భారతీయ అమెరికన్లపై యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రశంసలు!

ABN , First Publish Date - 2022-05-25T00:20:59+05:30 IST

అమెరికా రాజకీయాల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్న భారతీయ అమెరికన్లపై ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రశంసలు కురిపించారు.

భారతీయ అమెరికన్లపై యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రశంసలు!

ఎన్నారై డెస్క్: అమెరికా రాజకీయాల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్న భారతీయ అమెరికన్లపై ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రశంసలు కురిపించారు. ప్రతి రోజూ అమెరికా ప్రజాజీవనంలో సమానత్వం, అవకాశాలు మెరుగయ్యేందుకు భారత సంతతి వారు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మే 23న వాషింగ్టన్ డీసీలో జరిగిన ‘ఇండియన్ అమెరికన్  ఇంపాక్ట్ ప్రాజెక్ట్ సమ్మిట్ అండ్ గాలా’ కార్యక్రమంలో కమలా హ్యారిస్ ప్రసంగించారు. అగ్రరాజ్యం అభివృద్ధిలో ఆసియా దేశాల వారి పాత్రకు గుర్తింపుగా అమెరికా ప్రభుత్వం మే నెలను ‘ఏషియన్ అండ్ పసిఫిక్  ఐల్యాండర్ హెరిటేజ్ నెలగా’ ప్రకటించింది. ఈ క్రమంలో ఏర్పాటైన ఇండియన్ అమెరికన్  ఇంపాక్ట్ ప్రాజెక్ట్ సమ్మిట్‌లో కమలా హ్యారిస్ పాల్గొన్నారు. 


కార్యక్రమంలో ప్రసంగించిన కమలా హ్యారిస్  తన మాతృమూర్తి ప్రస్తావన కూడా తెచ్చారు. ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలనే కలను సాకారం చేసుకునే క్రమంలో తన తల్లి ఎంతో కష్టపడ్డారని ఆమె తెలిపారు. తన తల్లి క్యాన్సర్ వ్యాధిపై రీసెర్చ్ చేసిన విషయాన్ని కూడా పేర్కొన్నారు. తల్లి తీరు తనపై ఎంతో గాఢ ముద్ర వేసిందన్నారు. దృఢవైఖరితో ముందడుగేస్తూ అసాధ్యాలను సుసాధ్యం చేయాలని ఆమె భారత సంతతి వారికి పిలుపునిచ్చారు. అయితే.. అమెరికాలో ఎంతోకాలంగా దక్షిణాసియా సంతతి వారు నిర్లక్ష్యానికి గురవుతున్న విషయాన్ని ఇండియా ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ మఖాజీయా ప్రస్తావించారు. అయితే.. భారత సంతతికి చెందిన ఇంతమంది నాయకులను ఒకే వేదికపై చూస్తుంటే ఆ ఘటనలన్నీ చరిత్రలో కలిసిపోయాయన్న భావన కలుగుతున్నట్టు పేర్కొన్నారు. 



Updated Date - 2022-05-25T00:20:59+05:30 IST