ltrScrptTheme3

కళావేదిక వారి "బాలు స్వరాంజలి".. న్యూజెర్సీలో గాన గంధర్వునికి ఘన నివాళి

Oct 3 2021 @ 11:15AM

ఎడిసన్, న్యూ జెర్సీ: ప్రముఖ కూచిపూడి కళాకారిణి స్వాతి అట్లూరి తమ స్వఛ్ఛంద సంస్థ కళావేదిక ఆధ్వర్యంలో స్వర్గీయ ఎస్.పి బాల సుబ్రహ్మణ్యంకు శ్రద్ధాంజలి అర్పిస్తూ, "బాలు స్వరాంజలి" పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలు ఆశయాలను నెరవేర్చే ప్రయత్నంతో భాగంగా వారి స్ఫూర్తితో వారు చేపట్టిన ఎన్నో మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళాలనే సదుద్దేశంతో స్థాపించబడిన ఈ సంస్థ నిర్వహించిన కార్యక్రమం ఇది. న్యూజెర్సీలోని దత్త పీఠం, శ్రీశివ, విష్ణు ఆలయంలోని ఈవెంట్ హాల్‌లో సెప్టెంబర్ 24, 2021 శనివారం సాయంత్రం 5.30గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు(అమెరికా కాలమానం ప్రకారం) ఈ కార్యక్రమం జరిగింది.

ఈ స్వరాంజలి కార్యక్రమంలో ప్రముఖ గాయనీ గాయకులైన ఉష, సుమంగళి, శ్రీకాంత్ సండుగు పాల్గొన్నారు. సెయింట్ లూయీస్‌కు చెందిన వింజమూరి సాహిత్య ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కళావేదిక సంస్థ అడ్వైజర్ కమిటీ సభ్యులైన అట్లాంటాకు చెందిన ఫణి డొక్కా ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన బాలుతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపేంద్ర చివుకుల(కమిషనర్ న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్), స్టెరిలీ.ఎస్.స్టాన్లీ (అసెంబ్లీ మేన్), శాంతి నర్రా (మిడిల్ సెక్స్ కౌంటీ కమిషనర్ డిప్యూటీ డైరెక్టర్), శాం జోషి (ఎడిసన్ టౌన్షిప్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్) విచ్చేశారు.

తానా, ఆటా, నాట్స్, టాటా, టీఎల్‌సీఏ, టీఎఫ్‌ఏఎస్, ఎన్నారైవీఏ, సిలికానాంధ్ర, సాయి దత్త పీఠం శివ విష్ణువు ఆలయం వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొనడం విశేషం. బాలు పాడిన కొన్ని మధుర గీతాలను ఆలపిస్తూ ఉష, సుమంగళి, శ్రీకాంత్ ప్రేక్షకులను అలరించారు. మధ్యలో మెరుపులా మెరుస్తూ తన చక్కని వ్యాఖ్యానంతో సమయస్ఫూర్తితో వింజమూరి సాహిత్య ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం చక్కగా నడిపించారు. బాలు తనను ఆశీర్వదించిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆయన మానస పుత్రికగా కీర్తింపబడే ఉష, ఒకటి రెండు వీడియో క్లిపింగ్స్ పంచుకున్నారు. 

సంస్థ అధ్యక్షురాలు స్వాతి మాట్లాడుతూ, తమ సంస్థ ఉద్దేశాన్ని ప్రేక్షకులకు తెలియజేశారు. దీంతో అందరి నుంచి అపూర్వమైన స్పందన లభించింది. ఎంతోమంది సహృదయులు ముందుకు వచ్చి, అప్పటికప్పుడు విరాళాలు అందించి తమ ఉదారతను చాటుకున్నారు. అట్లూరి వందన మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయమవ్వడానికి కారణమైన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్వరాంజలి కార్యక్రమం వచ్చినవారందరికీ ఒక తృప్తిని, చక్కని అనుభూతులను మిగిల్చింది. అందరూ మరోసారి ఆ గాన గంధర్వుడిని స్మరించుకుచేలా చేసింది. వారి ఆశయాలను పూర్తిచేయడానికి పునరంకితులమౌతామని నిశ్చయంచేసుకుని వారు సెలవు తీసుకున్నారు.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.