Kanapur: ఎమ్మెల్యే రేఖా నాయక్‎కు వ్యతిరేకంగా పెద్ద బ్యాచ్.. ఒకవేళ తేడా వస్తే..!

ABN , First Publish Date - 2022-07-26T00:48:37+05:30 IST

ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ (Mla ajmera Rekha Nayak)నిత్యం వివాదాలతో సావాసం చేస్తున్నారు. తన వ్యవహారశైలితో సొంత పార్టీ నేతలనూ దూరం...

Kanapur: ఎమ్మెల్యే రేఖా నాయక్‎కు వ్యతిరేకంగా పెద్ద బ్యాచ్.. ఒకవేళ తేడా వస్తే..!

నిర్మల్ (Nirmal): ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్  (Mla ajmera Rekha Nayak)నిత్యం వివాదాలతో సావాసం చేస్తున్నారు. తన వ్యవహారశైలితో సొంత పార్టీ నేతలనూ దూరం చేసుకుంటున్నారు. సహజంగా అధికార పార్టీ నేతలు..విపక్షాలని, తనకు గిట్టనివారిపై కక్షసాధింపునకు పాల్పడుతుంటారు. కానీ ఆమె మాత్రం సొంత పార్టీ నేతలపైనే కేసుల వరకు వెళ్లడం వివాదాలకు దారితీస్తోంది. ఓ ఇష్యూలో టీఆర్ఎస్‌ (Trs)కు చెందిన ఎంపీపీ భర్తపై కాంట్రాక్టర్‌తో కేసు పెట్టించారనే ఆడియో కలకలం రేపింది. ఆ తర్వాత పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యేను గిరిజన సంఘాల నేతలు, బీజేపీ (Bjp), కాంగ్రెస్ (Congress) నాయకులు అడ్డుకున్నారు. వారినీ కేసుల్లో ఇరికించారని ఎమ్మెల్యే రేఖానాయక్‌పై తీవ్ర వ్యకరేకత వస్తోంది. 


పెంబి మండలంలో నిర్మించిన ఓ వంతెన ఏడాదిలోనే కూలిపోయింది. దీనిపై ఎంపీపీ భర్త భుక్య గోవింద్ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. తనను నిలదీయడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే.. అతన్ని దూరం పెట్టారు. ఈ క్రమంలో రేఖపై అసంతృప్తితో ఉన్న గోవింద్  ...ఖానాపూర్ టికెట్ ఆశిస్తున్న పూర్ణచందర్‌ నాయక్‌తో టచ్‌లో ఉంటున్నారు. ఇది సహించలేని ఎమ్మెల్యే పథకం ప్రకారం గోవింద్‌పై కేసు పెట్టించినట్టు ప్రచారం సాగుతోంది. మొదటి నుంచి ఎమ్మెల్యే రేఖా నాయక్ తీరును చాలా మంది నాయకులు అంతర్గతంగా విభేదిస్తున్నారు. అయితే అధికారంలో ఉండటంతో గత్యంతరం లేక కొందరు కొనసాగుతున్నారన్న చర్చ సాగుతోంది. 


గతేడాది మార్కెట్ కమిటీ చైర్మన్ (Market Committee Chairman) పదవికి రాజీనామా చేసిన గంగ నర్సయ్య.. ఎమ్మెల్యే తనను ఆర్థికంగా, మానసికంగా దెబ్బ తీశారని...ఆమెను రెండుసార్లు గెలిపించి తప్పు చేశామని అప్పట్లో ఆయన కన్నీరుమున్నీరుగా విలపించారు.  ఇదే నియోజకవర్గంలోని పెంబి జడ్పీటీసీ భుక్యా జానకీ బాయి అంతకుముందే పార్టీని వీడారు. ఆమెతో పాటు మరికొంతమంది సీనియర్‌ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌‌ను వీడి బీజేపీ‌లో చేరిపోయారు. పార్టీకి అంటిముట్టనట్టుగా ఉంటున్న కడెం మండలం అంబారిపేట ఎంపీటీసీ భర్త సాగర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గతంలో ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఒక  జడ్పీటీసీ ఏడాది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరో ఎంపీపీ కూడా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలకు చెందిన నేతలు ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్‌తో ఉంటున్నారు.   

 

వాస్తవానికి గత ఎన్నికల్లోనే రేఖానాయక్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆమెకు టికెట్ డౌటేనన్న ప్రచారం జరిగింది. అయినా తనదైన లాబీయింగ్‌తో టికెట్ దక్కించుకుంది. కేటీఆర్ (Ktr) చొరవతో ఓటమి నుంచి గట్టెక్కింది. అయినా ఆమె తీరు మారకపోవడంతో అధిష్టానం ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు (Santosh Rao)కు సన్నిహితుడిగా పేరున్న పూర్ణ చందర్ నాయక్ (Purna Chandar Nayak) విస్తృతంగా పర్యటిస్తున్నారు. సంతన్న కోటాలో తనకు టికెట్ వస్తుందని క్యాడర్‌ను కూడగడుతున్నాడు. అటు ఆదిలాబాద్ జెడ్పి చైర్మన్ రాథోడ్ జనార్దన్ సైతం టికెట్ ఆశతో ఉన్నారు. ఎక్కువగా ఉట్నూర్‌లో ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రిటైర్డ్ కలెక్టర్ శర్మన్ పేరు కూడా రేఖకు ప్రత్యామ్నాయంగా  వినిపిస్తోంది.


తనకు వ్యతిరేకంగా పెద్ద బ్యాచ్ తయారు అవుతుండటంపై రేఖా నాయక్ తట్టుకోలేక పోతున్నారట. వైరి వర్గాలను మొగ్గలోనే తుంచేయాలన్న సూత్రంతో పని చేస్తున్నారట. ఒకవేళ తేడా వస్తే ఏం చేయాలన్న దానిపై తనకు క్లారిటీ ఉందని అంటున్నారట. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చూడాలి.



Updated Date - 2022-07-26T00:48:37+05:30 IST