తెరుచుకోనున్న కామాఖ్య ఆలయ తలుపులు... ప్రత్యేకతలివే!

ABN , First Publish Date - 2022-06-25T14:51:12+05:30 IST

కామాఖ్య ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయం...

తెరుచుకోనున్న కామాఖ్య ఆలయ తలుపులు... ప్రత్యేకతలివే!

కామాఖ్య ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయం తంత్ర-మంత్రాల పరంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. గౌహతికి 10 కిలోమీటర్ల దూరంలో నీలాంచల్ కొండపై ఉన్న ఈ కామాఖ్య ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ప్రస్తుతం ఆలయంలో అంబుబాచి మేళా జరుగుతోంది. ఈ జాతర జూన్ 22 నుంచి జూన్ 26 వరకు జరగనుంది. ప్రతి సంవత్సరం ఈ రోజుల్లో ఆలయ తలుపులు మూసి ఉంటాయి. జూన్ 26న ఆలయ పరిశుభ్రత, అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయాన్ని భక్తుల కోసం తెరవనున్నారు. ఈ ఆలయం బ్రహ్మపుత్ర నదికి సమీపంలో ఉంది.

కామాఖ్య శక్తి పీఠం పురాణం

ప్రజాపతి దక్షుని కుమార్తె సతీదేవిని శివుడు వివాహం చేసుకున్నాడు. దక్షునికి శివుడంటే ఇష్టంలేదు. దీంతో శివుడిని పదే పదే అవమానించే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. దక్షుడు ఒక యాగం నిర్వహించాడు. యాగానికి అతను దేవతలను, ఋషులను ఆహ్వానించాడు. కానీ శివుడిని, సతీదేవిని ఆహ్వానించలేదు. ఈ విషయం సతీదేవికి తెలియడంతో ఆమె తన తండ్రి వద్దకు వెళతానని శివునికి తెలిపింది. ఆహ్వానం లేకుండా మనం ఆ కార్యక్రమానికి వెళ్లకూడదని శివుడు సతీదేవిని ఒప్పించటానికి ప్రయత్నించాడు. కాని సతీదేవి తాను తండ్రి వద్దకు వెళ్లడానికి ఆహ్వానంతో పనిలేదని చెప్పింది. 


శివుడు సతీదేవిని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ సతీదేవి పట్టుబట్టి తన తండ్రి వద్దకు వెళ్ళింది. యాగ స్థలంలో దక్ష ప్రజాపతి సతీదేవి ముందు శివుడిని కించపరిచే మాటలు పలికాడు. తన భర్తను అవమానపరిచే మాటలు విని, సతీదేవి ఆగ్రహానికి గురై, అక్కడ ఉన్న యాగకుండంలోకి దూకి తన ప్రాణాలను అర్పించుకుంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న శివుడు దక్షునిపై కోపించి వీరభద్రునికి దక్షుడిని అంతం చేయమని ఆదేశించాడు. తరువాత శివుడు దగ్ధమవుతున్న సతీదేవి శరీరాన్ని ఎత్తుకుని విశ్వంలో సంచరించడం ప్రారంభించాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు.. సతీదేవి శరీరం శివుని వద్ద ఉన్నంత వరకు, అతను అమ్మవారి మాయ నుండి బయటపడలేడని భావించాడు. దీంతో విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఛిద్రం చేశాడు. అమ్మవారి శరీర భాగాలు పడినచోట శక్తిపీఠాలు స్థాపితమయ్యాయి. కామాఖ్య ఆలయ ప్రాంతంలో అమ్మవారి యోని భాగం పడింది. ఈ కారణంగా అమ్మవారి యోని భాగాన్ని ఆలయంలో పూజిస్తారు. అంబుబాచి ఉత్సవాన్ని కామాఖ్య ఆలయంలో ప్రతి సంవత్సరం జూన్ 22 నుండి జూన్ 26 వరకు జరుపుకుంటారు. ఈ రోజుల్లో అమ్మవారి ఋతుచక్రం కొనసాగుతుందని నమ్ముతారు. అందుకే ఆ రోజుల్లో ఆలయాన్ని మూసివేస్తారు. అమ్మవారి 51 శక్తిపీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో తంత్ర-మంత్ర పూజలు ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఈ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ త్రిపురసుందరి, మాతంగి, కమల ఇతర దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. 

Updated Date - 2022-06-25T14:51:12+05:30 IST