Madhuraiలో రూ.114 కోట్లతో కలైంజర్‌ గ్రంథాలయం

ABN , First Publish Date - 2022-01-12T15:34:30+05:30 IST

మదురైలో రూ.114 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కలైంజర్‌ గ్రంథాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. గతేడాది జూన్‌ 3వ తేదీన మాజీ

Madhuraiలో రూ.114 కోట్లతో కలైంజర్‌ గ్రంథాలయం

                 -  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా Stalin శంకుస్థాపన


చెన్నై: మదురైలో రూ.114 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కలైంజర్‌ గ్రంథాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. గతేడాది జూన్‌ 3వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 97వ జయంతి సందర్భంగా మదురైలో కలైంజర్‌ పేరుతో అతిపెద్ద గ్రంథాలయాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఆ గ్రంథాలయ నిర్మాణానికి తొలివిడతగా రూ.15 కోట్లు విడుదల చేశారు. ఆ గ్రంథాలయానికి అవసరమైన గ్రంథాలు, డిజిటల్‌ గ్రంథాలు, ఆన్‌లైన సంచికలు, పరిశోధక గ్రంథాలను కొనుగోలుకు రూ.10కోట్లు కేటాయించారు. ఆ గ్రంథాలయంలో ఏర్పాటు చేయడానికి సాంకేతిక పరికరాల కొనుగోలుకు రూ.5 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. 

ఏడంతస్థుల భవనం... : మదురై పుదునత్తం రోడ్డు ప్రజాపనులశాఖ ప్రాంగణంలోని 2.70 ఎకరాల్లో, 2,13,288 చదరపుటడుగుల విస్తీర్ణంలో ఈ గ్రంథాలయాన్ని నిర్మించనున్నట్లు స్టాలిన్‌ తెలిపారు. వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేసిన అనం తరం సీఎం మాట్లాడుతూ.. ఎనిమిదంతస్తులతో ఆ భవన సముదాయం నిర్మితమవుతుందని తెలిపారు. ఆ గ్రంథాలయంలో 27 విభా గాలకు చెందిన గదులుంటాయని, భవన ప్రవేశద్వారం వద్ద కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. దిగువ అంతస్థులో దివ్యాంగుల విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సీసీ కెమెరాలు, దృశ్యశ్రవణ సదుపాయం ఉంటుందన్నారు. 250 మంది, 200 మంది కూర్చునేలా రెండు విశాలమైన హాళ్లు కూడా నిర్మించనున్నామని, ఏడు అంతస్థుల్లో ఎయిర్‌ కండిషన్‌ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏడాదిలోగా ఈ గ్రంథాలయ నిర్మాణం పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఏవీ వేలు, పి.మూర్తి, పళనివేల్‌ త్యాగరాజన్‌, అన్బిల్‌ మహేష్‌, రాష్ట్ర పాఠ్యపుస్తకాల సంస్థ అధ్యక్షుడు ఐ.లోయిన, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, ప్రజాపనుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి దయానంద్‌ కఠారియా, పాఠశాలల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డి.కార్తికేయన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-12T15:34:30+05:30 IST