అమెరికా.. భారత్‌కు సహజ భాగస్వామి

Sep 25 2021 @ 02:40AM

ఇరుదేశాలకూ ఒకే విలువలు, భౌగోళిక రాజకీయ ఆసక్తులు

రెండు దేశాల సహకారం, సమన్వయం పెరుగుతున్నాయి: మోదీ

ప్రజాస్వామిక సూత్రాలు, వ్యవస్థలను కాపాడుకోవాలి: కమలా హ్యారిస్‌


వాషింగ్టన్‌, సెప్టెంబరు 24: భారత్‌-అమెరికా దేశాలను సహజ భాగస్వాములుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇరుదేశాలకూ ఒకేరకమైన విలువలు, భౌగోళిక, రాజకీయ ఆసక్తులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లిన మోదీ మొదటి రోజు ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారి్‌సతో వైట్‌హౌ్‌సలో సమావేశమయ్యారు. ఇరుదేశాల నడుమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. వీరిద్దరూ ముఖాముఖి భేటీ కావడం ఇదే మొదటిసారి. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ఇండో-పసిఫిక్‌, ప్రజాస్వామ్య పరిరక్షణ, అఫ్ఘానిస్థాన్‌ సహా పరస్పర, అంతర్జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలు వీరి భేటీలో చర్చకు వచ్చాయి. అనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌, అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా నడుమ సమన్వయం, సహకారం క్రమంగా పెరుగుతున్నాయని మోదీ తెలిపారు. ‘‘ప్రపంచంలో చాలామందికి మీరు స్ఫూర్తి. బైడెన్‌, మీ నాయకత్వంలో భారత్‌-అమెరికా ద్వైపాక్షిక భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరుకుంటుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది’’ అని మోదీ హ్యారి్‌సను కొనియాడారు. 


‘‘భారతదేశం తీవ్ర కొవిడ్‌ వేవ్‌ను ఎదుర్కొంటున్న దశలో మనం మాట్లాడుకున్నాం. అప్పుడు మీరు తెలిపిన సహానుభూతి, కుటుంబంలో ఒక సభ్యురాలిలాగా మాట్లాడిన తీరు నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.’’ అని హ్యారి్‌సకు మోదీ తెలిపారు. అమెరికాలోని నలభై లక్షల మంది భారతీయులు.. ఇరు దేశాల నడుమ స్నేహవారధిలాగా పనిచేస్తున్నారన్నారు. కమలాహ్యారి్‌సను, ఆమె భర్త డగ్లస్‌ ఎంహో్‌ఫను భారత్‌కు రావాల్సిందిగా మోదీ ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని కమలా హ్యారిస్‌ అంగీకరించారు. 


కమలా హ్యారిస్‌ ఏమన్నారంటే..

భారతదేశాన్ని అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా కమలా హ్యారిస్‌ అభివర్ణించారు. ‘‘ప్రపంచాన్ని మరింత సురక్షితంగా, బలంగా చేసేందుకు చరిత్ర అంతటా మన రెండు దేశాలూ కలిసి పనిచేశాయి. కలిసి నిలిచాయి’’ అని మోదీతో పేర్కొన్నారు. స్వేచ్ఛాయుతమైన ఇండోపసిఫిక్‌ ప్రాంతానికి అమెరికా కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రజాస్వామ్యాలు ప్రమాదంలో ఉన్నాయని.. ప్రజల ప్రయోజనాల రీత్యా వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత రెండు దేశాలపై ఉందని హ్యారిస్‌ అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఇండో-పసిఫిక్‌ ప్రాంతం, అఫ్ఘానిస్థాన్‌, అంతరిక్ష రంగంలో సహకారం, ఐటీ, ఆరోగ్య రంగం, రెండు దేశాల్లో కొవిడ్‌-19 పరిస్థితి సహా పలు అంశాలపై మోదీ-హ్యారిస్‌ చర్చించినట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. కమలాహ్యారి్‌సతో భేటీకి ముందు.. ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పీఎం స్కాట్‌మోరిసన్‌తో, జపాన్‌ ప్రధాని సుగాతో సమావేశమయ్యారు.  


కమలా హ్యారిస్‌కు అపురూప కానుకలు

అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి వ్యక్తి అయిన కమలాహ్యారిస్‌కు ప్రధాని మోదీ పలు అపురూపమైన కానుకలు అందించారు. వాటిలో ముఖ్యమైనది.. ఆమె తాతగారు, భారత ప్రభుత్వంలో సీనియర్‌ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసిన వి.గోపాలన్‌కు చెందిన పాత అధికారిక ప్రకటనల తాలూకూ ప్రతి. ఆ ప్రతిని చక్కటి చెక్క ఫ్రేములో పెట్టి ఆమెకు మోదీ బహూకరించారు. దాంతోపాటు.. గులాబీ మీనాకారీ చదరంగపు బల్ల, పావులను కూడా మోదీ ఆమెకు కానుకగా ఇచ్చారు. గులాబీ మీనాకారీ.. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ప్రాంతానికి చెందిన సుప్రసిద్ధ కళ. అద్భుతమైన రంగుల్లో మెరిసిపోయే గులాబీ మీనాకారి కళాఖండాలను విదేశీయులు వారణాసిలో ప్రత్యేకంగా కొనుగోలు చేస్తుంటారు. కాగా.. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌కు ప్రధాని మోదీ వెండి గులాబీ మీనాకారి పడవ బొమ్మను కానుకగా ఇచ్చారు. బౌద్ధంపై ప్రత్యేక ఆసక్తి ఉన్న జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగాకు గంధపుచెక్కతో తయారుచేసిన బుద్ధుడి బొమ్మను మోదీ బహూకరించారు. 

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.