టీడీపీ మేయర్‌ను ఎలాగైనా గద్దెదించాలని..

ABN , First Publish Date - 2021-09-16T07:13:35+05:30 IST

కాకినాడ మేయర్‌ను..

టీడీపీ మేయర్‌ను ఎలాగైనా గద్దెదించాలని..
కాకినాడలో కార్పొరేటర్లతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ద్వారంపూడి

దించేద్దాం!

కాకినాడ మేయర్‌ను గద్దెదించేందుకు వైసీపీ సన్నాహాలు మొదలు
కార్పొరేటర్లతో రహస్య సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ద్వారంపూడి
32 మంది వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల నుంచి సంతకాల సేకరణ
కొత్త మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎవరనేది ఎంపికపై ద్వారంపూడిదే తుది నిర్ణయం


కార్పొరేషన్‌(కాకినాడ):
కాకినాడ మేయర్‌ను పావనిని గద్దెదించేందుకు వైసీపీ సన్నాహాలు మొదలయ్యాయి. నాలుగేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో మేయర్‌ను మార్చేందుకు చట్టం వీలుండడంతో ఇప్పుడు మేయర్‌ను దించేందుకు ఎమ్మెల్యే ద్వారంపూడి పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ కాకినాడ కార్పొరేషన్‌ పాలకవర్గం టీడీపీ చేతిలో ఉంది. దీంతో టీడీపీకి చెందిన మేయర్‌ సుంకర పావనిని ఎలాగైనా గద్దెదించాలని ద్వారంపూడి గట్టిపట్టుదలతో ఉన్నారు. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన కొత్తలో మేయర్‌ను దించాలని ద్వారంపూడి ప్రయత్నించినా నాలుగేళ్ల వరకు మేయర్‌ను దించడానికి చట్టం అడ్డంగా ఉండడంతో ఓపికపట్టారు. ఇప్పుడు నాలుగేళ్లు పూర్తవడంతో తన పంతం నెరవేర్చుకునేందుకు వ్యూహాలు మొదలుపెట్టారు.


అందులోభాగంగా బుధవారం కాకినాడలోని తన డీకన్వెన్షన్‌ హాల్‌లో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లతో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రహస్య సమావేశం నిర్వహించారు. మేయర్‌ను దింపడానికి అంతా సహకరించాలని పిలుపునిచ్చారు. కానీ సంఖ్యాబలం ప్రకారం కొత్త మేయర్‌ను వైసీపీ నుంచి ఎంపిక చేసే అవకాశం లేదు. ఈనేపథ్యంలో ఇటీవల రెండో డిప్యూటీ మేయర్‌ను టీడీపీ నుంచి ఎంపికచేసినట్టుగానే కొత్త మేయర్‌ను కూడా టీడీపీ నుంచే తమకు అనుకూలంగా వ్యవహరించే వారిని గద్దెనెక్కించాలని ఎమ్మెల్యే పావులు కదుపుతున్నారు. దీనికి వైసీపీ కార్పొరేటర్ల నుంచి సుముఖత లేకపోయినా సంఖ్యాబలం లేని నేపథ్యంలో నిస్సహాయంగా మారారు.


అయితే సొంత కార్పొరేటర్ల నుంచి అసమ్మతి రాకుండా ప్రస్తుత మొదటి డిప్యూటీ మేయర్‌ను కూడా దించి ఆ స్థానంలో వైసీపీ కార్పొరేటర్లలో ఒకరిని గద్దెనెక్కించనున్నారు. మరోవైపు టీడీపీ నుంచి కొత్త మేయర్‌ ఎవరనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 40వ డివిజన్‌కు చెందిన సుంకర శివప్రసన్న, 47వ డివిజన్‌కు చెందిన వెంకటలక్ష్మి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తన భార్య ప్రసన్నను మేయర్‌గా ఎంపికచేసేలా ఆమె భర్త సుంకర సాగర్‌ పావులు కదిపి ఎమ్మెల్యే ద్వారంపూడికి దగ్గరయ్యారు. అంతా అనుకున్నట్టుగానే ఎమ్మెల్యే ఈమె పేరునే ఖరారు చేస్తారా? లేదా ఇంకొకరిని కూర్చోబెడతారా? అనేది ఉత్కంఠ నెలకొంది. ఇటు మేయర్‌ మార్పు పరిణామాలపై పావని కుటుంబం ఆందోళనగా ఉంది. కానీ ఈమె వెనుక టీడీపీ కార్పొరేటర్ల బలం పెద్దగా లేకపోవడం మైనస్‌గా మారింది.


అయితే కొత్త మేయర్‌ ఎంపికపై ఎన్నిక నిర్వహిస్తే టీడీపీ కార్పొరేటర్ల అభిప్రాయం కీలకం కానుంది. వీరిలో సింహభాగం మంది ద్వారంపూడి చెప్పినట్టు నడుస్తున్నారు. ఈనేపథ్యంలో కొత్త మేయర్‌ ఎన్నిక సమయంలో టీడీపీ విప్‌ జారీ చేసినా ప్రభావం చూపించదనే వాదన వినిపిస్తోంది. దీంతో ద్వారంపూడి ప్రతిపాదించిన కార్పొరేటర్‌నే టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు మేయర్‌గా ఎన్నుకోనున్నారు. కాకపోతే కొత్త మేయర్‌ ఎవరైనా అధికారికంగా మళ్లీ టీడీపీ నుంచే ఎన్నిక కానుండడం విశేషం. కాగా త్వరలో మరో ఇద్దరు కార్పొరేటర్ల సంతకాలు పూర్తి చేయించి మొత్తం 34 మంది సభ్యుల వినతితో కూడిన లేఖను త్వరలో కలెక్టర్‌కు ఎమ్మెల్యే ద్వారా ఇచ్చి కొత్త మేయర్‌ ఎంపికకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరనున్నారు.


గత కొంతకాలంగా మేయర్‌ను దించాలనే విషయమై కాకినాడ కార్పొరేషన్‌లో చర్చ జరుగుతోంది. సొంత పార్టీ కార్పొరేటర్లు మేయర్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. వీరిలో 21 మంది వైసీపీతో సన్నిహితంగా ఉంటూ మేయర్‌ మార్పు కు మద్దతిస్తున్నారు. అయితే వైసీపీ ప్రయత్నాలపై ప్రస్తుత మేయర్‌ పావని ఏం చేస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. పార్టీ నుంచి మద్దతు పొంది ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారా? లేదా? ఒంటరిగానే పోరాడతారా? అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే మేయర్‌ మార్పుపై న్యాయపరంగా పోరాడేందుకు పావని వర్గం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2021-09-16T07:13:35+05:30 IST