారం. ఒకప్పుడు పాలు, పెరుగు అమ్ముతూ సాదాసీదాగా జీవించిన మాధవరెడ్డి.. క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడి దాంట్లో లక్షల రూపాయలు కోల్పోయినట్టు సమాచారం. అతడికి హైదరాబాద్‌లోని ఓ మంత్రి సోదరుడితో పరిచయం ఉంది. అతడి ద్వారా.. కొంపల్లిలోని ఎస్‌ఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన ఓ హైప్రొఫైల్‌ కిట్టీ పార్టీలో చీకోటి ప్రవీణ్‌తో మాధవరెడ్డికి పరిచయమైంది. తర్వాత ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లోని పలు ఫంక్షన్‌ హాళ్లలో గుట్టుచప్పుడు కాకుండా క్యాసినోలు, క్యాబరేడ్యాన్స్‌లు నిర్వహిస్తున్నారు. డబ్బు బాగా వస్తుండడంతో ఇతర రాష్ట్రాలకూ ఈ దందాను విస్తరించారు. 

Updated Date - 2022-07-28T09:18:14+05:30 IST