నెరవేరని సంకల్పం

ABN , First Publish Date - 2022-06-21T05:45:13+05:30 IST

నెరవేరని సంకల్పం

నెరవేరని సంకల్పం
మేడిగడ్డ బ్యారేజీ

లక్ష్యానికి దూరంగా కాళేశ్వరం ఎత్తిపోతలు

ఏటా 270 టీఎంసీలు లిఫ్ట్‌ చేసే లక్ష్యం 

మూడేళ్లలో 127.53 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోత

30 టీఎంసీలకు పైగా రివర్స్‌లో మళ్లీ గోదావరిలో కలిసిన జలాలు

రూ.3వేల కోట్లకు పైగా కరెంట్‌ బిల్లులు

భూపాలపల్లి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం ప్రాజెక్టు.. సాగు, తాగునీటి కల్పతరువు. రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలను సస్యశామలం చేయడం దీని ముఖ్యోద్దేశం. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు గోదావరి జలాలు అందించడమే ఈ పథకం లక్ష్యం. సుమారు రూ.1.20లక్షల వ్యయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మంగళవారంతో మూడేళ్లు పూర్తి చేసుకుంది. దీని ద్వారా ఏటా 270 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనే లక్ష్యం కాగా ఇప్పటి వరకు 127.53 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్‌ చేశారు. ఇక మూడో టీఎంసీ నీటిని తరలించేందదుకు ఆరు మోటార్లు సిద్ధం చేసినా ప్రారంభానికి ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లు పూర్తి చేసుకుంది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద 2016 మే 2న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీని నిర్మాణానికి భూమి పూజా చేశారు.   ఇంజనీరింగ్‌ అధికారుల కృషి, సీఎం పట్టుదలతో మూడేళ్లల్లో రికార్డు స్థాయిలో పనులు చేపట్టి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారు. 2019లో జూన్‌ 21న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సమేతంగా మేడిగడ్డ బ్యారేజీ వద్ద పూజలు నిర్వహించి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌, అప్పటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, అప్పటి ఉమ్మడి రాష్ర్టాల గవర్నర్‌ నర్సింహన్‌ తదితరులు మేడిగడ్డ బ్యారేజీ అనంతరం కన్నెపల్లి వద్ద పంపుహౌస్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో ఆరో నంబరు పంపును సీఎం కేసీఆర్‌ ప్రారంభించి కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కనుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంతో తెలంగాణ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇక సాగునీటికి కొరత ఉండదనే భరోసా రైతుల్లో వచ్చింది.  ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటిగా కాళేశ్వరం గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం ప్రస్తుతం ఫలితాలు కనిపించటం లేదు.

127.53 టీఎంసీలు మాత్రమే.. 

కాళేశ్వరం ప్రాజెక్టును 2019 జూన్‌ 21న ప్రారంభించినప్పటికీ జూలై 8 నుంచి కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోయడం షురూ చేశారు. మొదట్లో కన్నెపల్లి పంపుహౌస్‌లో 40మెగావాట్ల సామర్థ్యం ఉన్న 11 మోటార్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2020లో మరో 40మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఆరు మోటార్లను ఏర్పాటు చేసి, రోజుకు మూడు టీఎంసీల చొప్పున 90 రోజుల పాటు 270 టీఎంసీలను లిఫ్ట్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 17 మోటార్లు రన్నింగ్‌ కండీషన్‌లో ఉన్నప్పటికీ ఏ రోజు కూడా అన్నింటినీ వినియోగించి నీటిని లిఫ్ట్‌ చేసిన దాఖలాలు లేవు. రెండు, మూడు మోటార్లను మాత్రమే రన్‌ చేసి నామమాత్రంగా గోదావరి జలాలను లిఫ్ట్‌ చేశారు. ఈ మోటార్లతో గ్రావిటీ కెనాల్‌లోకి నీటి పంపింగ్‌ చేస్తే.. అక్కడి నుంచి అన్నారం బ్యారేజీలోకి కాళేశ్వరం జలాలు చేరుకుంటాయి. ప్రతి ఏటా 270 టీఎంసీలను లిఫ్ట్‌ చేయాలని లక్ష్యానికి కాళేశ్వరం ప్రాజెక్టు చేరుకోవటం లేదు. ఈ మూడేళ్ల కాలంలో  127.53టీఎంసీల నీటిని మాత్రమే అధికారులు లిఫ్ట్‌ చేయగలిగారు. వీటిలో మొదటి ఏడాది 2019 జూన్‌ 21 నుంచి డిసెంబరు 31 వరకు 37.031 టీఎంసీల నీటిని ఎగువకు ఎత్తిపోశారు. ఇక రెండో ఏడాది 2020 జనవరి నుంచి డిసెంబరు వరకు కూడా ఆశించిన స్థాయిలో నీటి ఎత్తిపోతలు లేవు. కేవలం 32.840 టీఎంసీల నీటినే ఎత్తిపోశారు. 2021లో 52.648 టీఎంసీల నీటిని ఎగువకు లిఫ్ట్‌ చేశారు. ప్రస్తుతం 2022లో మే వరకు కేవలం 5.007 టీఎంసీల నీటి ఎగువకు ఎత్తిపోశారు. ఈ మూడేళ్లలో 127.53 టీఎంసీల నీటిని కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి అన్నారం బ్యారేజీకి ఎత్తిపోసినప్పటికీ వర్షాల కారణంగా గోదావరిలోకి వరద నీళ్లు చేరటంతో తిరిగి అన్నారం బ్యారేజీ నుంచి గోదావరిలోకి లిఫ్ట్‌ చేసిన నీటిని వదిలేశారు.  మూడేళ్ల కాలంలో సుమారు 30టీఎంసీల నీళ్లు రివర్స్‌లో గోదావరిలోకి చేరాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కరెంట్‌ బిల్లులు, ఇంజనీర్ల శ్రమ వృథా అయ్యాననే విమర్శలు వచ్చాయి.

మూడో టీఎంసీకి ముహూర్తం ఎప్పుడో..?

 కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూడో టీఎంసీ నీటిని కూడా మళ్లించేందుకు చేపట్టిన పనులు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే కన్నెపల్లి పంపుహౌస్‌ వద్ద అదనంగా మరో ఆరు మోటార్లు ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 17 మోటార్లతో రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం లభించింది. అయితే ఎగువ ఆనకట్టల వద్ద మూడో టీఎంసీ లిఫ్ట్‌ చేస్తే నిల్వతో పాటు పంపింగ్‌కు కావాల్సిన మోటార్లు, కెనాల్‌, టన్నెల్‌, పంపుల నిర్మాణమైన పనులు జరుగుతున్నాయి. దాదాపు ఇవి కూడా పూర్తి కావటంతో మూడో టీఎంసీ లిఫ్ట్‌ చేసేందుకు అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. అయితే కేంద్ర జలవనరుల మండలి (సీడబ్ల్యూసీ) కాళేశ్వరం మూడో టీఎంసీ తరలింపుపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ప్రస్తుతం అనుమతులు రాకపోవటంతో వేల కోట్ల వ్యయంతో చేపట్టిన మూడో టీఎంసీ ఎత్తిపోతలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే రెండు టీఎంసీలకు మోక్షం లేదని, ఇక మూడో టీఎంసీ అనుమతుల వచ్చినా ప్రయోజనం ఏమిటనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

 రెంట్‌ బిల్లుల మోత

  కాళేశ్వరం ప్రాజెక్టు కరెంట్‌ బిల్లులు ప్రభుత్వానికి భారీగా షాక్‌ ఇస్తున్నాయి. మొదటి ఆర్థిక సంవత్సరంలో రూ.1,105 కోట్లు, 2020-21లో రూ.985కోట్లు, 2021-22లో సుమారు రూ.905కోట్ల బిల్లులు వచ్చినట్టు సమాచారం. 127.53 టీఎంసీల నీటిని లిఫ్ట్‌ చేస్తేనే సుమారు రూ.3వేల కోట్ల వరకు కరెంట్‌ బిల్లులు  రావటం చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటార్ల విద్యుత్‌ బిల్లులే. ఇక ఇతర పంపుహౌస్‌ల బిల్లులు కూడా లెక్కేస్తే ఇంకా భారీగా ఉండనున్నాయి.  మేడిగడ్డ బ్యారేజీ నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు కాళేశ్వరం జలాలను వివిధ దశల్లో తరలించడానికి ఒక టీఎంసీకి సుమారు రూ.25కోట్ల వరకు ఖర్చు అయినట్లు అంచనాలు ఉన్నాయి.  

లక్ష్యం చేరేది ఎప్పుడో..?

 కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ కూడా అందుబాటులోకి వస్తే 13 జిల్లాల్లో కొత్తగా 26,18,000 ఎకరాలకు, 16 జిల్లాల్లో 18,82,000 ఎకరాల ఆయకట్ట స్థీరికరణ జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో మొత్తంగా 45లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చని యంత్రాంగం చెబుతోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఆశించిన స్థాయిలో ఇంక ఫలితాలు రావటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా ప్రభుత్వం చెప్పుతున్నప్పటికీ మూడేళ్ల కాలంలో  20శాతం కూడా లక్ష్యాన్ని చేరుకోకపోవటం చర్చనీయాంశమైంది. లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు ద్వారా మూడేళ్లలో ఏటా సరాసరి  40టీఎంసీల నీటిని కూడా లిఫ్ట్‌ చేయటం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి తోడు వేల కోట్ల కరెంట్‌ బిల్లులతో పాటు వందలామంది ఇంజనీర్ల వేతనాలు, ఇతర సిబ్బంది జీతభత్యాల పేరుతో కొన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఆశించిన స్థాయిలో నీటి ఎత్తిపోలు లేవనే ప్రచారం జరుగుతోంది.


Updated Date - 2022-06-21T05:45:13+05:30 IST