కలిమేడును వీడని విషాదం

ABN , First Publish Date - 2022-04-29T13:54:24+05:30 IST

తంజావూరు జిల్లా కలిమేడు గ్రామంలో అప్పర్‌ స్వామి మఠం రథోత్సవ సమయంలో విద్యుదాఘాతం కారణంగా అలముకున్న విషాదం ఆ గ్రామాన్ని వీడలేదు. ఈ

కలిమేడును వీడని విషాదం

- క్షతగాత్రులకు వైద్య బృందం చికిత్స

- ప్రాక్టికల్స్‌కు విద్యార్థి దూరం


అడయార్‌(చెన్నై): తంజావూరు జిల్లా కలిమేడు గ్రామంలో అప్పర్‌ స్వామి మఠం రథోత్సవ సమయంలో విద్యుదాఘాతం కారణంగా అలముకున్న విషాదం ఆ గ్రామాన్ని వీడలేదు. ఈ ప్రమాదంలో 11 మంది గ్రామస్థులు ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది గాయపడిన విషయం తెలిసిందే. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీరందరినీ తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు 25 మందితో కూడిన వైద్యుల బృందాన్ని ఏర్పాటుచేయగా, ఈ బృందం నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి చికిత్స అందిస్తోంది. 



తండ్రి అంత్యక్రియల వీడియో చూసిన తనయుడు..

ఈ ప్రమాదంలో కలిమేడు గ్రామానికి చెందిన సెల్వం (56) అనే రైతు మృత్యువాత పడగా, ఆయన కుమారుడు అరుణ్‌ కుమార్‌ (24) తీవ్రంగా గాయపడి తంజావూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, సెల్వం మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. దానికి హాజరుకాలేని స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్‌ కుమార్‌ తన తండ్రి అంత్యక్రియలను వీడియోలో చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ దృశ్యం ఆస్పత్రి సిబ్బందిని సైతం కన్నీరు పెట్టించింది. 


పరీక్షలకు దూరం...

ఈ ప్రమాదంలో మాధవన్‌ అనే ప్లస్‌టూ విద్యార్థి తన తండ్రి అన్బళగన్‌, అన్న రాఘవన్‌లను కోల్పోయాడు. మాధవన్‌ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. తన కళ్ళముందే తండ్రి అన్న చనిపోవడాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. దీనికితోడు మాధవన్‌ తీవ్రమైన చెవిపోటుతో బాధపడుతున్నాడు. ఇదిలావుండగా ఈ విద్యార్థికి గురువారం నుంచి ప్లస్‌టూ ప్రాక్టికల్స్‌ జరుగుతున్నాయి. దానికి హాజరుకాలేని పరిస్థితిలో మాధవన్‌ ఉండడంతో ప్రభుత్వం ఆవిద్యార్థికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

Updated Date - 2022-04-29T13:54:24+05:30 IST