కాళేశ్వరం గుదిబండను దించాల్సింది కేంద్రమే!

ABN , First Publish Date - 2022-09-20T06:38:39+05:30 IST

నిన్నటి వరకు ప్రపంచ ఇంజనీరింగ్‌ అద్భుతంగా ప్రశంసలు పొందిన ‘కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టు’ (కేఎల్‌ఐపీ) ఇప్పుడు దేశంలోనే అత్యంత చెత్త ఇరిగేషన్ ప్రాజెక్టుగా మారిపోయింది...

కాళేశ్వరం గుదిబండను దించాల్సింది కేంద్రమే!

నిన్నటి వరకు ప్రపంచ ఇంజనీరింగ్‌ అద్భుతంగా ప్రశంసలు పొందిన ‘కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టు’ (కేఎల్‌ఐపీ) ఇప్పుడు దేశంలోనే అత్యంత చెత్త ఇరిగేషన్ ప్రాజెక్టుగా మారిపోయింది. ఇద్దరు కేంద్ర మంత్రులు ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టు పంపుల నిర్వహణ వ్యయం గుదిబండగా మారనుందని సెప్టెంబర్‌ 2న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ పేర్కొన్నారు. నిర్వహణ వ్యయం ఏటేటా పెరుగుతూ ఆర్థికంగా మోయలేని స్థాయికి చేరుతుందనేది ఆమె ఉద్దేశం. 8.25శాతం నుంచి 10.9శాతం భారీ వడ్డీ రేట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం గడ్డుకాలాన్ని చవిచూడనుందని ఆమె హెచ్చరించారు. కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ గత నెల రెండో వారంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు. అసలు ఈ ప్రాజెక్ట్‌కు చట్టబద్ధ అనుమతుల్లేవని, డిజైన్లలో సాంకేతిక లోపాలు ఉండడం వల్లే మూడు బ్యారేజీలకి సంబంధించిన పంపుహౌజ్‌లు నీటమునిగాయని ఆయన అన్నారు. ఇంతకూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సౌకర్యాలు, ఆర్థిక సహాయం అందించడంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ఏమీ లేదా? లేదన్న భావన కలిగించడానికే కేంద్ర మంత్రులు ఆ ప్రకటనలు చేసినట్టు అర్థమవుతోంది. నిజమేమిటి? ఆ ఇద్దరు కేంద్ర మంత్రులకు ఎలాంటి సంబంధమే లేదా? సత్యాసత్యాలను తరచి చూద్దాం.


కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందే నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల పేరుతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. తదనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాజెక్టులోని కొన్ని భాగాలకు పునః రూపకల్పన జరిపి అంచనా వ్యయాన్ని భారీగా పెంచారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చారు. అసాధారణ నిర్మాణ వేగం, భారీ వ్యయం కారణంగా ఈ ప్రాజెక్టు పట్ల దేశంలో హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రాజెక్టుపై డిస్కవరీ ఛానల్‌ రూపొందించిన డాక్యుమెంటరీతో సహా జరిగిన ప్రచారం మీడియాలో సంచలనం సృష్టించింది. వాస్తవానికి డిస్కవరీ ఛానల్‌ కార్యక్రమం ఒక వాణిజ్య ప్రకటనను తలపించింది!


ప్రాజెక్టు ప్రతిపాదనలపై మదింపు జరిపి వాటికి సాంకేతిక అనుమతులివ్వడం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘కేంద్ర జల సంఘం’ (సీడబ్ల్యూసీ) బాధ్యత. సీడబ్ల్యూసీ అత్యున్నత స్థాయి అధికారుల బృందం 2018 జనవరిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించింది. ప్రాజెక్టు అప్రైజల్‌ ఆర్గనైజేషన్‌(పీఏఓ) చీఫ్‌ ఇంజనీర్‌ సీకేఎల్‌ దాస్, పీఏఓ డైరెక్టర్‌(సౌత్‌) ముఖర్జీ, సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ (హైడ్రాలజీ) నిత్యానంద్‌ రాయ్, డైరెక్టర్‌(కాస్ట్‌ అప్రైజల్‌) రాజీవ్‌ కుమార్‌ ఈ బృందంలో ఉన్నారు. ‘కాళేశ్వరం ఇంజనీరింగ్‌ అద్భుతం. వినూత్నమైనది. దేశంలో గాని బయట గాని ఇలాంటి ప్రాజెక్టును మేము చూడలేదు’ అని సందర్శన అనంతరం సీకేఎల్‌ దాస్‌ మహోత్సాహంతో ప్రకటించారు. ‘రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులకూ ప్రయోజనం కలిగించే సమీకృత ప్రాజెక్టు కాళేశ్వరం. చాలా ప్లస్‌ పాయింట్లను ఈ ప్రాజెక్టు కలిగి ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. తొమ్మిది అనుమతులను ఫాస్ట్‌ట్రాక్‌లో జారీ చేసిన సీడబ్ల్యూసీకి ప్రాజెక్టుపై సంపూర్ణ అవగాహన ఉంది. ఆ అనుమతులే లేకుంటే ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమయ్యేది కాదు.


నాబర్డ్‌ చీఫ్‌ చింతాల గోవిందరాజులు 2021 డిసెంబర్‌లో ప్రాజెక్టును సందర్శించి రైతాంగానికి లబ్ధి కలిగించనున్న ఇంత అద్భుతమైన ప్రాజెక్టును నిర్మిస్తునందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసించినట్టు వార్తలొచ్చాయి. అంతకు ముందే, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, ఆంధ్రబ్యాంకులు 2017లోనే ప్రాజెక్టుకు రుణాలు మంజూరు చేశాయి. 2019 జూన్‌ 21న జరిగిన ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో నాటి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ పాల్గొన్నారు. ‘అద్భుతం.. ఊహకు అందనిది’ అని 2018లో పలు దఫాలుగా ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా నరసింహన్‌ బహిరంగంగా కొనియాడారు. కాబట్టి ఆర్థిక సంస్థలతోపాటు, అనేకమంది రాజకీయనాయకులు, కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్ ఈ ప్రాజెక్టును ప్రశంసించినట్టు స్పష్టమవుతోంది.


సమాచార హక్కు చట్టం కింద కరీం అనే వ్యక్తి సేకరించిన సమాచారం ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుకు 6 బ్యాంకులు/ఆర్థిక సంస్థలు 15 భారీ రుణాలు అందించాయి. వీటి మొత్తం రూ.97,449 కోట్లు. రుణాలు ఇచ్చిన బ్యాంకులు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా. కేంద్ర ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, నాబార్డు, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌. అంటే కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలే 90శాతం రుణాలను అందించినట్టు విశదమవుతోంది. ఈ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తిరిగి చెల్లింపుల మొత్తం అసలు, వడ్డీతో కలిపి రూ.1,69,022.52 కోట్లు.


గోదావరి నది నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున ఏటా మొత్తం 200 టీఎంసీలను తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇందులో 144 టీఎంసీలు సాగునీటికి, 10 టీఎంసీలు గ్రామీణ తాగునీటి సరఫరాకి, 30 టీఎంసీలు హైదరాబాద్‌ నగరానికి, 16 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు వాడనున్నట్టు డీపీఆర్‌లో పేర్కొంది. ఈ మేరకు నీటిని ఎత్తిపోయడానికి ఏటా 13,558 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం కానుంది. ప్రస్తుత విద్యుత్‌ టారీఫ్‌ను పరిగణలోకి తీసుకుంటే విద్యుత్‌ బిల్లులు కనీసం రూ.10వేల కోట్లు కానున్నాయి.


‘కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌’ (కేఐపీసీ) రుణాల తిరిగి చెల్లింపులతో పాటు వ్యవస్థ నిర్వహణకు ఏటా రూ.25,000 కోట్ల ఖర్చు కానుంది. కేఐపీసీకి ఆదాయ అర్జన లేనందున రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్‌ నుంచి రూ.25వేల కోట్లను ఏటా కేటాయించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వాటా, ఇతర వ్యయాలను కలుపుకుంటే వాస్తవ వ్యయం రూ.25వేల కోట్లకు పైనే ఉండనుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలపై ఇది రానున్న రెండు దశాబ్దాల పాటు తీవ్ర దుష్పరిణామాలు చూపనున్నది. కాళేశ్వరం కార్పొరేషన్‌ను ఒక ప్రైవేటు కంపెనీగా పరిగణిస్తే దీనిని తక్షణమే దివాళా తీసిన కంపెనీగా ప్రకటించాల్సి ఉంటుంది!


కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రస్తుత సమస్యల నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలదు? ఏం చేయాలి? ఆర్థికంగా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల (ఫైనాన్షియల్‌ వయబిలిటీ)పై సమగ్ర సమీక్ష కోసం ఆర్బీఐ ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. కాళేశ్వరం కార్పొరేషన్‌ రుణాలను తిరిగి చెల్లించదని తేలితే అది దివాళా తీసినట్టు ప్రకటించాలి. ప్రైవేటు కంపెనీల తరహాలోనే కాళేశ్వరం కార్పొరేషన్‌ విషయంలో సైతం వ్యాపార దివాళా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి; ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతుల జారీకి అవలంభించిన ప్రక్రియను సమీక్షించి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో అనుమతుల జారీకి ముందు మెరుగైన రీతిలో మదింపు జరిపేలా మార్గదర్శకాలను సవరించాలి; సాంకేతిక లోపాలు ఉన్నట్టు కేంద్ర మంత్రి పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలపై భవిష్యత్తు విపత్తులను నివారించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై స్వతంత్ర సమీక్ష జరిపించాలి.


కాళేశ్వరం ప్రాజెక్టును ఆమోదించడం, రుణాలు అందించడంలో కేంద్ర ప్రభుత్వం, అనుబంధ సంస్థలు స్పష్టమైన బాధ్యతను కలిగి ఉన్నాయి. ఈ లోపభూయిష్టమైన ప్రాజెక్టు ద్వారా రాజకీయ లబ్ధిపొందడం మాని కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రిత్వ శాఖలు తమ బాధ్యతలను గుర్తించి పరిష్కార ప్రక్రియను చేపట్టాలి. ఆర్థిక సంస్థలు బాధ్యత వహించి చెడు రుణాలందించినందుకు పర్యవసానాలను ఎదుర్కోవాలని పౌర సమాజం డిమాండ్‌ చేయాలి. భవిష్యత్తు తరాల ప్రయోజనాలను తాకట్టు పెట్టి అడ్డగోలుగా రుణాలు పొందకుండా, కాళేశ్వరం విషాదం వంటి దుష్కర పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించడానికి అదొక్కటే మార్గం.

డాక్టర్‌ బిక్షం గుజ్జా

వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ పాలసీ ఎక్స్‌పర్ట్‌

Updated Date - 2022-09-20T06:38:39+05:30 IST