‘కాళేశ్వరి రిఫైనరీ పరిశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2021-07-27T06:43:23+05:30 IST

వాకలపూడి కాళేశ్వరి రిఫైనరీ పరిశ్రమ నిర్వాహకులు అక్రమంగా కార్మికులను తొలగిస్తున్నారని, పర్యావరణానికి తీవ్ర హాని తలపెట్టే కాలుష్య పూరిత గ్లిజరిన్‌ డంప్‌ల ఏర్పాటుతో ప్రజలు అనారోగాలకు గురవుతున్నారని నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ-ఏఐటీయూసీ సభ్యులు డిమాండ్‌ చేశారు.

‘కాళేశ్వరి రిఫైనరీ పరిశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి’
లేబర్‌ కమీషనర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న దృశ్యం

సర్పవరం జంక్షన్‌, జూలై 26: వాకలపూడి కాళేశ్వరి రిఫైనరీ పరిశ్రమ నిర్వాహకులు అక్రమంగా కార్మికులను తొలగిస్తున్నారని, పర్యావరణానికి తీవ్ర హాని తలపెట్టే కాలుష్య పూరిత గ్లిజరిన్‌ డంప్‌ల ఏర్పాటుతో ప్రజలు అనారోగాలకు గురవుతున్నారని నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ-ఏఐటీయూసీ సభ్యులు డిమాండ్‌ చేశారు. కార్పొరేషన్‌ మూడో డివిజన్‌ గొడారిగుంటలో లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం సోమవారం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ కాళేశ్వరి రిఫైనరీ పరిశ్రమనుంచి ప్రమాదకర రసాయనాలు బయటకు వస్తున్నాయని, గ్లిజరిన్‌ పిచ్‌, యాస్‌లను అర్ధరాత్రి సమయాల్లో ఏడీబీ రోడ్డు, కెనాల్స్‌, నిర్జీవ ప్రదేశాల్లో డంప్‌ చేస్తున్నారన్నారు. గ్లిజరిన్‌ పిచ్‌లను ఎక్కడపడితే అక్కడ పారేడయంతో భూగర్భజలాలు కలుషితం కావడంతో మత్స్యసంపద క్షీణిస్తోందని, వేట్లపాలెంలో పలు పశువులు మృతిచెందాయన్నారు. పరిశ్రమ నుంచి వస్తున్న నల్లబూడిదతో స్థానికులు శ్వాసకోస వంటి అనారోగ్య రుగ్మతలబారిన పడుతున్నారన్నారు. ఈ విషయమై పలుసార్లు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు, లేబర్‌ కమిషనర్‌కి ఫిర్యాదు చేశామన్నారు. కాలుష్యంపై ప్రశ్నించిన కార్మికులను వెట్టిచాకిరీ చేయించి అక్రమంగా పనిలో నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. 17మంది కార్మికులను తొలగించారన్నారు. కాళేశ్వరి రిఫైనరీ కంపెనీ నిర్వాహకులు సమస్య పరిస్కారానికి కృషి చేయాలని, లేకపోతే ఆగస్ట్‌ 10 నుంచి కంపెనీ ఎదుట నిరవధిక నిరహారదీక్షలు చేపడతామని ఆయన హెచ్చరించారు. లేబర్‌ కార్యాలయంలోకి వెళ్లి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏసీఎల్‌ అధికారి బులిరాణికి అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు నక్కా కిషోర్‌, పీఎస్‌ నారాయణ, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి జి.లోవరత్నం, శివకోటిరాజు, నగర కార్యదర్శి టి.అన్నవరం, మత్స్యకార్మిక సంఘం నాయకులు వెంకటేశ్వరరావు, హ్యూమన్‌ రైట్స్‌ ఫోరం సభ్యులు ఏ.శ్రీను, సాయిచరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T06:43:23+05:30 IST