Kallakurichi Schoolgirl Death: తమిళనాడులో సంచలనం రేపిన విద్యార్థిని మృతి కేసులో సుప్రీం కీలక సూచన

ABN , First Publish Date - 2022-07-21T17:38:48+05:30 IST

తమిళనాడులో (Tamilnadu) రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన కళ్లకురిచి జిల్లా చిన్న సేలం ప్లస్-2 విద్యార్థిని అనుమానాస్పద మృతిపై (Kallakurichi Schoolgirl Death) సుప్రీం కోర్టు (Supreme Court) బాధితురాలి తండ్రికి..

Kallakurichi Schoolgirl Death: తమిళనాడులో సంచలనం రేపిన విద్యార్థిని మృతి కేసులో సుప్రీం కీలక సూచన

న్యూఢిల్లీ: తమిళనాడులో (Tamilnadu) రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన కళ్లకురిచి జిల్లా చిన్న సేలం ప్లస్-2 విద్యార్థిని అనుమానాస్పద మృతిపై (Kallakurichi Schoolgirl Death) సుప్రీం కోర్టు (Supreme Court) బాధితురాలి తండ్రికి కీలక సూచన చేసింది. తన కూతురి మృతికి సంబంధించి వెల్లడించిన పోస్ట్‌మార్టం నివేదికపై (Postmortem Report) అనుమానాలున్నాయని, ఫోరెన్సిక్ నిపుణుడి (Forensic Expert) సమక్షంలో మరోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని బాధితురాలి తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. బాధితురాలి తండ్రిని సంబంధిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా బాధిత విద్యార్థిని శరీరంపై తీవ్ర గాయాలున్నాయని, మృతి చెందడానికి ముందే ఆ గాయాలు ఏర్పడ్డాయని, ముక్కు, కుడి భుజం, కుడి చేయి, కడుపు పైభాగాన గాయాలు, దుస్తులలో రక్తపు మరకలు ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. అధిక రక్తస్రావం, దిగ్భ్రాంతి కారణంగా విద్యార్థిని మృతి చెందినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.

అసలు ఘటన ఏంటంటే..

కడలూరు జిల్లా పెరినెసలూరు గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక చిన్నసేలం సమీపంలోని ప్రైవేటు పాఠశాలలో హాస్ట్‌ల్‌లో ఉంటూ ప్లస్-2 చదువుతోంది. జులై 14న హాస్టల్ భవనం మూడో అంతస్థుపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు, కుటుంబీకులు హుటాహుటిన కళాశాలకు చేరుకున్నారు. అదే సమయంలో పోలీసులు కూడా రంగంలోకి దిగి విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు పంపారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. విద్యార్థిని అనుమానాస్పద మృతిపై న్యాయవిచారణ జరపాలని కోరుతూ చిన్నసేలం వద్దనున్న ప్రైవేట్ కళాశాల ఎదుట రహదారిపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆ సమయంలో ఆందోళనకారులు హఠాత్తుగా పోలీసులపై రాళ్లురువ్వి దాడికి దిగారు. వ్యాన్‌లో నుంచి దిగిన పోలీసులపై రాళ్ల వర్షం కురిపించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు పోలీస్ వ్యాన్‌కు నిప్పంటించి, కళాశాల ప్రవేశద్వారం పగులగొట్టి లోపలకు వెళ్లి కళాశాల బస్సులకు, అక్కడే నిలిపి ఉంచిన బైకులు, స్కూటర్లకు నిప్పంటించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అదే సమయంలో కొందరు ఆందోళనకారులు ట్రాక్టర్‌తో ఢీ కొట్టించి కళాశాల బస్సులను పూర్తిగా ధ్వంసం చేశారు.


కళాశాల గదుల్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు. ఓ గదిని పెట్రోల్ పోసి తగులబెట్టారు. కళాశాల ఎదుట పోలీసులు అడ్డుగా నిలిపి ఉంచిన ఇనుప బారికేడ్లను కూడా ఆందోళనకారులు తొలగించి వాటిని కూడా ధ్వంసం చేశారు. చివరకు పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తుపాకులతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు. అదనపు బలగాలను మొహరించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు హింసను విడనాడకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ పాండ్యన్ హెచ్చరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కళ్లకురిచి తాలూకాలో 144వ నిషేధాజ్ఞలు విధించారు. కళ్లకురిచిలో విద్యార్థిని మృతిపై జరుగుతున్న ఆందోళన విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2022-07-21T17:38:48+05:30 IST