Advertisement

కల్యాణం...కమనీయం!

Apr 21 2021 @ 23:46PM
కల్యాణోత్సవం జరుగుతున్న దృశ్యం

   రామతీర్థంలో శాస్ర్తోక్తంగా కల్యాణోత్సవం

                           భక్తులు లేకుండానే ముగిసిన వేడుకలు

                           కొద్దిమంది ప్రజాప్రతినిధుల హాజరు

నెల్లిమర్ల, ఏప్రిల్‌ 21:

భక్తుల జయజయధ్వానాలు లేవు. ప్రజాప్రతినిధులు...అధికారుల హడావుడి లేదు. జనం సందడి లేదు. అర్చకులు... ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు.... ఆలయ అధికారులు... సిబ్బంది నడుమ శ్రీరామ చంద్రుడు...సీతమ్మ వారికి మాంగళ్యధారణ చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో బుధవారం శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. గతంకంటే భిన్నంగా భక్తులు లేకుండా ఈ ఉత్సవాలు నిర్వహించడం గమనార్హం. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో భక్తుల హడావుడి లేకుండానే ఆలయం లోపలే నవమి వేడుకలతో పాటు సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సీతారామలక్ష్మణ విగ్రహాలను వేంచేపు చేసి అర్చకులు శాస్ర్తోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం ఆరాధన, బాలభోగం, తీర్థగోష్టి నిర్వహించారు. స్వామి వారికి అష్టకలశ స్నపన మహోత్సవం నిర్వహించారు. శ్రీరామ చంద్రుని జనన సర్గ విన్నపం పారాయణ చేసి... అనంతరం కల్యాణోత్సవాన్ని ప్రారంభించారు. అభిజిత్‌ లగ్నమందు సీతమ్మ నొసట శ్రీరామచంద్రుడు జీలకర్ర, బెల్లం పెట్టి వివాహ ఉత్సవాన్ని ఘనంగా జరిపించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కల్యాణోత్సవం మధ్యాహ్నం 1.30 గంటకు తలంబ్రాల తంతుతో ముగిసింది. అంతకుముందు కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్ర్తాలను ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అర్చకులకు సమర్పించారు. సింహాచలం దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్ర్తాలను, ముత్యాలను దేవదాయ శాఖ ఆర్‌జేసీ, విజయవాడ కనకదుర్గ ఆలయ ఈవో డి.భ్రమరాంబ అర్చకులకు అందజేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, ప్రస్తుత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ సొంతంగా పట్టువస్ర్తాలను ఆలయ అధికారులకు, అర్చకులకు సమర్పించారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఉత్సవాలపై ఆంక్షలు విధించారు. దీంతో ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండానే వేడుకలను ముగించారు. ఆలయ ప్రఽధాన అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, అర్చకులు కిరణ్‌, గొడవర్తి నరసింహాచార్యులు, పవన్‌కుమార్‌, ప్రసాద్‌ తదితరులు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆర్‌డీఓ భవానీశంకర్‌, తహసీల్దార్‌ జి.రాము, ఏంఎసీ మాజీ చైర్మన్‌ అంబల్ల శ్రీరాములునాయుడు, సుధారాణి దంపతులు పాల్గొన్నారు. దేవస్థానం ఈవో డీవీవీ ప్రసాదరావు పర్యవేక్షించారు. విజయనగరం రూరల్‌ సీఐ టి.సత్యమంగవేణి పర్యవేక్షణలో నెల్లిమర్ల ఎస్‌ఐ ఎల్‌.దామోదరరావు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సతివాడ ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బి.సాయినందిని ఆధ్వర్యంలో దేవస్థానం వద్ద ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

వాహనాలకు విరాళం

రామతీర్థం దేవస్థానానికి మంత్రి బొత్స కుటుంబ సభ్యులు రూ.14.50 లక్షల విరాళం అందజేశారు. దివంగత బొత్స గురునాయుడు, ఈశ్వరమ్మ, మజ్జి రామారావు, కళావతిల పేరిట ఈ మొత్తాన్ని విరాళంగా అందజేశారు. సీతారాముల వాహనాల తయారీకి మంత్రి బొత్స సత్యనారాయణ, ఝాన్సీలక్ష్మి దంపతులు, లక్ష్మణస్వామి వాహనం కోసం వారి కుమార్తె సోమి సత్యశ్రీ అనూష, భరత్‌కుమార్‌ ఈ మొత్తాన్ని అధికారులకు అందజేశారు. ఈ నగదుతో దే వస్థానానికి అవసరమైన గరుడ, అశ్వ, హంస వాహనాలు రూపొందించి... వాటికి బంగారు తాపడం చేస్తారు. ఈ సందర్బంగా ఝాన్సీలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. 

 

  

 


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.