కల్లాల్లోనే ధాన్యం!

ABN , First Publish Date - 2022-01-22T06:19:31+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోలు గందరగోళంగా, అస్తవ్యస్తంగా ఉంది. పంట నూర్చిన వెంటనే కల్లం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. ధాన్యం నింపడానికి అవసరమైన గోనె సంచులను సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు.

కల్లాల్లోనే ధాన్యం!

అన్నదాత కళ్లల్లో దైన్యం

అస్తవ్యస్తంగా కొనుగోళ్లు 8 సేకరణ లక్ష్యం 1.3 లక్షల టన్నులు

ఇంతవరకు కొన్నది ఏడు వేల టన్నులే!

గోనె సంచుల సరఫరాలో చేతులెత్తేసిన అధికారులు 

ధాన్యం రవాణాకు ఇంతవరకు ఖరారు కాని కాంట్రాక్టు

కల్లాల్లో ములుగుతున్న ధాన్యం

సొంత సొమ్ముతో గోనె సంచులు కొనుక్కుంటున్న రైతులు 

రవాణా చార్జీల్లో నాలుగో వంతే ఇస్తున్న మిల్లర్లు

రైతుల ఖాతాలకు జమ కాని సొమ్ములు

(విశాఖపట్నం/బుచ్చెయ్యపేట/ చీడికాడ/మాకవరపాలెం/దేవరాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ధాన్యం కొనుగోలు గందరగోళంగా, అస్తవ్యస్తంగా ఉంది. పంట నూర్చిన వెంటనే కల్లం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. ధాన్యం నింపడానికి అవసరమైన

గోనె సంచులను సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో రైతులు సొంతంగా సంచులను సమకూర్చుకుని ధాన్యాన్ని మిల్లులకు తరలించాల్సి వస్తున్నది. అయితే ఈ ఖర్చును భారంగా భావిస్తున్న పలువురు రైతులు...ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచేశారు. జిల్లాలో 1.3 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉండగా...ఇప్పటివరకూ కేవలం ఏడు వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.

జిల్లాలో గత ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగు ఆశాజనకంగా వుండడంతో రైతుల నుంచి లక్షా 30 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించారు. గత చేదు అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ధాన్యం రవాణా బాధ్యతల నుంచి మిల్లర్లను తప్పించి, ప్రత్యేకంగా కాంట్రాక్టర్‌లకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ధాన్యం సేకరణకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. వీటి ప్రకారం... ప్రభుత్వానికి ధాన్యం  విక్రయించాలనుకునే రైతులు తొలుత రైతు భరోసా కేంద్రంలో వివరాలు నమోదు చేయించుకోవాలి. తరువాత ధాన్యం నాణ్యత పరిశీలన తేదీని వెల్లడిస్తూ ఆర్‌బీకే/సహకార సంఘం/వెలుగు సిబ్బంది సంబంధిత రైతుకు ఒక కూపన్‌ ఇస్తారు. దీని ప్రకారం సిబ్బంది ఆయా రైతుల ఇంటికి లేదా కల్లం వద్దకు వెళ్లి నాణ్యత పరిశీలిస్తారు. నిబంధనల మేరకు వుంటే వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసి కొనుగోలు పత్రం ఇస్తారు. అనంతరం సంబంధిత రైతు వద్దకు రవాణా కాంట్రాక్టరు వెళ్లి, ఽధాన్యాన్ని గోనె సంచుల్లో నింపి కాటా వేసిన తరువాత ప్రభుత్వం చెప్పిన రైస్‌ మిల్లుకు తరలిస్తారు. ఇదే సమయంలో సహకార/వెలుగు సిబ్బంది తమ పోర్టల్‌లో రైతు పేరు, విక్రయించిన ధాన్యం వివరాలను నమోదుచేస్తారు. మూడు వారాలకు సంబంధిత రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కావాలి.


ఖరారు కాని రవాణా కాంట్రాక్టు, సరఫరా కాని గోనె సంచులు

అయితే ధాన్యం రవాణా చేసే కాంట్రాక్టును ప్రభుత్వం ఇప్పటివరకు ఖరారుకాలేదు. అంతేకాక ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచులను కూడా సరఫరా చేయలేదు. దీంతో జిల్లాలో చాలామంది రైతులు సొంత సొమ్ముతో గోనె సంచులు కొనుగోలు చేసి, ధాన్యాన్ని మిల్లుకు తీసుకువెళుతున్నారు. రవాణా ఖర్చుల కింద టన్నుకు రూ.150 చొప్పున రైతులకు మిల్లర్లు అందజేస్తున్నారు. కానీ ఊరు నుంచి మిల్లు వద్దకు ధాన్యం రవాణాకు టన్నుకు కనీసం రూ.600 అవుతున్నదని, మిల్లర్లు రూ.150 మాత్రమే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఉదాహరణకు చీడికాడ మండలం నుంచి చోడవరం మండలం ముద్దుర్తిలోని రైస్‌మిల్లుకు రెండున్నర టన్నుల ధాన్యాన్ని టాటా ఏస్‌ వ్యాన్‌లో తీసుకువెళ్లడానికి రవాణా చార్జీ కింద రూ.1,500 తీసుకుంటున్నారని, మిల్లర్‌ రూ.375 మాత్రమే ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు. మిల్లు వద్ద ధాన్యం బస్తాలను దించినందుకు కలాసీ చార్జీలు తీసుకుంటున్నారని అంటున్నారు.  


రైతుల ఖాతాలకు జమ కాని డబ్బులు

జిల్లాలో మొత్తం 1.3 లక్షల టన్నులకుగాను ఇంతవరకు ఏడు వేల టన్నులు మాత్రమే సేకరించారు. వీటికి సంబంధించి రైతులకు సుమారు రూ.13.7 కోట్ల వరకు చెల్లించాలి. ధాన్యం విక్రయించిన 21 రోజులకు రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్న ప్రభుత్వం ప్రకటన ప్రకారం...గత నెలాఖరునాటికి ధాన్యం విక్రయించిన రైతులకు సుమారు ఏడు కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. దీనిలో 10 నుంచి 20 శాతం మాత్రమే చెల్లింపులు జరిగినట్టు తెలిసింది.

Updated Date - 2022-01-22T06:19:31+05:30 IST