
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 2019 నుంచి 2021 వరకు సపోర్ట్ స్టాఫ్‌గా సేవలందించిన టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఐపీఎల్లో ఓసారి తనకు ఎదురైన విచిత్రమైన అనుభవాన్ని పంచుకున్నాడు. 2019 ఢిల్లీ కేపిటల్స్‌కు మర్చిపోలేని సంవత్సరం. ఎందుకంటే అప్పటి వరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌గా ఉన్న జట్టు పేరు ఢిల్లీ కేపిటల్స్‌గా మారింది.
ఆ ఏడాది ఢిల్లీ కేపిటల్స్ మంచి ప్రదర్శన కనబరిచింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. శిఖర్ ధవన్, పృథ్వీషా జోడి మించి భాగస్వామ్యాలను అందించింది. 22 సగటు, 2 అర్ధ సెంచరీలతో 353 పరుగులు చేసిన షాకు 2019 మంచి సీజనే అయినప్పటికీ సీజన్ మధ్యలో కొంత తడబడ్డాడు. దీంతో కైఫ్‌ను కలిసి ఓ విచిత్రమైన అభ్యర్థన చేశాడు.
తాజాగా ‘స్పోర్ట్స్కీడ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీషా బ్యాటింగ్ సీక్రెట్‌ను బయటపెట్టాడు. మూడేళ్లపాటు ఢిల్లీ కేపిటల్స్‌తో ఉన్న తాను పృథ్వీషాతో చాలా సమయం గడిపినట్టు గుర్తు చేసుకున్నాడు. మ్యాచ్‌లకు ముందు తాను కొత్త బంతితో షా మోకాలిపైకి బంతులు వేసేవాడినని, వాటిని అతడు తిరిగి తనవైపే ఆడేవాడని పేర్కొన్నాడు. ఈ క్రమంలో పరుగులు చేయలేక ఇబ్బంది పడుతుంటే ఆ ప్రాక్టీస్ పద్ధతిని పక్కన పెట్టేశానని పేర్కొన్నాడు.
‘‘ఒక రోజు నేను టీ తాగుతున్నాను. ఓ ఆటగాడు నా దగ్గరికొచ్చి బయట మీ కోసం పృథ్వీషా వెయిట్ చేస్తున్నాడని చెప్పాడు. నేను వెంటనే బయటకు వెళ్లి ఏం జరిగిందని అడిగాను. అప్పుడతడు మాట్లాడుతూ.. ‘నేను పరుగులు సాధించలేకపోతున్నాను. దయచేసి అండర్ ఆర్మ్ బంతులు విసరండి. నేను దీనిని మళ్లీ కొనసాగించాలనుకుంటున్నానని చెప్పాడు’’ అని కైఫ్ గుర్తు చేసుకున్నాడు.
ఆ తర్వాత షా ఎలాంటి అద్భుతాలు చేశాడో కూడా చెప్పాడు. లీగ్ దశలో షా 7, 24, 99, 0, 11, 9, 14, 4, 20, 13, 42, 18 పరుగులు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగులు చేశాడు. మ్యాచ్ విజేతను నిర్ణయించే సూపర్ ఓవర్ ఓవర్లో కేకేఆర్‌పై డిల్లీ విజయాన్ని అందుకోవడంలో ఆ పద్ధతి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు. షా అద్భుతమైన షాట్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడని గుర్తు కైఫ్ గుర్తు చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఇద్దరి ఒకరినొకరం చూసుకుని నవ్వుకున్నామని కైఫ్ పేర్కొన్నాడు. అప్పుడు తామిద్దరం ఏమీ మాట్లాడుకోలేదని, మన పద్ధతి పనిచేసిందని కళ్లతో అనుకున్నామని, ఆ తర్వాత కూడా ఇదే పద్ధతి కొనసాగించాలని అతడికి సూచించానని కైఫ్ గుర్తు చేసుకున్నాడు. షా కూడా దానిని కొనసాగిస్తాననే చెప్పాడని కైప్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి