Kallakurchi ఘటనపై ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్‌

ABN , First Publish Date - 2022-07-22T13:25:01+05:30 IST

కళ్లకుర్చి జిల్లాలోని చిన్నసేలం శక్తి మెట్రిక్యులేషన్‌కు చెందిన విద్యార్థిని శ్రీమతి ఆత్మహత్య తర్వాత పెద్ద ఆందోళన జరుగుతుందని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు

Kallakurchi ఘటనపై ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్‌

- ప్రారంభమైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ 

- మరో ఆరుగురి అరెస్టు 


అడయార్‌(చెన్నై), జూలై 21: కళ్లకుర్చి జిల్లాలోని చిన్నసేలం శక్తి మెట్రిక్యులేషన్‌కు చెందిన విద్యార్థిని శ్రీమతి ఆత్మహత్య తర్వాత పెద్ద ఆందోళన జరుగుతుందని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు రెండు రోజులకు ముందుగానే హెచ్చరించాయి. కానీ, జిల్లా పోలీస్‌ యంత్రాంగం పెద్దగా పట్టించుకోలేదు. విద్యార్థిని మృతికి న్యాయం కోరుతూ విద్యార్థులు, ఆందోళనకారులు ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆందోళనకారులు స్కూల్‌ ఆస్తులను ధ్వంసం చేసి అపారనష్టం చేకూర్చారు. అయితే, ఇలాంటి ఘటన జరుగుతుందని నిఘా విభాగం రెండు రోజుల ముందుగానే హెచ్చరించింది. కానీ, జిల్లా పోలీస్‌ యంత్రాంగం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. పైగా ఇది ఇంటెలిజెన్స్‌, జిల్లా పోలీస్‌ యంత్రాంగం మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసేలా ఉంది. ఇప్పటికే నిఘా విభాగం ఐజీ ఆసియమ్మాళ్‌తో పాటు కళ్లకుర్చి ఎస్పీ, జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదిలావుంటే, కళ్లకుర్చి ఘటనకు సంబంధించి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణలో భాగంగా వాట్సాప్‌ గ్రూపులు క్రియేట్‌ చేసి వందలాది మంది విద్యార్థులను ఒక చోట చేర్చినందుకు పుదుక్కోట జిల్లా ఆలంకుడి సమీపంలోని అరసమరం ప్రాంతానికి చెందిన వాట్సాప్‌ గ్రూపు అడ్మిన్‌ అయ్యప్పన్‌, ఈయన స్నేహితుడు మణిరాజాతో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఆరుగురు యువకులు వాట్సాప్‌ గ్రూపులు క్రియేట్‌ చేసి ఆందోళనకు పిలుపునిచ్చారు. అందువల్లే దాదాపు 500 మందికిపైగా విద్యార్థులు, స్థానికులు పాఠశాల దగ్గరకు చేరుకున్నట్టు పోలీసులు నిర్థారించారు. మరోవైపు, ఈ స్కూల్‌ విధ్వంస ఘటనపై సేలం సర్కిల్‌ ఐజీ ప్రవీణ్‌ కుమార్‌ అభినవ్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. ఈ బృందంలో ఎస్పీలు రాధాకృష్ణన్‌, కింగ్‌స్లిన్‌, ఏడీఎస్పీలు తిరుమాల్‌, ముత్తుమాణిక్యం, చంద్రమౌళి ఉన్నారు. ఈ బృందం బుధవారం నుంచి విచారణ ప్రారంభించగా, గురువారం కూడా విచారణ కొనసాగించింది. ఈ బృందంలో ఆరుగురు డీఎస్పీలు, 9మంది సీఐలు, సైబర్‌ క్రైమ్‌ విభాగానికి చెందిన ముగ్గురు పోలీసులు ఉన్నారు. వీరితో స్థానిక పోలీసులు కలిసి ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. 


స్కూలు వద్ద దండోరా...

ఇదిలా ఉండగా చిన్నసేలం ప్రైవేటు స్కూలు వద్ద గత ఆదివారం ఉదయం జరిగిన విధ్వంసకాండలో ఆ స్కూలులోని వస్తువులను లూటీ చేసుకున్నవారు వాటిని తిరిగి అప్పగించాలంటూ గురువారం ఉదయం దండోరా వేశారు. ఆ పాఠశాలలో లక్షలాది రూపాయల విలువ చేసే వస్తువులు దోపిడీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ విషయమై తచ్చూరు గ్రామపంచాయతీ అధికారులు దోచుకున్న వస్తువులను తిరిగి అప్పగించాలంటూ దండోరా వేయించారు.

Updated Date - 2022-07-22T13:25:01+05:30 IST