ఆ కామాంధుడెక్కడ?

ABN , First Publish Date - 2021-09-16T08:01:57+05:30 IST

ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడెక్కడ? కరడుగట్టిన నేరగాళ్లను సైతం ఇట్టే పట్టేసే ఘనమైన రికార్డు ఉన్న హైదరాబాద్‌ నగర పోలీసుల కళ్లు గప్పి ఆ నిందితుడు ఎలా పారిపోయాడు? ఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా..

ఆ కామాంధుడెక్కడ?

  • హత్యాచార నిందితుడు రాజు ఓల్డ్‌సిటీలో?
  • రూ.1800తో పరారైనట్లు గుర్తించిన పోలీసులు
  • హత్యాచారం తర్వాత 4 గంటలపాటు బస్తీలోనే.. 
  • పాప దొరికిందా అని అడగడంతో రాజుపై అనుమానం
  • ఇంటి తాళం పగలగొట్టి చూసేందుకు స్థానికుల యత్నం
  • అడ్డుకున్న పోలీసులు.. అర్ధరాత్రి దాకా వెతకడంతో ఆలస్యం
  • ఏడాది క్రితం వరకూ సూర్యాపేటలో నివసించిన నిందితుడు
  • అక్కడ అతని బంధుమిత్రులను విచారిస్తున్న పోలీసులు


హైదరాబాద్‌ సిటీ, సూర్యాపేట, చౌటుప్పల్‌ రూరల్‌, మోత్కూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడెక్కడ? కరడుగట్టిన నేరగాళ్లను సైతం ఇట్టే పట్టేసే ఘనమైన రికార్డు ఉన్న హైదరాబాద్‌ నగర పోలీసుల కళ్లు గప్పి ఆ నిందితుడు ఎలా పారిపోయాడు? ఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా పోలీసులకు దొరక్కుండా ఎలా తప్పించుకుని తిరగగలుగుతున్నాడు? సీసీ కెమెరాలకు చిక్కిన చోటు నుంచి అతడి కదలికలను, ఎక్కడికెళ్లాడు? వెళ్తున్నాడనే విషయాలను పోలీసులు ఎలా పసిగట్టలేకపోతున్నారు? ఇవీ ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు. ఈ నెల 9న బాలికపై అఘాయిత్యానికి పాల్పడి ఆమె ప్రాణాలు తీసిన రాజు.. తన ఇంటి వద్ద నుంచి ఆ రోజు రాత్రే తప్పించుకున్నాడు.


తాను ఆరోజు పని చేసిన చోటుకు వెళ్లి తనకు రావాల్సిన రూ.1800 తీసుకున్నాడు. అంతే. ఆ తర్వాత నుంచి మాయమయ్యాడు. అంటే అతనివద్ద రూ.2 వేలకు మించి సొమ్ము లేదని పోలీసులు అంచనా వేస్తున్నారు. అంత తక్కువ డబ్బుతో అతను ఎంతో దూరం ప్రయాణం చేసి ఉండకపోవచ్చని.. తప్పకుండా అతను నగరం పరిసరాల్లోనే ఎక్కడో ఓ చోట తలదాచుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ మేరకు మూడు కమిషనరేట్లకు చెందిన వేల మంది పోలీసు అధికారులు అణువణువూ గాలిస్తున్నా అతను చిక్కకపోవడంతో.. తప్పించుకోడానికి అతడు పెద్ద క్రిమినల్స్‌ను మించిన తెలివి ప్రయోగిస్తున్నాడని స్పష్టమవుతోంది.


ఆరోజు ఏం జరిగిందంటే..

ఈ నెల 9వ తేదీన రాజు మాదన్నపేటలో  భవన నిర్మాణ పనులకు కూలీగా వెళ్లాడు. పొద్దున 9 గంటలకు వెళ్లి.. సాయంత్రం 4 గంటలకు తన గదికి తిరిగొచ్చాడు. సాయంత్రం 4.30-5 గంటల మధ్యలో చిన్నారికి మాయ మాటలు చెప్పి తన రూమ్‌కు తీసుకొచ్చి లైంగికదాడి జరిపాడు. ఆమె అరుస్తుంటే గొంతు నులిమి చంపేశాడు. తర్వాత గదికి తాళం వేసి బయటకు వచ్చిన రాజు.. తాగిన మైకంలో అదే ప్రాంతంలో తచ్చాడాడు. సాయంత్రం 7గంటలకు స్థానికంగా ఉన్న పానీపూరి బండి వద్ద పానీ పూరి తిన్నాడు. అప్పటికే సింగరేణి కాలనీ వాసులందరూ పాప కోసం వెతుకుతున్నారు. రాత్రి 9 గంటలకు చిన్నారి నాయనమ్మను చూసిన రాజు.. ‘‘పాప కనిపించిందా?’’ అని ప్రశ్నించాడు. తాగిన మత్తులో రోడ్డుపై వెళ్తున్న అతను అలా ప్రశ్నించడంతో పాప నాయనమ్మకు అనుమానం వచ్చి ఇంట్లోవాళ్లకు చెప్పింది. దీంతో వారు.. పాప చెవికి ఉన్న బంగారు దుద్దుల కోసం అతడు తమ కుమార్తెను తీసుకోపోయి ఉండొచ్చని అనుమానించిన కుటుంబసభ్యులు ఆ విషయాన్ని స్థానికులకు చెప్పారు. విషయం తెలిసిన రాజు మెల్లిగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు.


స్థానికుల సాయంతో కుటుంబసభ్యులు రాజు ఉంటున్న గది వద్దకు వెళ్లగా.. గదికి తాళం వేసి ఉంది. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికులు గది తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు వద్దన్నారు. రాత్రి 12 గంటల దాకా వెతికి ఆ తర్వాత గది తాళం పగలగొట్టడంతో పాప మృతదేహం కనిపించింది. రాత్రి 9 గంటల సమయంలోనే తాళం పగలగొట్టి ఉంటే పాప ప్రాణాలతో దక్కి ఉండేదేమోనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. పాప అప్పటికే చనిపోయి ఉంటుందని, ఆమె మృతదేహాన్ని ఎక్కడైనా పారేయడానికి వీలుగా చుట్టి ఉంచాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. పాపను చంపేసిన అనంతరం మేస్త్రీ వద్దకు వెళ్లి డబ్బులు తీసుకున్న రాజు.. తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించినట్టు గుర్తించారు. సీసీ ఫుటేజి ఆధారంగా అతడి స్నేహితుణ్ని పిలిపించి విచారించగా తనకు హత్యాచార ఘటన గురించి తెలియదని చెప్పినట్టు సమాచారం. 10వ తేదీన రాజు సంతో్‌షనగర్‌, ఉప్పల్‌, మాదన్నపేట్‌ పరిసరాల్లో సంచరించి.. అక్కణ్నుంచీ ఓల్డ్‌ సిటీ వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.   


యంత్రాంగమంతా ఏకమై..

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని సైదాబాద్‌నుంచి తప్పించుకున్న నిందితున్ని గాలించడానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఏకమైంది. సైబరాబాద్‌ సీపీ ఎం.స్టీఫెన్‌ రవీంద్ర కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్టేషన్లూ అలర్ట్‌ అయ్యాయి. అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మఫ్టీ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలో ఎస్వోటి, ఎస్బీ, లోకల్‌ పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాలు నిందితున్ని గాలిస్తున్నాయి. రాజు ఆచూకీ తెలిస్తే డయల్‌ 100కి ఫోన్‌ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పబ్లిక్‌ ప్లేసులు, టోల్‌ గేట్స్‌ వద్ద, లాడ్జీల్లో ముమ్మర గాలింపు కొనసాగుతోంది. మరోవైపు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కూడా అతడి ఆచూకీ కోసం ప్రయత్నించాలని ఆర్టీసీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.


టోల్‌గేటు వద్ద..

చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద రాజు సంచరించినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పంతంగి టోల్‌గేట్‌ వద్ద రాజు నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయని, పోలీసులు వెళ్లగానే రాజు తప్పించుకున్నట్లు ప్రచారం జరగడంతో.. దర్యాప్తు జరిపి అవన్నీ ఉత్తి వదంతులేనని తేల్చారు. రాజు ఎల్‌బీనగర్‌లో సంచరించిన సీసీ ఫుటేజీ ఫొటోలను ముందస్తు జాగ్రత్తగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న అన్ని గ్రామాల సర్పంచ్‌లకూ పంపించారు. రాజును ఎక్కడ గుర్తించినా తమకు సమాచారం అందించాలని జాతీయ రహదారిపై ఉన్న ఆయా గ్రామాల సర్పంచ్‌లను, హోటల్‌, వైన్స్‌ సిబ్బందిని కోరారు. అలాగే.. ఇద్దరు ఎస్‌వోటీ పోలీసులు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని రాజు అక్కా బావ రస్తాపురం అనిత-నర్సయ్య ఇంటికి వెళ్లి నర్సయ్య తల్లి సత్తమ్మను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజు అక్కబావలను పోలీసులు ఈ నెల 10న అదుపులోకి తీసుకున్నారు. వారిని వదిలిపెట్టారా లేదా అన్నది తెలియడం లేదు.


కాగా.. రాజు హైదరాబాద్‌కు మకాం మార్చడానికి ముందు ఏడాది క్రితం సూర్యాపేటలో నివాసం ఉన్నాడు. పట్టణంలోని గోపాలపురంలో ఉన్న సిమెంట్‌ ఇటుకల తయారీ కంపెనీలో పనిచేస్తూ అక్కడే ఉన్న ఒక గదిలో భార్యతో కలిసి నివసించాడు. 18 నెలల కిందట సూర్యాపేటకు వచ్చిన రాజు దంపతులు అక్కడ ఆరు నెలలపాటు ఉన్నారు. ఆ సమయంలో రాజు మద్యం తాగి వచ్చి తరచూ భార్యతో గొడవపడేవాడని స్థానికులు చెబుతున్నారు. రాజు అక్కడి నుంచి వెళ్లే సమయంలో భార్య, కుమార్తె ఉన్నారని, ప్రస్తుతం అతడి భార్య గర్భవతి అని సమాచారం. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో గతంలో రాజు నివసించిన, పనిచేసిన చోట్ల ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.




నిందితుడిని త్వరగా పట్టుకోండి: అలీ

హైదరాబాద్‌, మహబూబాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): చిన్నారి హత్యాచార ఘటనపై సీఎం కేసీఆర్‌ సీరియ్‌సగా ఉన్నారని, నిందితుడిని త్వరగా అరెస్ట్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి మహమూద్‌ అలీ పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై పోలీస్‌ ఉన్నతాధికారులతో మంత్రి బుధవారం సమావేశం నిర్వహించారు. నిందితుడి చిత్రాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. పల్లకొండ రాజును పట్టుకుని, కఠినంగా శిక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారని.. వారిని ప్రభుత్వం తరఫున అందుకుంటామని చెప్పారని వివరించారు.  సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరోవైపు.. చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన దుండగుడిని కఠినంగా శిక్షిస్తామని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండ గట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - 2021-09-16T08:01:57+05:30 IST