సీబీఐకి కళ్లెం

ABN , First Publish Date - 2022-04-08T07:16:01+05:30 IST

పాత్రికేయుడు, చరిత్రకారుడు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా మాజీ అధ్యక్షుడు ఆకార్ పటేల్ విషయంలో ఢిల్లీ కోర్టు గురువారం ఇచ్చిన ఆదేశాలు సముచితమైనవి....

సీబీఐకి కళ్లెం

పాత్రికేయుడు, చరిత్రకారుడు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా మాజీ అధ్యక్షుడు ఆకార్ పటేల్ విషయంలో ఢిల్లీ కోర్టు గురువారం ఇచ్చిన ఆదేశాలు సముచితమైనవి. ఆకార్‌కు వ్యతిరేకంగా జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ)ని ఉపసంహరించుకోవడంతో పాటు, ఆయనను క్షమాపణలు కోరవలసిందిగా న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. మీకు కలిగిన కష్టానికి చింతిస్తున్నామంటూ సీబీఐ డైరక్టర్ లిఖితపూర్వకంగా క్షమాపణలు కోరితే ఈ అత్యున్నతస్థాయి సంస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందనీ, దాని గౌరవం ఇనుమడిస్తుందనీ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. జర్నలిస్టు రాణా అయూబ్ విషయంలోనూ ఇటీవల అదేరకమైన వివాదం రేగి, న్యాయస్థానం జోక్యంతో పరిష్కారమైనప్పటికీ, ఆకార్ విషయంలో ఏకంగా సీబీఐ చేత ఇలా గుంజీలు తీయించే రీతిలో కోర్టు తీర్పు వెలువడటమన్నది విశేషమే.


అమెరికా బయలుదేరిన ఆకార్ పటేల్‌ను బెంగుళూరు విమానాశ్రయంలో చివరినిముషంలో విమానం ఎక్కనీయకుండా దింపివేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఆయనకు ఆర్థికనష్టమే కాక, మానసికక్షోభ కూడా కలిగినందున ఇతరత్రా వేదికలనుంచో, న్యాయస్థానాలద్వారానో నష్టపరిహారం పొందవచ్చునని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తాను మాత్రం సీబీఐ క్షమాపణలేఖ వల్ల బాధితుడికి ఎంతోకొంత ఉపశమనం చేకూరుతుందని భావిస్తున్నట్టు న్యాయమూర్తి పవన్ కుమార్ ప్రకటించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మీద మోదీ సర్కారు కక్షకట్టిందన్న విపక్షాల విమర్శ తెలిసిందే. ముప్పైఆరుకోట్ల విదేశీనిధుల విషయంలో సదరు సంస్థ విదేశీ విరాళాల నియంత్రణ చట్టా (ఫెరా)న్ని సదరు సంస్థ ఉల్లంఘించిందన్న ఆరోపణమీద సీబీఐ గతంలో కేసు పెట్టింది. అమెరికా పర్యటన కోసం గుజరాత్ కోర్టు నుంచి అనుమతి పొంది, దాని ఆదేశాల మేరకు తిరిగి పాస్ పోర్టు కూడా తీసుకున్న తనకు విమానం ఎక్కేముందువరకూ లుక్ ఔట్ నోటీసు ఉన్నట్టుగా తెలియదని ఆకార్ అంటున్నారు. ఎందుకు ఆపేశారని ఇమ్మిగ్రేషన్ అధికారులను అడిగితే ఎల్ఓసీ జారీ అయినట్టు తెలిసిందనీ, దాని అడ్డు తొలగించమనీ కోర్టును కోరారు. ఆకార్ స్వేచ్ఛకు సంకెళ్ళు వేసినందుకు న్యాయస్థానం సీబీఐను తీవ్రంగా మందలించింది. నిందితుడు పారిపోతాడన్న అనుమానం ఉన్నప్పుడు విచారణ దశలోనే ఎందుకు అరెస్టు చేయలేదన్నది కోర్టు ప్రశ్న. ఎంతోకాలంగా కేసు దర్యాప్తు సాగుతున్నస్థితిలో ఏ దశలోనూ పారిపోతాడన్న అనుమానం రాని సీబీఐకి విమానం ఎక్కబోతున్న ఆఖరునిముషంలో ఎల్ఓసీ ఆలోచన ఎందుకు వచ్చిందని న్యాయస్థానం ప్రశ్న. దర్యాప్తు సంస్థ ఆదేశాలను ఆకార్ ఏ దశలోనూ ఉల్లంఘించలేదన్న, సహకరించారన్న సత్యాన్ని సీబీఐ చేతనే న్యాయమూర్తి చెప్పించారు. తనపై మోదీ ప్రభుత్వం కక్షకట్టిందనీ, అందుకే, గుజరాత్ కోర్టు అనుమతి తరువాత కూడా సీబీఐ ఈ దుస్సాహసానికి పాల్పడిందని ఆకార్ ఆరోపణ. ఆహారానికి సంబంధించి బీజేపీ వాదనలను పూర్వపక్షం చేసే నిమిత్తం, నరేంద్రమోదీ కులాన్నీ, ఆహారపుటలవాట్లను తెలియచెబుతూ ట్వీట్లు చేసినందుకు ఆకార్ మీద రెండేళ్ళక్రితం ఓ కేసు నమోదైన విషయం తెలిసిందే. మైనారిటీలు తమ హక్కులకోసం బ్లాక్ లైవ్స్ మేటర్ తరహాలో ఉద్యమించాలన్నందుకు కూడా ఓ కేసు పెట్టారు. బీజేపీమీదా, దాని హిందూత్వ విధానాలమీదా తీవ్ర విమర్శలు చేసే ఆకార్ ఏ దశలోనూ తన వ్యతిరేకతను దాచుకోలేదు. మోదీ ఏలుబడిని విమర్శిస్తూ ‘ది ప్రైస్ ఆఫ్ ది మోడీ ఇయర్స్’ అన్న పుస్తకం రాసినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆకార్ ఆరోపణ. జర్నలిస్టు రాణా అయూబ్ విషయంలో వారం క్రితం ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఇదేరీతిన వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆమె బ్రిటన్‌కు ప్రయాణం కట్టగానే తనముందు హాజరుకావాల్సిందిగా ఈడీ ఆదేశాలు జారీ చేసి పర్యటన రద్దుచేసుకొనే పరిస్థితి కల్పిస్తే, న్యాయస్థానం కాపాడుకొచ్చింది.  


సీబీఐ డైరక్టర్‌ని ఇలా క్షమాపణలు వేడుకోమంటూ కోర్టు ఆదేశించడం స్వతంత్రభారత చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. తమకు తోచినప్పుడు, నచ్చినరీతిలో ఎలాగైనా విరుచుకుపడవచ్చునుకొనే దర్యాప్తు సంస్థలకు ఈ తీర్పు చెంపదెబ్బ. ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా, చట్టాలకూ నిబంధనలకూ అతీతంగా ఏమైనా చేయగలశక్తి తమకు ఉన్నదని అనుకొనే సంస్థలకూ, వాటిని ఉసిగొల్పుతున్న నేతలకూ ఈ తీర్పు ఓ హెచ్చరిక. న్యాయస్థానాలు తలుచుకుంటే, బుల్డోజర్లను సైతం బోల్తాపడవేయగలవన్న నమ్మకాన్ని సామాన్యులకు ఇది అందిస్తున్నది.

Updated Date - 2022-04-08T07:16:01+05:30 IST