కక్ష్యలు తెంచుకుని..

ABN , First Publish Date - 2021-07-11T05:50:50+05:30 IST

ముళ్ళ కంచెలపై చక్రాలై దొర్లుకుపోతూన్న వాళ్లమూ మేమే రక్తశిక్త శిధిల దేహాలతో...

కక్ష్యలు తెంచుకుని..

ముళ్ళ కంచెలపై చక్రాలై 

దొర్లుకుపోతూన్న వాళ్లమూ మేమే

రక్తశిక్త శిధిల దేహాలతో

నిమిషానికో యుద్ధం చేస్తున్నదీ మేమే


రాకెట్‌లా దూసుకుపోతున్న మా నైపుణ్యమంతా

కులమతాలవల్లనే అనుకునే భ్రమ మీది

కక్ష్యల్ని తెంచుకొని రివ్వున ఎగిసే మా ప్రతిభలకి

మీ వంశ నామాల మీసాలు తగిలించకండి


ఏడాదికి పద్నాలుగు సార్లు

అంట్లు ముట్లుగా ముక్కలు చెక్కలయ్యి

ధైర్యం నెత్తురై ప్రవహిస్తేనే

అంతరిక్షం మమ్ములను అక్కున చేర్చుకుని

నక్షత్ర మండలం అంచులపైకి చేరవేసింది


నింగిని నేలను మింగేసే మంత్రదండం

అధికారపు దాహం తీరని తిమింగిలాల దండు

రోజుకో రంగుని తనలో ఇముడ్చుకుని

రంగులతో పనిలేని సగం ఆకాశాన్ని

ఇంకా ఈడ్చి తన్నుతూనే ఉంటే

ఏ రంగులూ అవసరంలేని

సంపూర్ణ ఆకాశంగా మనిద్దరం

మిగులుతామని నేనెప్పటికీ అనుకోను!


చివరిగా ఒకమాట


పిల్లలకి పాలిచ్చే అమ్మలందర్నీ

భూమధ్యరేఖ మీద వరుసగా నిలబెట్టండి

ఈ దేశం గాలిని శ్వాసిస్తున్న

నా ఊపిరి మీద ఒట్టు

నింగి నేల...నక్షత్రమండలంతో సహా

సమస్త భూగోళమంతా పాలుతాగే పసిగుడ్డుగా

మారుతుందని నాది హామీ..

వైష్ణవి శ్రీ

(నేడు శిరీష అంతరిక్ష యానం)

Updated Date - 2021-07-11T05:50:50+05:30 IST