సర్వం ‘హుళక్కే’

ABN , First Publish Date - 2021-10-30T06:14:10+05:30 IST

చౌక దుకాణాల కోటాకు కోతలు విధించటం, వాటిని బయటకు తరలించేయటం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య.

సర్వం ‘హుళక్కే’

సార్థక నామధేయుడు కైకలూరు బియ్యం స్కామ్‌ సూత్రధారి

లిఫ్టింగ్‌లో భారీ అవకతవకలు.. 

30 శాతం పైగా జరగని లిఫ్టింగ్‌ 

సరుకు డిస్పాచ్‌లో కిరికిరి 

మిల్లర్లతో లాలూచీ

ఈయనొక ఉద్యోగి.. ఈయనకు మరో ప్రైవేటు అసిస్టెంట్‌

అక్రమాల్లో తోడు దొంగలు


చౌక దుకాణాల కోటాకు కోతలు విధించటం, వాటిని బయటకు తరలించేయటం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. గోడౌన్‌లో నిల్వలు లేనట్టు ఇతరులకు అనుమానం రాకుండా సెట్టింగ్‌లతో కనికట్టు చేయటంలోనూ సిద్ధహస్తుడు. బియ్యం స్కామ్‌ వ్యవహారంలో లేనివి ఉన్నట్టు భ్రమింపజేయడంలో ఏ ఆర్ట్‌ డైరెక్టరూ ఇతగాడికి సరిరాలేరేమో. డిస్పాచ్‌ రికార్డులను మేనేజ్‌ చేయటంలోనూ దిట్టే. ఈ నైపుణ్యంతోనే రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెర తీశాడు. ఈయనే కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌ హుళక్కేశ్వరరావు. సార్థక నామధేయుడు. రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన ఈయన కొంతకాలంగా పౌర సరఫరాల శాఖలో పని చేస్తున్నాడు. కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జిగా నియమితుడైన తర్వాత హుళక్కేశ్వరరావు లీలలు అన్నీ ఇన్నీ కాకుండా ఉన్నాయి.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ / కైకలూరు) : కైకలూరు ఎంఎల్‌ఎస్‌ గోడౌన్‌లోని వేలాది బియ్యం బస్తాలను పక్కదారి పట్టించిన ఉదంతంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌ బి.హుళక్కేశ్వరరావు ప్రధాన సూత్రధారిగా ఉన్నతాధికారులు గుర్తించారు. అతని మీద చర్యలకు కలెక్టర్‌కు నివేదించారు. చౌక దుకాణాల కోటాకు కోతలు విధించటం, వాటిని బయటకు తరలించేయటం, డిస్పాచ్‌ రికార్డులను మేనేజ్‌ చేయటం హుళక్కేశ్వరరావుకు వెన్నతో పెట్టిన విద్య. ఈ నైపుణ్యంతోనే అతిపెద్ద కుంభకోణానికి తెర తీశాడు. ఎక్కడో దూరాన ఉన్న ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ కావటంతో ఎవరి కంట్లో పడననే ధైర్యమేమో.. ఈ పాయింట్‌ను అక్రమాలకు నిలయంగా మార్చేశాడు. ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన విధులను సక్రమంగా నిర్వహించలేదన్న విమర్శలు చాలా ఉన్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు వచ్చే నిత్యావసరాలను కైకలూరు, మండవల్లి, కలిదిండి మండలాలకు తరలించాలి. ఏ రోజూ గోడౌన్‌ నుంచి సరుకును సక్రమంగా లిఫ్టింగ్‌ చేసేవాడు కాదు. బియ్యం బస్తాలు గోడౌన్‌లో మూలుగుతున్నా, చౌక దుకాణాలకు చేరేవి కావు. మూడు మండలాల చౌక డీలర్లు నిత్యావసరాల కోసం ఆయన చుట్టూ పదే పదే తిరగాల్సిందే. నిత్యావసరాలను సక్రమంగా పంపిణీ చేయడం లేదంటూ మూడు మండలాల తహసీల్దార్లు హుళక్కేశ్వరరావుతో అనేక సార్లు గొడవలు పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. 


లిఫ్టింగ్‌లోనూ అంతా మాయ 

గోడౌన్‌ నుంచి ప్రతినెలా మూడు మండలాల్లో ఉన్న చౌక దుకాణాలకు నిత్యావసరాలను లిఫ్టింగ్‌ చేయాలి. ఇతను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత దారుణంగా లిఫ్టింగ్‌ చేస్తున్నాడో రికార్డులను చూస్తే తెలుస్తుంది. రేషన్‌ దుకాణాలకు నిర్ణీత కోటాను ఒకేసారి పంపించడు. మొదటి దశలో సగం కోటాను, రెండో దశలో ఇర వై శాతం, మూడో దశలో ఐదో, పదో శాతం మాత్రమే పంపుతాడు. రేషన్‌ దుకాణాలకు రావాల్సిన సరుకులో 30 శాతం రావడం లేదని తెలుస్తోంది.  రేషన్‌ డీలర్లు నెలల తరబడి తమకు సరుకు తక్కువ వస్తున్నా మాట్లాడటం లేదంటే వీరిని కూడా హుళక్కేశ్వరరావు ఎలా మేనేజ్‌ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.


రికార్డుల్లో మాయ

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి చౌక దుకాణాలకు అందించాల్సిన నిత్యావసరాల లిఫ్టింగ్‌కు సంబంధించి డిస్పాచ్‌ రికార్డుల్లో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయి. దీనికి ఇన్‌చార్జి హుళక్కేశ్వరరావే ప్రధాన కారకుడు. చౌక దుకాణాలకు పూర్తి కోటాను పంపకుండానే డిస్పాచ్‌లో ఇచ్చేసినట్టు చూపటం, డిస్పాచ్‌ కొట్టకుండానే కొంత సరుకును పంపటం ఇతనికి అలవాటే. డిస్పాచ్‌ కొట్టకుండా సరుకును చౌక దుకాణాలకు పంపితే డీలర్ల ఈ పోస్‌లో స్టాక్‌ కనపడదు. దీంతో తమ దగ్గర సరుకు ఉన్నా పేదలకు పంపిణీ చేయలేని పరిస్థితి డీలర్లకు ఏర్పడుతుంది. 


మిల్లర్లతో లాలూచీ 

రేషన్‌ దుకాణాలకు పంపవలసిన సరుకులో కోత విధించటం ద్వారా భారీగా మిగిల్చిన బియ్యం  బస్తాలను హుళక్కేశ్వరరావు బయటకు తరలించేస్తాడన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఈయనకు ముఠా టీమ్‌ కూడా సహకరిస్తోందని సమాచారం. మిల్లర్లతో మిలాఖత్‌ అయిన ఇతగాడు ఆయా మిల్లులకు భారీగా బియ్యం బస్తాలను తరలిస్తాడు. మిల్లర్లు కూడా చాలా తెలివిగా ఈ బియ్యాన్ని తమ దగ్గర నిల్వ చేస్తారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయనేది వారి రికార్డుల్లో కూడా కనిపించవు. 


అక్రమార్కుడికి సహాయకుడు  

కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జే ఓ ఉద్యోగి. ఈ ఉద్యోగి మరో ఉద్యోగిని ప్రైవేటుగా నియమించుకోవటం విచిత్రంగా ఉన్నా, ఇది నిజం. ఈ అక్రమార్కుడు తన వ్యవహారాలన్నీ చూసుకునేందుకు సహాయకుడిగా మరో ప్రైవేటు ఉద్యోగిని నియమించుకోవటాన్ని చూస్తే ఏ రేంజ్‌లో వ్యవహారాలు జరుగుతున్నాయో అర్థమవుతుంది. తనకు సహాయకుడిగా నియమించుకున్న వెంకన్న (వెంకట్‌) ద్వారా హుళక్కేశ్వరరావు  ప్రైవేటుగా బియ్యం తరలింపు వ్యవహారాలు నడిపిస్తున్నాడనే ఆరోపణ ఉంది.

Updated Date - 2021-10-30T06:14:10+05:30 IST