Queen Elizabeth: మరుదనాయగమ్ సెట్‌లో క్వీన్ ఎలిజబెత్ సందడి.. గుర్తుచేసుకున్న కమల్!

ABN , First Publish Date - 2022-09-09T22:31:46+05:30 IST

బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన రాణిగా రికార్డులకెక్కిన క్వీన్ ఎలిజబెత్ 2 (Queen Elizabeth) గురువారం కన్నుమూశారు

Queen Elizabeth: మరుదనాయగమ్ సెట్‌లో క్వీన్ ఎలిజబెత్ సందడి.. గుర్తుచేసుకున్న కమల్!

చెన్నై: బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన రాణిగా రికార్డులకెక్కిన క్వీన్ ఎలిజబెత్ 2 (Queen Elizabeth) గురువారం కన్నుమూశారు. 70 ఏళ్లపాటు సింహాసనాన్ని అధిష్టించిన క్వీన్ 96 ఏళ్ల వయసులో గురువారం స్కాట్లాండ్‌లోని బల్మోరల్ క్యాస్టల్‌లో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ( Kamal Haasan) ఆమె మృతికి సంతాపం తెలిపారు. కమల్ హాసన్‌ను క్వీన్ ఎలిజబెత్ రెండుసార్లు కలుసుకున్నారు.1997 క్వీన్ భారత్‌లో పర్యటించినప్పుడు ఓసారి, ఆమె నివాసమైన బకింగ్‌హ్యామ్ పాలెస్‌లో 2017లో రెండోసారి కమల్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె తన సినిమా షూట్‌కు హాజరైన విషయాన్ని కమల్ గుర్తు చేసుకున్నారు. 


కమల్ హాసన్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మరుదనాయగమ్ (Maruthanayagam ) సినిమా షూటింగ్ సెట్‌ను 1997లో క్వీన్ ఎలిజబెత్ సందర్శించారు. ఆ తర్వాత ఆ సినిమా అటకెక్కింది అది వేరే సంగతి. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి (Karunanidhi)తో కలిసి క్వీన్ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. దీనిని గుర్తు చేసుకున్న కమల్‌ హాసన్.. క్వీన్ ఎలిజబెత్ మరణం తనను చాలా బాధించిందని ట్వీట్ చేశారు. బ్రిటిషర్లు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ఆమెను ప్రేమించిందని పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం ఆమె తమ ఆహ్వానాన్ని మన్నించి మరుదనాయగమ్ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారని అన్నారు. ఆమె తన జీవితంలో హాజరైన తొలి సినిమా షూటింగ్ అదే కావొచ్చని అన్నారు. 


2017లో తాను లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను సందర్శించినప్పుడు క్వీన్‌ను కలిసినప్పటి ఫొటోను కమల్ ట్వీట్ చేశారు. ఐదేళ్ల క్రితం ఓ సాంస్కృతిక కార్యక్రమంలో క్వీన్ కలిసిన జ్ఞాపకాలు ఇంకా పదిలంగానే ఉన్నాయి. ఈ సందర్భంగా రాజ కుటుంబానికి, బ్రిటన్ ప్రజలకు తన ప్రగఢ సానూభూతి తెలిపారు.   


18వ శతాబ్దానికి చెందిన పోరాట యోధుడు ముహమ్మద్ యూసుఫ్ ఖాన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించాలనుకున్న ఈ సినిమాకు కమల్ హాసన్ నిర్మిస్తూ దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. అప్పట్లోనే రూ. 85 భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే, ఆ తర్వాతి నిధుల కొరత కారణంగా సినిమా ఆగిపోయింది. ఈ సినిమాలో హాలీవుడ్  నటి కేట్ విన్స్‌లెట్‌కు ‘మార్ష’ అనే ప్రధాన పాత్రను ఆఫర్ చేసినప్పటికీ తిరస్కరించారు. సినిమాలో పాత్రధారుల కోసం కమల్ యూరప్‌లోనూ అన్వేషించారు. గ్రాండ్ చెన్నై ఈవెంట్‌లో లాంచ్ చేసిన టీజర్‌లో క్వీన్ ఎలిజబెత్ కూడా కనిపించారు. ఆ టీజర్ ఓ యుద్ధ సన్నివేశం. దాని చిత్రీకరణకు  కోటి రూపాయలకు పైగా ఖర్చయింది 


ఎవరీ మరదనాయగమ్?

బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీలోని మద్రాస్ ఆర్మీలో మరుదనాయగమ్ పిల్లై (1725-15 అక్టోబర్ 1764) కమాండెంట్‌‌గా పనిచేశారు. బ్రిటిష్ ఇండియాలోని పనైయూర్‌ గ్రామంలో ఓ తమిళ కుటుంబంలో జన్మించారు. ఇప్పుడా గ్రామం రామనాథపురం జిల్లా నైనార్‌కోయిల్ తాలూకాలో ఉంది. చిన్నప్పుడే ఇస్లాం మతం స్వీకరించి ముహమ్మద్ యూసుఫ్ ఖాన్‌గా మారారు. అనంతరం ఖాన్ సాహిబ్‌గా పేరుకెక్కిన ఆయన మదురైకి పాలకుడిగా మారారు. అటు తర్వాత ఆర్కాట్ దళాల యోధుడిగా మారారు. అటు పిమ్మట బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీలో కమాండెంట్ అయ్యారు. దక్షిణ భారతదేశంలోని పాలిగార్ తిరుగుబాటును అణచివేసేందుకు  బ్రిటిష్, ఆర్కాట్ నవాబు ఆయనను నియమించారు. మదురై నాయక్ పాలన ముగియడంతో మదురై దేశాన్ని పరిపాలించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. 


ఆ తర్వాత బ్రిటిష్, ఆర్కాట్ నవాబుతో వివాదం తలెత్తడంతో ఖాన్‌ను పట్టుకునేందుకు ఆయన సహచరులు ముగ్గురికి లంచం ఇచ్చి పురికొల్పారు. ఈ క్రమంలో ఓ రోజు ఉదయం ప్రార్థన చేస్తున్న సమయంలో పట్టుబడ్డారు. 15 అక్టోబరు 1764లో మదురై సమీపంలోని సమ్మతిపురంలో ఉరి తీశారు. అయితే, అంతకుముందు రెండుసార్లు ఉరితీయడానికి ప్రయత్నించగా ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో మూడోసారి పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఆయన శరీరాన్ని ఉరితీసి ముక్కలుగా నరికి తమిళనాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో పూడ్చిపెట్టినట్టు చెబుతారు. ఈ కథనే మరుదనాయగమ్ పేరుతో తెరకెక్కించాలని కమల్ హాసన్ ప్రయత్నించినా ఆ తర్వాత వివిధ కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది.



Updated Date - 2022-09-09T22:31:46+05:30 IST