
‘విక్రమ్’ (Vikram) మూడో భాగం ఉందంటే దానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj).. అని ఈ విషయాన్ని అతన్ని అడగకుండానే చెపుతున్నట్టు ‘ఉలగనాయకన్’ కమల్ హాసన్ (Kamal Haasan) పేర్కొన్నారు. అయితే, ‘విక్రమ్-3’ (Vikram 3) ఉంటుందా? లేదా? అన్నది దర్శకుడు లోకేష్ చెప్పాలన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం ‘విక్రమ్’. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా చిత్ర దర్శకుడు లోకేష్‌తో కలిసి కమల్ హాసన్ మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. ‘విక్రమ్ మూవీ వైవిధ్యభరితంగా ఉంటుంది.16 ఏళ్ళ వయసులో భారతీరాజా దర్శకత్వంలో నటించాను. అపుడు ఆయన కొత్త దర్శకుడు. ఇపుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ సినిమాలో నటించాను. ఇపుడు ఈ దర్శకుడు కొత్తవారు. కానీ, అప్పుడూ ఇప్పుడూ నేను యువకుడిగానే ఉన్నాను. ఇందులో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) నటించారు. వారు నా అభిమానులు. వారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. 1986లో వచ్చిన ‘విక్రమ్’ చిత్రానికి రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఆయన కేఎస్ రవికుమార్ వంటి కమర్షియల్ డైరెక్టర్. ఇపుడు లోకేష్ అదే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నేటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తనశైలిలో తెరకెక్కించారు. ఈ చిత్రం బిజినెస్ పరంగా బాగానే జరిగింది. ఖచ్చితంగా సక్సెస్ మీట్లో మళ్ళీ అందరిని కలుసుకుంటాను’..అని కమల్ పేర్కొన్నారు.
దర్శకుడు లోకేష్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ సినిమా రూపొందించామని, సినిమా చూశాక ఎలా ఉందో మీరే చెప్పాలి’ అని కోరారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూర్చగా.. రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మాత ఆర్.మహేంద్రన్‌తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీనుంచి వచ్చిన ట్రీలర్, సాంగ్స్ భారీగా అంచనాలను పెంచాయి. చూడాలి మరి కమల్‌కి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో.