ఆధునికత... ప్రాచీన విజ్ఞానం.. రెండిటి మధ్యా విరోధం లేదు!

ABN , First Publish Date - 2022-05-27T05:30:35+05:30 IST

జగద్గురువు శ్రీ శంకరాచార్యులు స్థాపించిన పీఠాలలో కంచి పీఠం ఒకటి. భారతీయ సనాతన ధర్మ ప్రచారానికి కొన్ని వందల ఏళ్లుగా ఆలంబనగా ఈ పీఠం నిలుస్తూ వస్తోంది. మారుతున్న సమాజంలో సనాతన ధర్మం, సంస్కృతుల పాత్ర...

ఆధునికత... ప్రాచీన విజ్ఞానం.. రెండిటి మధ్యా విరోధం లేదు!

జగద్గురువు శ్రీ శంకరాచార్యులు స్థాపించిన పీఠాలలో కంచి పీఠం ఒకటి. భారతీయ సనాతన ధర్మ ప్రచారానికి కొన్ని వందల ఏళ్లుగా ఆలంబనగా ఈ పీఠం నిలుస్తూ వస్తోంది. మారుతున్న సమాజంలో సనాతన ధర్మం, సంస్కృతుల పాత్ర... వాటి పరిరక్షణకు అనుసరించాల్సిన మార్గాల గురించి కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి - ‘నివేదన’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలోని ముఖ్యమైన అంశాలు..


భారతీయ సనాతన ధర్మాన్ని ఆధునిక యుగానికి, ఆధునిక జీవనానికి ఎలా అనుసంధానం చేసుకోవాలి?

కొన్ని వేల ఏళ్లుగా భారత దేశంలో వ్యవస్థలన్నీ సమాజహితం కోసమే పనిచేస్తున్నాయి. వీటిలో ధార్మిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. అయితే కాలంతో పాటుగా మార్పులు కూడా సహజంగానే వచ్చాయి. ప్రాధమ్యాలు మారాయి. అందరకీ ఆహారం, ఉద్యోగం, అలాగే భూమిని.. పర్యావరణాన్ని కాపాడటం అనేవి ప్రధాన లక్ష్యాలుగా మారాయి. ప్రభుత్వాలు కూడా వ్యాపార, రాజకీయ అంశాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాయి. ధార్మిక, సాంస్కృతిక అంశాలపై చూపించటం లేదు. అలాగని వాటిని పూర్తిగా సమాజంపై కూడా వదిలివేయటం లేదు. ఉదాహరణకు దేవాలయాలనే తీసుకుందాం. ఇవి ప్రజలవి. సమాజానికి చెందినవి. అయితే చాలా ప్రాంతాల్లో అవి సర్కారు అధీనంలోనే ఉన్నాయి. చాలా సందర్భాలలో పాలకులు మతాన్ని అధికారం కోసం, అధికారాన్ని మతం కోసం వాడుకుంటున్నారు. ఇప్పటికీ ధర్మం, మతం ప్రభుత్వాలతో కలిసే ఉన్నాయి. ప్రభుత్వాలు మాత్రం ధర్మంతో కలిసి ఉండటం లేదు. ఇదంతా ఒక కోణం. ఇక చాలా మంది సనాతన ధర్మం అంటే పురాతనమైనదని, ఆధునిక జీవనం వైజ్ఞానికమైనదని, శాస్త్రీయమైనదని భావిస్తూ ఉంటారు. ఇది సరైంది కాదు. భారత దేశం ఒకప్పుడు వైజ్ఞానికంగా చాలా ఉన్నత స్థితిలో ఉండేది. అయితే మధ్యలో ఒక వెయ్యేళ్లు దురాక్రమణల వల్ల మనం వెనకబడిపోయాం. ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నాం. ఒక సారి వెనకబడి మళ్లీ పుంజుకుంటున్నప్పుడు- కొంత భయం, కొన్ని సంశయాలు ఉంటాయి. ఇవి క్రమేణా తొలగిపోతాయి. ఆధునికతకూ, ప్రాచీన విజ్ఞానానికీ మధ్య విరోధం లేదు. మన సంస్కృతిలో విజ్ఞానానికి పెద్ద పీట వేసి ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చాం. నా ఉద్దేశంలో మనం ఆధునికమని భావించే వ్యవస్థలన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రజాపంపిణీ విధానం, నిరుపేదల సంక్షేమం అనేది కొన్ని వేల ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఒకప్పుడు కరెంట్‌ ఉండేది కాదు. అందువల్ల వ్యవసాయానికి చెరువుల ద్వారా నీరు తీసుకురావటానికి పద్ధతులు ఉండేవి. ఇప్పుడు కొత్త ఆవిష్కరణలు వచ్చాయి కాబట్టి వాటిని వాడుకుంటున్నాం. ఈ విషయాన్ని గమనిస్తే మన దృష్టికోణంలో మార్పు వస్తుంది. 


మన దేశంలో 50 శాతానికి పైగా యువతే ఉన్నారు. వారి శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి?

నేను చాలా మంది యువతీ, యువకులను కలుస్తూ ఉంటా. అందరూ ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంలో ఉన్నవారే. ఇతరులకు సాయపడాలనుకొనేవారే! కానీ వారికి మార్గదర్శనం చేసేవారు తక్కువగా ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పుకోవాలి. ప్రస్తుతం యువతీ, యువకులకు విపరీతమైన సమాచారం అందుబాటులో ఉంది. దీని వల్ల వారికి విదేశీ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన అనేక విషయాలు చిన్న వయస్సులోనే తెలుస్తున్నాయి. ఈ పరిజ్ఞానం కూడా అవసరమే! అయితే వారికి మన దేశ సంస్కృతి, ధర్మాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోగలిగితే- వారు మంచి చెడులను తులనాత్మకంగా బేరీజు వేసుకోగలుగుతారు. వారి శక్తి సరైన మార్గంలో వినియోగమవుతుంది. అయితే యువత మన దగ్గరకు రారు. మనమే వారి దగ్గరకు వెళ్లాలి. దీనిని మేము గుర్తించాం. యువతకు సనాతన ధర్మాన్ని పరిచయం చేయటానికి కొన్ని కార్యక్రమాలు ప్రారంభించాం. సంగీతం, సాహిత్యం, వాస్తు, సంప్రదాయాలు, ధర్మాలు- ఇలా అనేక అంశాలపై వారికి సమాచారాన్ని అందించటానికి శని, ఆదివారాల్లో ప్రత్యేక పాఠశాలలు నిర్వహిస్తున్నాం. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా సంప్రదాయ పాఠశాలలను నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. 


మతం, ఆధ్యాత్మికతల మధ్య ఎలాంటి విభజన రేఖ ఉండాలి?

ఆధ్యాత్మికత ఒక్క రోజులో వచ్చేది కాదు. ఒక మనిషిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించటానికి మతం ఉంది. ప్రతి మతంలో కొన్ని ఆచారాలను నిర్దేశిస్తారు. ఉపవాసం, వ్రతాలు, నోములు, శ్రవణాలు... ఇలాంటివాటి వల్ల మనుషుల ఆలోచనలో మార్పు వస్తుంది. తాను అనుసరిస్తున్న విలువలను బేరీజు వేసుకోగలుగుతాడు. రాగద్వేషాలు తగ్గించుకొని అద్వైత భావనకు చేరుకుంటాడు. ఆధ్యాత్మికత అనేది ఒక లక్ష్యం. మతం ఒక మార్గం. అయితే ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు వాస్తవికతను మార్చిపోకూడదు. సమాజహితాన్ని కూడా ఒక లక్ష్యంగా చేసుకోవాలి. మా ఉద్దేశంలో ఇదే నిజమైన ఆధ్యాత్మికత. కానీ ప్రస్తుతం చాలామంది స్పిర్చువాలిటీ పేరుతో రియాలిటీని మర్చిపోతున్నారు. 



మహాస్వామి వారితో మీకున్న అనుబంధమేమిటి? వారు ఎలాంటి విలువలను సాధన చేసేవారు?

నేను వేదపాఠశాలలో చేరటానికి ముందే మహాస్వామివారి గురించి విన్నా. ఆ తర్వాత వారిని కలిశాను. నేను పీఠానికి వచ్చిన తర్వాత వారిని దగ్గరగా చూడటానికి అవకాశం లభించింది. సమాజాన్ని దగ్గర పెట్టుకోవాలనేది ఆయన నేర్పిన ఒక సిద్ధాంతం. నియమం, నిబద్ధత, ధర్మ పాలన, జ్ఞానం విషయంలో ఎవరు చెప్పినా వినటం మొదలైనవి ఆయన వద్ద నేర్చుకున్నవే! అంత నిడారంబరమైన వ్యక్తిని నా జీవితంలో ఎవరినీ చూడలేదు. జాతీయ, అంతర్జాతీయ విషయాలపై సంపూర్ణమైన అవగాహన ఉండేది. సనాతన ధర్మం పేరిట ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని దూరం పెట్టేవారు కాదు. కొత్త ఆవిష్కరణలను, వాటి ఆవశ్యకతను గాఢంగా నమ్మేవారు. మన భారతీయ శాస్త్రాలను, సంస్కృతిని కాపాడాలనే తపన ఆయనలో ఎక్కువగా ఉండేది. కులమతాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో చూసేవారు. దేశం, సమాజం, శాస్త్రం- ఈ మూడింటిలోను ఆయనది చాలా దీర్ఘదృష్టి. పెద్దస్వామి ఎప్పుడూ తన హోదాను ప్రదర్శించేవారు కారు. ఇతరులు చెప్పే  విషయాలు వివరంగా అడిగి తెలుసుకొనేవారు. ఆ తర్వాతే తన అభిప్రాయాన్ని ప్రేమగా చెప్పేవారు. ఇక నేను ఆయన వద్ద నేర్చుకున్న గొప్ప లక్షణాలు- నియమ పాలన, క్రమశిక్షణ. ఆయన ఉదయాన్నే పూజ చేయకుండా నీళ్లు కూడా ముట్టుకొనేవారు కాదు. 90వ వడిలో పడిన తర్వాత ఒకసారి నేను -‘ఆరోగ్యరీత్యా మీకు ఇబ్బంది అవుతుందేమో..’ అని ఏవైనా తీసుకొమ్మని నర్మగర్భంగా సూచించా. ‘నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు’ అన్నారు. అంటే ఆ వయస్సులో కూడా ఆయన క్రమశిక్షణ తప్పలేదు. అందుకే ఆయనను కోట్ల మంది ‘నడిచే దేవుడు’గా 

భావిస్తారు. 


‘‘శాంతి, వికాసాల గురించి ఆలోచించే దేశం మనది. ఇతరులకు కష్టం కలిగించే దేశం కాదు. ఈ దేశపు మట్టి స్వభావం అది. ఇది శాంతి క్షేత్రం అయినా ఇతర దేశాలు మాత్రం భౌతిక క్షేత్ర ంగా చూస్తున్నాయి. ఇక్కడ 130 కోట్ల జనాభా ఉన్నారు. ‘ఇక్కడ పప్పు అమ్మితే ఇంత లాభం వస్తుంది. నూనె అమ్మితే ఇంత లాభం వస్తుంది’ అని ఆలోచిస్తున్నాయి. దీన్నొక మార్కెట్‌గా చూస్తున్నాయి. అలాగని ఇంతకుముందు ఇక్కడ వ్యాపారం లేదా అంటే ఉంది. దాన్ని ధార్మిక రీతిలో వ్యాపారం చేసేవారు. ఈ దేశంలో వ్యాపారంలో ధర్మం ఉంటుంది తప్ప ధర్మంలో వ్యాపారం ఉండదు. 1947లో దేశ విభజన జరిగింది. 70 ఏళ్లు గడుస్తున్నా ఇంకా రక్షణ పరంగా సరైన సంసిద్ధత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మనకు శాంతి భద్రతలు ముఖ్యం. విభజన వల్ల రెండు దేశాలూ లాభపడలేదు. ఇది మనందరం కలసి పనిచేయాల్సిన సందర్భం. లోకంలో ఒకవైపు శాంతి, వికాసం కోరుకునేవాళ్లు ఉన్నారు. మరోవైపు అధికారం, బలం కోసం అర్రులు చాచేవాళ్లూ ఉన్నారు. శాంతిని కోరుకునేవాళ్లు, మనిషి ఈ పరిమితుల్లోనే బతకాలనే సిస్టమ్‌ను కోరుకునేవాళ్లు ఒక్కతాటిపైకి రావాలి. అప్పుడు ఈ నాగరికతను కాపాడగలుగుతాం. భారతదేశం వికాసం ఎవరికీ భయం కలిగించదు. భారతదేశ సంకల్పం, ఉద్దేశం వేరు. ‘అందరికీ మంచిది, అన్నిట్లో మంచిది’ అనేది ఆర్ష సంస్కృతి. ధర్మరాజు కంటికి అన్నీ మంచిగా కనిపించినట్లు భారతదేశం మంచినే చూస్తుంది. ఇక ్కడ తత్త్వశాస్త్రాన్ని మనం ప్రచారం చేయాలి.’’


సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2022-05-27T05:30:35+05:30 IST