కల్యాణమస్తు..కష్టమే!

ABN , First Publish Date - 2022-09-17T05:21:50+05:30 IST

మాది సంక్షేమ ప్రభుత్వం అంటూ ఊదగొడుతున్న పాలక పెద్దలు లబ్ధిదారుల తగ్గింపే లక్ష్యంగా పథకాలకు ఆంక్షలు పెడుతూ అమలుకు సిద్ధమవుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఒక్కో పథకాన్ని అటకెక్కించిన ప్రస్తుత ప్రభుత్వం తిరిగి ఒక్కొక్క దాన్ని బూజు దులుపుతోంది. పేరు మార్చి తిరిగి తెరమీదికి తీసుకొస్తోంది. గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలను వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసింది.

కల్యాణమస్తు..కష్టమే!

మూడేళ్ల తర్వాత పేరుమార్చి అమలు

పదవ తరగతి చదివితేనే పథకం వర్తింపు

కరెంటు ఎక్కువ వాడినా అనర్హులే

అనేక ఆంక్షలతో లబ్ధిదారుల వడపోత

ఆందోళన వ్యక్తం చేస్తున్న పేదలు

గత ప్రభుత్వం మాదిరి అమలుకు డిమాండ్‌

ఒంగోలునగరం, సెప్టెంబరు 16 : 


కల్యాణమస్తు కొందరికే.. ఇదీ సర్కారు కొత్త మార్గదర్శకాల తీరు. లబ్ధిదారుల కోతే లక్ష్యంగా అనేక నిబంధనలు తెరపైకి తెచ్చింది. గత మూడేళ్లుగా పథకం నిలిపివేయటంతో వేల దరఖాస్తులు సాంఘిక సంక్షేమశాఖ, డీఆర్‌డీఏ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా పెళ్లికానుక పథకానికి   వైఎస్సార్‌ కల్యామస్తు, వైఎస్సార్‌ షాదీతోఫా అంటూ పేరు మార్చి కొత్త మార్గదర్శకాలతో అమలు చేసేందుకు సిద్ధమైంది. అయితే అర్హులందరికీ ఈ పథకం అందే పరిస్థితి కనిపించటం లేదు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు అందాల్సిన కల్యాణమస్తు వారికి అందకుండా పోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పరిశీలిస్తే ఈ పథకం కింద లబ్ధిపొందేది కొద్దిమందే అనిపిస్తోంది. పేదింటి ఆడపిల్ల వివాహం ఆ కుటుంబానికి కష్టం కాకూడదనే ఉద్దేశంతో అమలు చేస్తున్న ఈ పథకం వారికి దక్కేలా లేదు. 


మాది సంక్షేమ ప్రభుత్వం అంటూ ఊదగొడుతున్న పాలక పెద్దలు లబ్ధిదారుల తగ్గింపే లక్ష్యంగా పథకాలకు ఆంక్షలు పెడుతూ అమలుకు సిద్ధమవుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఒక్కో పథకాన్ని అటకెక్కించిన ప్రస్తుత ప్రభుత్వం తిరిగి ఒక్కొక్క దాన్ని బూజు దులుపుతోంది. పేరు మార్చి తిరిగి తెరమీదికి తీసుకొస్తోంది. గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలను వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసింది. గత మూడేళ్లుగా అనేక పథకాలను నిలిపివేయటం, అందునా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన పథకాలనే ఎక్కువగా ఆపడం తెలిసిందే. అయితే ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండగా గత ప్రభుత్వం అమలు చేసిన పాత పథకాలకు ఇప్పుడు కొత్త పేరుతో అమలు చేసేందుకు ప్రస్తుతం సిద్ధమవుతోంది. ఇప్పటికే గత ప్రభుత్వం అంబేడ్కర్‌ విదేశీవిద్య పేరుతో అమలుచేసిన పథకాన్ని ఈ మూడేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు జగనన్న పేరుతో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వీటితో పాటు గత ప్రభుత్వం అమలు చేసిన పెళ్ళికానుక, తోఫా వంటి పథకాలను కూడా తిరిగి రాష్ట్రప్రభుత్వం తెరమీదికి తెచ్చింది. పెళ్లికానుక పథకాన్ని వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పేరుతో ఈ ఏడాది అక్టోబరు నుంచి అమలు చేయనుంది. 


పదవ తరగతి చదవితేనే....

కల్యాణమస్తు కింద ఆర్థిక సహాయం అందాలంటే ఇటు వధువు, అటు వరుడు ఇద్దరూ ఖచ్చితంగా పదవ తరగతి చదివి ఉండాల్సిందే అనే నిబంధన పెట్టారు. పట్టణాల్లో పరిస్థితి ఎలా ఉన్నా పల్లెటూళ్లలో ఎక్కువమంది పదవ తరగతి చదవరు. ఆడపిల్లల్ని అయితే ఏడవ తరగతిలోపే చదువు మాన్పించి వేస్తున్నారు. పేద కుటుంబాల్లో అయితే ఆడపిల్లను బడికే పంపించని పరిస్థితి ఉంది. ఒక వేళ పంపించినా పదవ తరగతి వరకు చదవించని వారే ఎక్కువమంది ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం అమలుచేయనున్న కళ్యాణమస్తు అందకుండా పోయే పరిస్థితి నెలకొంది. వధువు, వరుడు ఇద్దరూ చదివి ఉండాలనే నిబంధన చాలామంది అర్హులకు ఇబ్బందిగా మారనుంది.


300 యూనిట్లలోపు కరెంటు వాడినా అనర్హులే..

కల్యాణమస్తు పథకాన్ని అందించేందుకు రాష్ట్రప్రభుత్వం మరో మెలిక పెట్టింది. ఇంటి కరెంటు నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడుకుంటే ఆ కుటుంబాలు కూడా ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు అనర్హులంటూ ప్రభుత్వం పేర్కొంది. దీనికి తోడు ఇంట్లో ఎవరి పేరుతో అయినా నాలుగు చక్రాల వాహనాలు ఉన్నా అనర్హులే అంటూ మార్గదర్శకాలును విడుదల చేసింది. పట్టణాల్లో అయితే నెలకు రూ.12వేలు, పల్లెటూళ్లలో అయితే రూ.12 వేలు ఆదాయం ఉంటే వారు కూడా అ నర్హులే. మూడెకరాలు మాగాణి, లేదా 10 ఎకరాల మెట్టభూమి ఉంటే వీరికి పథకం అందదు. ఇక పట్టణాల్లో 1000 చదరపు అడుగుల స్థలం ఉంటే వీరు కూడా అనర్హులే. ఇలా అనేక కొర్రీలు వేసుకుంటూపోతే దరఖాస్తు చేసుకునేందుకు ఎంత మంది అర్హత కలిగి ఉంటారనేది ప్రశ్నర్థకమే. గత ప్రభుత్వం కంటే ఈ పథకం కింద ఇచ్చే సాయం మొత్తం ఎక్కువ అయినా లబ్ధి పొందే వారి సంఖ్యల గతం కంటే గణనీయంగా తగ్గేపోయే అవకాశం ఉంది. కల్యాణమస్తు, షాదీ తోఫా కింద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.లక్ష, బీసీలకు రూ.50వేలు, భవన నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు ఇవ్వనున్నట్లు రాష్ట్రప్రభుత్వం జీవో నంబరు 47ను విడుదల చేసింది. అయితే ఈ పథకం అమల్లో పేరు గొప్ప ఊరు దిబ్బలా మారనుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


అంతా గందరగోళం..

కాగా గతంలో పెళ్లికానుక పథకం కొంతకాలం సాంఘిక సంక్షేమశాఖ ద్వారా చివరల్లో డీఆర్‌డీఏ ద్వారా అమలు జరిగింది. అయితే ప్రస్తుతం మారిన మార్గదర్శకాల ప్రకారం వైఎస్సార్‌ కల్యాణమస్తు పథకాన్ని ఈ రెండు నుంచి కాకుండా నేరుగా సచివాలయాల ద్వారానే ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనుంది. దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికపై నేటికీ గందరగోళం నెలకొని ఉంది. ఎక్కువమంది జంటలు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికీ పై రెండు శాఖలనే సంప్రదిస్తున్నారు. వచ్చే నెల ఒకటి నుంచి అమలుకానున్న పథకంపై నేటికీ స్పష్టత కనిపించడం లేదు.


Updated Date - 2022-09-17T05:21:50+05:30 IST