నాన్న లేని జీవితం మాకొద్దని.. ఇద్దరు కూతుళ్లు ఇంటి నుంచి వెళ్లిపోయి..

ABN , First Publish Date - 2020-08-09T11:18:47+05:30 IST

పెద్ద కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, నెలకు రూ.80 వేలు జీతం. కూతురు జీవితం సుఖవంతంగా సాగుతుందనే ఆశతో తలకు మించిన భారమైనా... బంగారు నగలు, నగదు కలిసి రూ.20 లక్షలు వరకట్నంగా ఇచ్చి అట్టహాసంగా వివాహం చేశాడు.

నాన్న లేని జీవితం మాకొద్దని.. ఇద్దరు కూతుళ్లు ఇంటి నుంచి వెళ్లిపోయి..

తండ్రి మరణించిన 24 గంటల్లోపే

ఇద్దరు కూతుళ్ల బలవన్మరణం

కూతుర్ని అల్లుడి వేధిస్తున్నాడని తండ్రి ఆత్మహత్య

తండ్రి మరణ వార్త తెలిసి రాత్రే ఇంటి నుంచి వెళ్లిపోయిన కూతుర్లు

కమలాపురం వద్ద రైలు పట్టాలపై విగతజీవులుగా..

భర్త, కూతుర్ల ఆత్మహత్యలతో ఒంటరిగా మిగిలిన ఇంటి ఇల్లాలు

ప్రొద్దుటూరులో విషాదం


ప్రొద్దుటూరు(కడప): పెద్ద కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, నెలకు రూ.80 వేలు జీతం. కూతురు జీవితం సుఖవంతంగా సాగుతుందనే ఆశతో తలకు మించిన భారమైనా... బంగారు నగలు, నగదు కలిసి రూ.20 లక్షలు వరకట్నంగా ఇచ్చి అట్టహాసంగా వివాహం చేశాడు. తీరా చూస్తే అంతా మోసమని, అల్లుడికి ఉద్యోగమే లేదని, పైగా కూతుర్ని అల్లుడు వేధిస్తున్నాడనే మనస్థాపంతో ధనిరెడ్డి బాబుల్‌రెడ్డి (55) అనే తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


తండ్రి మరణించాడన్న విషయం తెలుసుకున్న కూతుర్లు శ్వేత (22), సాయిప్రీతి (19) నాన్న లేని జీవితం మాకొద్దు అని తలచి, ఇద్దరూ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. కేవలం 24 గంటల్లోపే తండ్రీ, కూతుర్లు ఆత్మహత్యలకు పాల్పడగా, ఆ ఇంటి ఇల్లాలు విజయభారతి ఒంటరిదై, భర్త, కూతుర్లను తలచుకుంటూ కుమిలిపోతూ సొమ్మసిల్లిపడిపోయింది..


ఈ సంఘటనతో పట్టణంలోని వైఎంఆర్‌ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, బాధితుల వివరాల మేరకు... పెద్దముడియం మండలం ఉలవపల్లెకు చెందిన ధనిరెడ్డి బాబుల్‌రెడ్డి కొన్నేళ్ల క్రితమే ప్రొద్దుటూరుకు వచ్చి వైఎంఆర్‌ కాలనీలో ఇల్లు బాడుగకు తీసుకుని స్థిరపడ్డాడు. ఇతను ప్రైవేట్‌గా ఎలక్ర్టీషియన్‌ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. భార్య విజయభారతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్వేత, చిన్న కుమార్తె సాయిప్రీతి.


ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం గ్రామానికి చెందిన రామిరెడ్డి చంద్రఓబులరెడ్డి కుమారుడు సురేష్‌కుమార్‌రెడ్డి హైదరాబాదులో ఓ పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడని, నెలకు రూ.80 వేలు జీతం అని చెప్పడంతో.. ఇతనితో పెళ్లి చేస్తే కూతురు జీవితం సుఖంగా ఉంటుందని భావించి, కట్నం విషయంలో తలకు మించిన భారమైనా... బంగారు నగలు, నగదు కలిపి రూ.20 లక్షలు వరకట్నంగా ఇచ్చి సురేష్‌కుమార్‌రెడ్డితో గత ఏడాది మేలో ఘనంగా వివాహం జరిపించాడు.


శ్వేతతో కలిసి సురేష్‌కుమార్‌రెడ్డి హైదరాబాదులో కాపురం పెట్టాడు. అతడికి ఉద్యోగం లేకపోవడంతో పుట్టింటి నుంచి ఖర్చుల కోసం డబ్బులు తేవాలంటూ సురేష్‌కుమార్‌రెడ్డి శ్వేతను వేధించసాగాడు. ఈ వేధింపులు తాళలేక శ్వేత పుట్టింటికి వచ్చింది. ఈ వ్యవహారంలో కొందరు పెద్దలు పంచాయితీ చేశారు. వరకట్నంగా ఇచ్చిన నగదు శ్వేత పేరిట బ్యాంక్‌ అకౌంట్‌లో వేయాలని, బంగారు నగలు శ్వేతకే ఇవ్వాలని, అపుడే శ్వేత నిన్ను నమ్మి కాపురానికి వస్తుందని పెద్ద మనుషులు పంచాయితీ చేశారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం సురేష్‌కుమార్‌రెడ్డి అత్తింటికి వచ్చి శ్వేతను కాపురానికి పంపాలని గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే శ్వేత కాపురం గురించి కలత చెందిన బాబుల్‌రెడ్డి శుక్రవారం ఇంటి నుంచి బయటికి వచ్చి జమ్మలమడుగు బైపాస్ వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


తండ్రి మరణించాడనే సమాచారం తెలియడంతో... నాన్న లేని జీవితం మాకొద్దు అనుకున్నారో ఏమో శ్వేత, సాయిప్రీతిలు ఇద్దరు శుక్రవారం సాయంత్రమే ఆటోలో ఎక్కిపోతుండగా, తల్లి విజయభారతి గమనించింది. ఆమె కూడా మరో ఆటోలో వారిని వెంబడించింది. అయితే ఆమె ఎక్కిన ఆటో డీజిల్‌ కోసం పెట్రోలు బంకులో ఆగగా, కూతుర్లు ఎక్కిన ఆటో కన్పించలేదు. అయితే ఆ ఆటో ఎర్రగుంట్ల వైపు వెళ్లడంతో ఆమె కూడా ఆటోలో ఎర్రగుంట్ల చేరింది. అయితే కూతుర్ల జాడ తెలియలేదు. ఈలోపు ఆమె తమ్ముళ్లు తల్లికూతుర్లను వెతుకుతూ, ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌ చేరారు. అక్కడ విజయభారతి మాత్రమే ఉండటంతో రైల్వే పోలీసుల సాయంతో శ్వేత, సాయిప్రీతిల కోసం గాలించారు. అయినా ఫలితం లేదు. ఈలోపు విజయభారతిని ప్రొద్దుటూరులోని ఇంటికి చేర్చారు.


శనివారం ఉదయం శ్వేత, సాయిప్రీతిలు కమలాపురం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారన్న సమాచారం అందింది. సాయిప్రీతి స్థానిక ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. కేవలం 24 గంటల్లోపే ఒక వైపు భర్త, మరోవైపు ఇద్దరు కూతుర్లు ఆత్మహత్య చేసుకోవడంపై విజయభారతి సొమ్మసిల్లిపడిపోయింది. ఘటనపై ప్రొద్దుటూరు డీఎస్పీ సుధాకర్‌ లోసారి, రూరల్‌ సీఐ విశ్వనాధరెడ్డిలు మృతుడి భార్య విజయభారతిని, బంధువులను వేర్వేరుగా విచారించారు.


ఇదిలా ఉండగా బాబుల్‌రెడ్డి ఆత్మహత్యకు ముందు తన చావుకు అల్లుడు సురేష్‌కుమార్‌రెడ్డినే కారణమంటూ, అతడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ వీడియో తీసి తన మేనల్లుడుకు పంపాడు.  ఈ మేరకు మృతుడి సమీప బంధువు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై అల్లుడు సురేష్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.


Updated Date - 2020-08-09T11:18:47+05:30 IST