కాకతీయ వైభవం గతమేనా!?

ABN , First Publish Date - 2022-07-06T05:46:57+05:30 IST

కాకతీయుల వైభవాన్ని ప్రజలకు మరోసారి గుర్తు చేయడానికి, ప్రస్తుత తరానికి వారి పరిపాలనా వైశిష్ట్యాన్ని తెలియచేయడానికి ఈ నెల 7 నుం చి 13వ తేదీ వరకు కాకతీయ వైభవ సప్తాహం నిర్వహించడానికి సన్నాహాలు సాగుతున్నాయి. ఈ సప్తాహం జరపాలన్న నిర్ణయాన్ని అకస్మాత్తుగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. అధికారగణంలో హడావుడి మూడు, నాలుగు రోజుల నుంచే కనిపిస్తోంది.

కాకతీయ వైభవం గతమేనా!?

నిర్లక్ష్యం నీడలో అలనాటి అపురూప కట్టడాలు
పరిరక్షణ, అభివృద్ధిపై చిత్తశుద్ధి చూపని పాలకులు
నామమాత్రంగా నిధుల కేటాయింపులు
విప్పి కుప్పపోసిన దేవాలయాలకు దిక్కే లేదు
ఏళ్లుగా కొనసాగుతున్న వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం పునరుద్ధరణ పనులు
వరంగల్‌ కోటలో పర్యాటకులకు సౌకర్యాలు కరువు
మట్టి కోటను కమ్మేసిన తుమ్మచెట్లనూ తొలగించే వారే లేరు..
రేపటి నుంచే ‘కాకతీయ వైభవ సప్తాహం’


హనుమకొండ, జూలై 5 (ఆంధ్రజ్యోతి) :
కాకతీయుల వైభవాన్ని ప్రజలకు మరోసారి గుర్తు చేయడానికి, ప్రస్తుత తరానికి వారి పరిపాలనా వైశిష్ట్యాన్ని తెలియచేయడానికి ఈ నెల 7 నుం చి 13వ తేదీ వరకు కాకతీయ వైభవ సప్తాహం నిర్వహించడానికి సన్నాహాలు సాగుతున్నాయి. ఈ సప్తాహం జరపాలన్న  నిర్ణయాన్ని అకస్మాత్తుగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. అధికారగణంలో హడావుడి మూడు, నాలుగు రోజుల నుంచే కనిపిస్తోంది. కాకతీయ ఉత్సవాలు జరపక దాదాపు పది సంవత్సరాలు అవుతోంది. మధ్యలో ఒకటీ రెండు సార్లు వారోత్సవాలంటూ వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు. చాలా రోజుల తర్వాత సప్తాహం పేరుతో అధికారుల యంత్రాంగం హడావిడి చేస్తోంది.

మలి కాకతీయం
ఓరుగల్లు కేంద్రంగా కాకతీయుల పాలన అంతమైన తర్వాత, చత్తీ్‌సఘడ్‌ రాష్ట్రం బస్తర్‌ ప్రాంతంలో మలి కాకతీయ రాజ్య స్థాపన జరిగి 700 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుక లు జరుపుతున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఇదే ఈ సారి ప్రత్యేకత. ఈ కార్యక్రమాలను ఏడు కలిసివచ్చేలా ఈనెల 7వ తే దీన, అదీ ఏడు రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. చారిత్రకంగా కాకతీయులకు బస్తర్‌ కాకతీయులకు వారసత్వ సంబంధం ఉందన్న నేపథ్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

కమల్‌ రాకే విశేషం
మలి కాకతీయ రాజుల 22వ వారసుడు మహారాజా కమల్‌ చంద్ర భాంజ్‌దేవ్‌ కాకతీయను ఆయన పూర్వీకుల గడ్డ అయిన ఓరుగల్లు గడ్డకు మొదటి సారిగా రప్పించడం ఈ సప్తాహంలో చెప్పుకోదగ్గ విశేషం. కాకతీయుల వైభవం నేటి తరానికి తెలియచేయడానికి, వారి ప్రాభవం నుంచి ఈ తరం స్పూర్తి పొందడానికి ఈ సప్తాహం నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు.

కట్టడాల పరిరక్షణ కరువు
కాకతీయుల చరిత్ర, వారసత్వాన్ని తెలియజెప్పడానికి  మరోసారి కళ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మలి కాకతీయుల పాలనకు 700 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టు ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు. అందుకే మలి కాకతీయుల వారసుడు కమల్‌ చంద్ర భాంజ్‌దేవ్‌ను తీసుకువస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే కాకతీయుల కట్టడాల పరిరక్షణ, పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపట్టకుండా, నిర్మాణాత్మక కార్యక్రమాలు అమలు చేయకుండా సప్తాహం పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలకు పరిమితం అవుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాకతీయుల ఆద్భత కట్టడాలకు వరంగల్‌ ఆలవాలం. ఇక్కడి శిథిల నిర్మాణాల పునరుద్దరణపై దశాబ్దాలుగా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇక్కడి చారిత్రక ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై చిత్తశుద్ధి కనిపించడం లేదు. దీంతో దేశ,విదేశీ పర్యాటకుల రాక ఆశించినస్థాయిలో ఉండటం లేదు.  కాకతీయుల  నాటి కాలంలో నిర్మించిన ఆలయాల సంరక్షణకు ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యలు లేవు. ఆలనా పాలనా లేక  శిధిలావస్థకు చేరుకుంటున్నాయి. ఒక్కొకటి కాలగర్భంలో కలిసిపోతున్నాయి.

రక్షణ లేక శాసనాలు ధ్వంసం అవుతున్నాయి. మట్టిలో కూరుకుపోతున్నాయి. ఇప్పటి వరకు కనుగొన్న శాసనాలకు రక్షణలేదు. ఈ మధ్య కాలంలో కొత్తగా కనుగొన్న శాసనాల్లో చాలావాటిని పరిష్కరించలేదు. చరిత్రకారుల దృష్టికి రాకుండా మరుగునపడ్డ శాసనాలు, శిల్పాలు ఇప్పటికి అనేక చోట్ల నిరాదరణగా పడిఉన్నాయి. వాటిని శోధించి వెలికితీసే ప్రయత్నం జరగడం లేదు.

ఉమ్మడి జిల్లాలో పునర్నిర్మాణం పేరుతో  కాకతీయుల నాటి అనేక దేవాలయాలను విప్పి కుప్ప పోసారు. వాటిని ఇప్పటి వరకు తిరిగి నిలబెట్టలేదు. ప్రముఖ చరిత్రకారులు, యువ చరిత్ర అన్వేషకులు, అభిమానులు కాకతీయుల చరిత్రను తవ్వితీసే ప్రయత్నాలను తమ స్వంత ఖర్చుతో చేస్తున్నారు. అటువంటి వారికి ప్రోత్సాహం లేదు. ఆర్ధిక  సహాయం అంతకన్నా లేదు. వారు కొత్తగా కనుగొన్నవాటిని ప్రభుత్వం అధికారికంగా గ్రంధస్థం చేసే చొరవ కూడా కనిపించడం లేదు.

ఇలాగైతే ఎలా...?

ఓరుగల్లు కోటను పర్యాటకులు సందర్శించడం ఇప్పటికే ప్రయాసే. అక్కడి వరకు పర్యాటక శాఖ పరంగా రవాణా సౌకర్యం లేదు. బస్సులు, ఇతరత్రా రవాణా సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులు కోట వద్ద బస చేయడానికి వసతులు లేవు. సేదతీరడానికి అనువైన సౌకర్యాలు లేవు. కోట విశేషాలు తెలియచేసేందుకు చాలినంత మంది గైడ్లు లేరు. సాయంత్రం పేట నిర్వహించే సౌండ్‌ అండ్‌ లైట్‌ కార్యక్రమం తప్ప కోట గురించి విశేషాలు తెలుసుకునే వెలుసుబాటూ లేదు.

పర్యాటక అభివృద్ధి ఏదీ?

ఓరుగల్లు కోట పరిరక్షణకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏమీ లేవు. ఈ కోటలోని వింతలు, విశేషాలను కాపాడేందుకు ప్రయత్నాలు కూడా ఏమీ జరగడం లేదు. ప్రాచీన కట్టడాల సంరక్షణలో కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల మధ్య లోపించిన సమన్వయం, ఈ ఇరుశాఖల అధికారుల మధ్య ఉన్న అభిజాత్యం శాపంగా మారింది. కేంద్ర పురావస్తు ఆదీనంలో ఉన్నవాటిని రాష్ట్ర పురావస్తుశాఖ ముట్టుకోదు. వారు కూడా ముట్టుకోనివ్వరు. రాష్ట్ర పురావస్తుశాఖ ఆదీనంలో ఉన్నవాటివైపు కేంద్ర పురావస్తుశాఖ కన్నెత్తి చూడదు.

ఈ విభజన ఫలితంగా అత్యంత విలువైన శిల్పకళాఖండాలు, శాసనాలు, చారిత్రక విశేషాలు నిరక్ష్యానికి గురవుతున్నాయి. ఉదయ్‌ పథకం కింద వరంగల్‌కోటను అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 16 కోట్లను మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. స్థానికులతో ఏర్పడిన భూవివాదం వల్ల పనులు నిలిచిపోయాయి. దీనిని పరిష్కరించే ప్రయత్నం అధికారులు చేయడం లేదు.

కోటలో పదిహేడు వింతలు ఉన్నట్టు చెబుతారు. అవేమిటో తెలుసుకునే సమాచారం అక్కడ అందుబాటులో ఉండదు. హనుమకొండలోని కాకతీయులనాటి వేయిస్తంభాల గుడి పరిస్థితి దయనీయం. కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయ అభివృద్ధికి ఎలాంటి చర్యలు లేవు. ఆలయ ఆవరణను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేయడం మినహా ఇక్కడ ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు లేవు. కళ్యాణ మండపం పునరుద్ధరణ పనులు గత పది    సంవత్సరాలుగా సాగుతూనే ఉన్నాయి. నిధుల లేమి వల్ల మధ్యలో చాలా సంవత్సరాలు పనులు ఆగిపోయాయి. ఇటీవలే మళ్లీ మొదలైన అనుకున్నంత వేగంగా జరగడం లేదు.

ఇక జైనుల కాలం నాటిదిగా చెప్పుకునే సిద్దేశ్వరాలయం, పద్మాక్షి దేవాలయం అభివృద్ధి లేదు. పద్మాక్షి ఆలయం ఆవరణలోని జైనతీర్ధంకరులు, శాసనం సహా రూపాన్ని రంగులు పూయడం ద్వారా చెడగొడుతున్నారు. అగ్గలయ్యగుట్టను కుడా ఇటీవలే అభివృద్ధి చేసింది. ఈ గుట్టపై ఉన్న జైన తీర్ధకంరుల విగ్రహాలను చూసేందుకు మెట్లను నిర్మించింది. వీటిని చూసేందుకు వివిధ  ప్రాంతాల నుంచి వచ్చే జైన భక్తులకు ఇక్కడ ఉండేందుకు బస సౌకర్యం లేదు. స్థానికంగా ఉన్న ప్రైవేటు లాడ్జీలనే ఆశ్రయించకతప్పదు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న కాకతీయుల ప్రాచీన కట్టడాలు, శిల్పసంపదను తిలకించేందుకు పర్యాటక శాఖ కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు.  

నిధుల దుబారా

సప్తాహంలో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. కమల్‌ చంద్ర  భాంజ్‌దేవ్‌ రాక సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు నిర్వహించే కార్నివాల్‌, పేరిణి కళాకారుల నృత్యప్రదర్శనలు, ఇతర కళారూపాలు తప్ప కొత్తవి కనిపించడం లేదు. ఓరుగల్లు కోటలో ఏడు రోజులు నృత్యప్రదర్శనలు తప్ప మరేమి లేవు. హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్‌ కళాప్రాంగణంలో ప్రతీ రోజు రెండు నాటక ప్రదర్శనలు, జడ్పీ సమావేశం మందిరంలో ఒక సదస్సు, మధ్యలో కవి సమ్మేళనం, హనుమకొండ టౌన్‌ హాల్‌లో ఫోటో ఎగ్జిబిషన్‌ షరా మామూలే. నల్గొండ జిల్లాలోని కాకతీయుల కాలం నాటి పానగల్లు దేవాలయాన్ని చరిత్రకారులు సందర్శించడం. ఇవన్నీ ప్రతీ సారి నిర్వహించేవే.

ఇవి ఆధిపత్య భావజాల వేడుకలు
అందుకే బహిష్కరించాలి : ప్రజాసంఘాల నాయకులు

హనుమకొండ, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : కాకతీయ సప్తాహం వేడుకలను బ హిష్కరించాలని హేతువాద సంఘం రాష్ట్ర నాయకురాలు బి.రమాదేవి, వరంగల్‌ రచయితల సంఘం అధ్యక్షుడు నల్లెల రాజయ్య, చైతన్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి రమ మంగళవారం ఒక ప్రకటనలో పిలునిచ్చారు. వరంగల్‌ వంటి ధీరభూమిపై కాకతీయులను స్మరించుకోవడమంటే పాలకుల ఆధిపత్య విస్తరణవాద సంస్కృతిని ఎత్తిపట్టడమేనన్నారు. అందుకే ఈ వేడుకలను ఆత్మగౌరవం ఉన్న తెలంగాణవాదులు, కవులు, కళాకారులు, రచయితలు, ఆదివాసీ విద్యావంతులు, మేధావులు, ఆదివాసీ సంఘాలే కాకుండా  ప్రజాస్వామ్యవాదులు, విద్యార్ధులు  బహిష్కరించాలని పేర్కొన్నారు. ఆధిపత్య రూపం రాజ్యవ్యవస్థ నుంచి, పార్లమెంటరీ వ్యవస్థకు మారినప్పటికీ సారం మారలేదని వారు పేర్కొన్నారు. కాకతీయుల కట్టడాలను, ఆలయాలను కాపాడలేని, అభివృద్ధిపరచలేని పాలకులకు కాకతీయ వేడుకలను జరిపే హక్కులేదని వారు పేర్కొన్నారు.





కాకతీయ సప్తాహం లోగో ఆవిష్కరణ
హైదరాబాద్‌లో విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌
హనుమకొండ, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : కాకతీయ వైభవ సప్తాహం లోగోను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఆవిష్కరించారు. ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు ఏడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సప్తాహం కోసం ప్రత్యేకంగా లోగోను రూపొందించారు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రగతి భవన్‌లోని తన కార్యాలయంలో మంత్రి ఈ లోగోను విడుదల చేశారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ ఈ సందర్భంగా హాజరయ్యారు. బంగారు వర్ణంలో కాకతీయ కళాతోరణం, మధ్యలో సింహం ఆకారంతో కూడిన కాకతీయుల కీర్తి ముఖం డిజిటలైజ్‌ శిల్పకళాఖండం, దాని వెనుకభాగాన కాకతీయుల వైభవానికి ప్రతీకగా వెలుగులు చిమ్ముతున్న కిరణాలు, అడుగుభాగాన మెరూన్‌ రంగు స్ట్రిప్‌పై కాకతీయ వైభవ సప్తాహం జూలై 7-13-2022 అని రాసిన అక్షరాలతో కళాత్మకంగా లోగోను రూపొందించారు. గతంలో కాకతీయు ఉత్సవాలు నిర్వహించినప్పుడు లోగోలో కీర్తితోరణం మధ్యలో గుర్రంపై రాణి రుద్రమదేవి చిత్రాన్ని ఉంచారు. కానీ కీర్తిముఖం చేర్చడం ఈ సారి ప్రత్యేకత. ఈ శిల్పం అన్ని కాకతీయుల శిల్పాలపైన కనిపిస్తుంది. నంది విగ్రహాలపైన కూడా కనిపిస్తుంది.

Updated Date - 2022-07-06T05:46:57+05:30 IST