దుర్గా ఫ్లై ఓవర్‌ పూర్తి

ABN , First Publish Date - 2020-08-09T09:46:55+05:30 IST

కలల వారధి కళ్ల ముందుకొచ్చింది. తీరాన తళుక్కున మెరిసింది. ఏళ్ల తరబడి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ..

దుర్గా ఫ్లై ఓవర్‌ పూర్తి

ఆంధ్రజ్యోతి, విజయవాడ : కలల వారధి కళ్ల ముందుకొచ్చింది. తీరాన తళుక్కున మెరిసింది. ఏళ్ల తరబడి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ఎట్టకేలకు ఎదుట నిలిచింది. మలుపులు మలుపులుగా.. ఇంద్రకీలాద్రికి వడ్డాణంగా.. కృష్ణాప్రవాహ పదనిసగా చూడచక్కగా ఉన్న ఈ వారధి అందాలకు దారి పరిచినట్టుగా  ముస్తాబైంది.


 కనకదుర్గ ఫ్లై ఓవర్‌ పూర్తికావడానికి ఐదేళ్లు పట్టింది. ఫ్లై ఓవర్‌ దాదాపు పూర్తయినా పది జాయింట్లను కాంక్రీట్‌తో కలపాల్సి ఉంది. బీటీ రోడ్డు, సెంట్రల్‌ డివైడర్‌, క్రాష్‌ బ్యారియర్స్‌ పనులు పూర్తయ్యాయి. రాజీవ్‌గాంధీ పార్కువైపు అప్రోచ్‌పై బీటీ పనులు, ఎలక్ర్టికల్‌ పనులు మిగిలి ఉన్నాయి. వీటన్నింటినీ మూడు వారాల్లో పూర్తిచేసి ట్రయల్‌ రన్‌కు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. 


2010లో బీజం.. 2015లో కార్యరూపం.. 2020లో పూర్తి 

కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చొరవతో ఈ ఫ్లై ఓవర్‌కు బీజం పడింది. అప్పట్లో  కేంద్రం ఈ ప్రాజెక్టుకు రూ.33 కోట్లు కేటాయించింది.  ఫ్లై ఓవర్‌కు సంబంధించి సర్వే జరపగా, భారీ వ్యయంతో కూడిన ప్రాజెక్టు అని తేల్చారు. ఆ తర్వాత  రాజగోపాల్‌ ఫ్లై ఓవర్‌ కంటే ఇన్నర్‌, ఔటర్‌ రోడ్లు అవసరమని ప్రకటించారు. అది కూడా కార్యరూపం దాల్చకపోవడంతో ఫ్లై ఓవర్‌ నిర్మించాలని టీడీపీ అర్బన్‌ నేత బుద్దా వెంకన్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర నేతలతో పాటు అధినేత చంద్రబాబును సైతం తీసుకువచ్చి ఆందోళనలను పతాక స్థాయికి తీసుకెళ్లారు. దీనికోసం ఆయన అరెస్టు కూడా అయ్యారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రాగా, ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ ఫ్లై ఓవర్‌ సాకారం కోసం ఎంతో శ్రమించారు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి మెగా ప్రాజెక్టుకు కార్యరూపం ఇచ్చారు. భారీగా పరిహారం ఇచ్చి మరీ భూమిని సేకరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఫ్లై ఓవర్‌ ప్రాజెక్టు పనులు 65 శాతం పైగా పూర్తయ్యాయి.


వైసీపీ అధికారంలోకి వచ్చాక ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని పూర్తి చేయించేందుకు రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులను కూడా తెచ్చారు. దీంతో పనులు వేగం అందుకున్నాయి. మిగిలిన 35 శాతం బ్యాలెన్స్‌ పనుల్లో 34 శాతం పూర్తయ్యాయి. ఇక ఒక శాతం పనులే మిగిలి ఉన్నాయి. ఈ పనులను మూడు వారాల్లో పూర్తిచేస్తారు.


ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 2015, డిసెంబరు 28న అపాయింట్‌ డేట్‌ ఇచ్చింది. 12 నెలల సమయంలో పూర్తి చేయాలని నిర్దేశించింది. విభిన్నమైన టెక్నాలజీ, సాంకేతికపరమైన అంశాల కారణంగా ఈ ఫ్లై ఓవర్‌ పూర్తికావటానికి ఐదేళ్ల సమయం పట్టింది. మొత్తం వ్యయం రూ.447.80 కోట్లు. ఇందులో భూ సేకరణకు సంబంధించి రూ.114.59 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు. కేంద్ర ప్రభుత్వ వాటా రూ.333.21 కోట్లు. ఈ ప్రాజెక్టు నాలుగు వరసల రోడ్డు, ఆరు లేన్ల ఫ్లై ఓవర్‌తో అంతర్భాగంగా ఉంది. కృష్ణలంక నుంచి రాజీవ్‌గాంధీ పార్కు మీదుగా కుమ్మరిపాలెం, గొల్లపూడి వరకు రూ.24.46 కోట్లతో నాలుగు వరసల రోడ్డును 5.28 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేశారు. ఆరు వరసల ఎలివేటెడ్‌ ఫ్లై ఓవర్‌ నిడివి 2.60 కి లోమీటర్లు. దీని వ్యయం రూ.211.31 కోట్లు. ఈ ప్రాజెక్టును సోమా ఎంటర్‌ప్రైజ్‌ లిమిటెడ్‌ చేపట్టింది. 


వంతెన విశేషాలు..

ఒంటి స్తంభ పిల్లర్లపై ఆరు వరసలతో నిర్మించిన కనకదుర్గ మెగా ఫ్లై ఓవర్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. స్పైన్స్‌, వింగ్స్‌ టెక్నాలజీతో రూపొందించిన వంతెనల్లో దేశంలోనే ఇది మూడోది. ఢిల్లీ, ముంబయి తర్వాత ఆ స్థానం దీనికే దక్కింది. విశేషమేమిటంటే.. ఢిల్లీ, ముంబయి నగరాల కంటే కూడా కనకదుర్గ ఫ్లై ఓవరే దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినది. స్పైన్‌-వింగ్స్‌ టెక్నాలజీతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌ అతి పొడవైనది కావటం విశేషం.

Updated Date - 2020-08-09T09:46:55+05:30 IST