నిలువెత్తు సామాజిక విప్లవం...!

ABN , First Publish Date - 2022-02-05T06:22:02+05:30 IST

హిందూమతాన్ని పునరుజ్జీవింప చేసిన మహోన్నత ఆచార్యత్రయంలో రామానుజుడు ఒకరు. మధ్యయుగాల భారతదేశంలో అశేష ప్రజలను ప్రభావితం చేసిన భక్తి ఉద్యమ మూలపురుషుడాయన. హిందూ సమాజంలోని....

నిలువెత్తు సామాజిక విప్లవం...!

హిందూమతాన్ని పునరుజ్జీవింప చేసిన మహోన్నత ఆచార్యత్రయంలో రామానుజుడు ఒకరు. మధ్యయుగాల భారతదేశంలో అశేష ప్రజలను ప్రభావితం చేసిన భక్తి ఉద్యమ మూలపురుషుడాయన. హిందూ సమాజంలోని సామాజిక దౌష్ట్యాలను తీవ్రంగా ఖండించిన విశాల హృదయుడు. అస్పృశ్యుల అభ్యున్నతికి నాడు -నేడు అనితర సాధ్యమైన కృషి చేసిన వారిలో రామానుజుడే అగ్రగణ్యుడనడంలో అతిశయోక్తి లేదు.


హిందూభావవాహినిలో తాత్త్విక చింతన, మత ధర్మ వివేచన పాశ్చాత్య ఆలోచనలో వలే స్పష్టంగా వేర్వేరు విషయాలు కావు. హైందవ ఋషుల, జ్ఞానుల మతధర్మ ఆధారిత తాత్త్విక భావస్రవంతిలో మతాచారాలూ సమ్మిళితమై ఉంటాయి. భారతీయ సంస్కృతీ వికాస వేకువలో చార్వాక, సాంఖ్య దర్శనాలు మతధర్మ చర్చల పట్ల ఉదాసీనత చూపాయి. వాటిని తిరస్కరించాయి. అయితే పూర్వాచార పరాయణత్వం ఆ దర్శనాలను అణచివేసింది. ఇతర దర్శనాల ప్రవర్తకుల తార్కిక ప్రతిభాపాటవాల ధాటికి చార్వాకుల, సాంఖ్యుల ప్రభావం దాదాపుగా అంతరించిపోయింది.


వాదప్రతివాదాలు హిందూ మేధ స్వతస్సిద్ధ లక్షణం. అంతిమ సత్యాన్ని తెలుసుకోవడం గురించే ఈ వాదనాప్రియ తాత్త్వికుల చర్చలన్నీ జరిగేవి. అర్థ ఛాయా భేదంలేని భావనల ప్రాతిపదికనే ఆ చర్చలు జరిగేవి. ఏ ఒక్కరూ సంప్రదాయక భావ చట్రాన్ని తిరస్కరించే వారు కాదు. ఒకే భావ చింతనలో అనంత వైవిధ్యాన్ని చూపేవారు. బుద్ధుడు, మహావీరుడు వంటి విప్లవాత్మక దార్శనికులు కూడా అదే తాత్త్విక నుడికారాన్ని ఉపయోగించేవారు. అయితే బుద్ధుడు మొదలైన చింతనాపరులు తమ సామాజిక బాధ్యతను ఎన్నడూ విస్మరించలేదు. ప్రాథమిక, సార్వత్రక సత్యాల అన్వేషణే వారి చర్చల లక్ష్యం.


‘ప్రజల నిర్దిష్ట చారిత్రక అవసరాల నుంచి ప్రభవించిన భావజాలాలే మతాలు’ అని పాశ్చాత్య తత్వ్తవేత్త హేగెల్ భావించారు. క్రైస్తవం బానిస సమాజం నుంచి ఆవిర్భవించింది. విశ్వజనీన సమానత్వం గురించిన క్రైస్తవ మతపెద్దల ప్రకటనలు బానిసత్వం నుంచి విముక్తికి పోరాడుతున్న బానిసలకు గొప్ప స్ఫూర్తినిచ్చాయి. మధ్యయుగాల భారతదేశంలో మానవ దైన్యం భరించలేనంతగా ఉండేది. అంటరానితనం, కుల వ్యవస్థ దౌష్ట్యాలు అధిగమించలేని సామాజిక అవరోధాలుగా ఉండేవి. అనివార్యంగా ఎంతో మంది మతాచారాల ఆచరణలో సాంత్వన పొందేవారు. పరిస్థితులలో మార్పులు సక్రమంగా వస్తాయని, ప్రస్తుత జీవితంలో సుగుణవంతులుగా ఉన్నవారు మరణానంతరం వెళ్ళే లోకాలలో సకల సౌఖ్యాలను పొందగలుగుతారని మతం హామీ ఇచ్చేది. ఈ చారిత్రక పరిస్థితిలో భక్తి ఉద్యమం ఎంతోమందికి ఊరట నిచ్చింది.


భక్తి ఉద్యమానికి ప్రేరణ అయిన విశిష్టాద్వైత ప్రవక్త రామానుజుడు (క్రీ.శ.1017–1137) తన తాత్త్విక సిద్ధాంతంలో మేధావులను, ధర్మశీల, విప్లవాత్మక జీవితాచరణలతో సామాన్యులను అమితంగా ప్రభావితం చేసిన, చేస్తున్న మహాత్ముడు. అద్వైత వేదాంతి ఆదిశంకరుడికి రెండు శతాబ్దాల అనంతరం, ద్వైత వాది మధ్వాచారుడికి ఆరు దశాబ్దాల ముందు భూమిపై 120 ఏళ్ళ పాటు నడయాడిన భారత ధర్మవేత్త రామానుజుడు. క్రీ.శ. 7–9 శతాబ్దాల మధ్య వైష్ణవ సంప్రదాయ ప్రవర్థకులైన పన్నెండు మంది ఆళ్వారులు రామానుజుడి మేధో, ఆధ్యాత్మిక పూర్వీకులు. ఆ ఆళ్వారులు తమ ఆరాధానా గీతాలను సంస్కృతంలో కాకుండా తమిళంలో రచించారు. తద్వారా వారు ప్రజలకు సన్నిహితమయ్యారు. ప్రజల భాషలో దైవారాధనలను వెలయించిన ఆళ్వారుల సంప్రదాయాన్ని సంపూర్ణంగా గౌరవించి, వైష్ణవ ఆలయాల్లో ఆ మహాభక్తుల ‘పాశురాల’ (గీతాలు)ను ప్రార్థనా గీతాలుగా సుస్థిరపరిచిన ప్రజాహితుడు రామానుజుడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈ మహితాత్ముడు బ్రాహ్మణేతరులను కూడా ఆధ్యాత్మిక గురువులుగా స్వీకరించిన విలక్షణ వేదాంతి. ఆ క్రమంలోనే ఆయన తన చుట్టూ ఉన్న సమాజంలోని అనేక దౌష్ట్యాలను నిరసించాడు. వాటి నిర్మూలనకు కృషి చేశాడు.


మానవతను మంటగలిపిన అస్పృశ్యత దురాచారం పట్ల రామానుజుడి వైఖరి విప్లవాత్మకమైనది. ఆ కాలంలో తమిళ భూపాలుడుగా ఉన్న కులోత్తుంగ చోళుడు నిరంకుశుడు. విష్ణుమూర్తి ఆరాధనను నిరసించేవాడు. వైష్ణవులను హింసించేవాడు. రామానుజుడిని నిర్బంధించి, చంపివేయాలని యోచించాడు. ఈ మహా పాతకాన్ని నివారించేందుకు గాను రామానుజుడు, ఇంకా అనేక మంది వైష్ణవులు మైసూరు ప్రాంతానికి తరలిపోయారు. అక్కడ కొంతమంది అస్పృశ్యులు ఆ వైష్ణవ శరణార్థులకు ఆశ్రయమిచ్చి రక్షణ కల్పించారు. ఆ పంచముల దయాగుణం రామానుజుడిని అమితంగా కదిలించివేసింది. ఆ అంటరానివారిని ఆయన ‘తిరుకులథర్’ అని గౌరవించారు. తమిళంలో ఆ పదానికి అర్థం ‘పవిత్ర కులపురుషులు’, అంతేకాదు మెల్కోటే ఆలయంలో వారికి ప్రవేశం కల్పించేందుకు రామానుజుడు వెనుకాడలేదు.


మెల్కోటేలో ఈనాటికీ రథోత్సవం రోజు దేవుని రథాన్ని లాగే హక్కు నాటి అస్పృశ్యులు, నేటి దళితులదే కావడం గమనార్హం. శతాబ్దాల అనంతరం మహాత్మాగాంధీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో అగ్ర వర్ణ హిందువులు స్వయంగా ముందుకు వచ్చి ‘హరిజనుల’కు ఆలయ ప్రవేశం కల్పించారు (నిమ్నవర్గాల వారికి గాంధీజీ పెట్టిన ‘హరిజన్’ అనే పేరుకు కూడా ‘తిరుకులధర్‌’కు ఉన్న అర్థమే ఇంచుమించుగా ఉంది). నేటి పరిస్థితుల దృష్ట్యా గాక, ఆనాటి సామాజిక స్థితిగతుల నేపథ్యంలో రామానుజుడి చర్యలను పరిశీలించినప్పుడు అవెంతటి విప్లవాత్మకమైనవో అర్థమవుతుంది.


అస్పృశ్యుడు, పన్నెండు మంది ఆళ్వారులలో ఒకడైన తిరుప్పన్ ఆళ్వార్ పట్ల రామానుజుడికి విశేష గౌరవాదరాలు ఉండేవి. దైవనిష్ఠ పరిపూర్ణంగా ఉన్న ఒక పంచముడి గుడిసెకు రామానుజుడు తరచు వెళ్ళి ఆ భక్తుడిని పరామర్శిస్తుండేవారు ఒక వ్యక్తి నిజమైన దైవభక్తుడు అయినప్పుడు అతడి కులాన్ని గురించి రామానుజుడు పట్టించుకునే వాడు కాదు. ఒకసారి ఆయన తన శిష్యులతో వెళుతుండగా ఒక చోట పిల్లలు ‘దేవాలయం ఆట’ ఆడుకుంటున్నారు. ఆలయంలో జరిగినట్లుగా పూజాది విధులు నిర్వహిస్తున్నారు. రామానుజుడిని చూసి, ఆటబొమ్మ అయిన దైవ ప్రతిమకు నమస్కరించమని ఆ పిల్లలు అడిగారు. రామానుజుడు వెంటనే ఆ ప్రతిమకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాల పూజారులు ఊహాత్మకంగా ఇచ్చిన దైవప్రసాదాలను తీసుకుని ముందుకు సాగిపోయాడు చిన్నపిల్లల ఆటకు అంత ప్రాధాన్యమిచ్చారేమిటని శిష్యులు ప్రశ్నించగా భగవంతుడు బాలల్లోనే నివసిస్తుంటాడు గనుక వారిని పెద్దల వలే గౌరవించాలని రామానుజుడు సమాధానమిచ్చాడు.


ఒక వ్యక్తి అస్పృశ్యుడా లేక బ్రాహ్మణుడా అనేది అతడి పుట్టుకతో కాకుండా, అతడు చేసే పనులను బట్టి నిర్ణయించాలని రామానుజుడు అన్నారు. ఈ కారణంగానే ఆయన జ్ఞానానికి కాకుండా భక్తికి ప్రాధాన్యమిచ్చారు. అయితే జ్ఞానం అప్రధానమైనదని ఆయన అనలేదు ఇక్కడే అద్వైతి శంకరుడు, విశిష్టాద్వైతి రామానుజుడి దృక్పథాలలో తేడా సూక్ష్మ వ్యత్యాసముంది. శంకరుడి భావాలను విమర్శించడంలో రామానుజుడు ఎక్కడా ఏమాత్రం సంశయించలేదు. సత్యావిష్కరణ అనేది వాదప్రతివాదాల ద్వారా మాత్రమే సంభవిస్తుందని ప్రాచీన భారతీయ తాత్త్వికులు భావించారు. అతి సామన్యుడు సైతం తన కర్మల ద్వారా అత్యున్నతస్థాయికి ఎదగడానికి తోడ్పడడమే భక్తి పరమార్థమని రామానుజుడు వక్కాణించాడు. మధ్యయుగాలలో భక్తి ఉద్యమం విప్లవాత్మక స్వభావాన్ని సంతరించుకోవడానికి అదే ప్రధాన కారణమని చెప్పవచ్చు.


ఆ చరిత్రాత్మక భక్తి ఉద్యమ నిర్మాతలు అందరూ రామానుజుడి నుంచి స్ఫూర్తి పొందినవారే. ఉత్తర భారతావనిలో రామానందుడు కులవ్యవస్థను తీవ్రంగా ఖండించాడు. ఉన్నత కులంలో పుట్టినా, నిమ్నకులంలో జన్మించినా మానవులందరూ సమానులేనని ఉద్భోదించాడు. ఆయన శిష్యుడైన ముస్లిం సూఫీ సాధువు కబీర్ ఆ విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని మరింత ముందుకు తీసుకుపోయాడు. విద్యావంతుడు కాని కబీర్ తన అనుపమేయ దైవభక్తితో తన సమకాలీన సమాజాన్ని అమితంగా ప్రభావితం చేశాడు. దక్షిణ భారతావనిలో భక్తి ఉద్యమం తమిళ భూమి నుంచి కన్నడ ప్రాంతాలు, తెలుగు రాజ్యాలు, మహారాష్ట్ర, గుజరాత్, ఆ తరువాత రాజస్థాన్‌కు వ్యాపించింది. మహారాష్ట్రలో చాలామంది భక్తి కవులు అనేక ‘అభంగ్’లు రాసి ప్రజలను చైతన్యపరిచారు. గుజరాత్‌లో కవి నర్సీ భగత్ రాసిన ‘వైష్ణవ జనతో’ అనే సుప్రసిద్ధ భక్తి గీతం (ఇదే మహాత్మాగాంధీ ఉదయం పూట ప్రార్థనా గీతం) ఇప్పటికీ అశేష ప్రజల హృదయాలను పులకితం చేస్తూనే ఉంది. రాజస్థాన్‌లో మీరాబాయి కృష్ణుడిని ప్రశంసిస్తూ అనేక పాటలు రాశారు. బెంగాల్‌లో వైష్ణవ సంప్రదాయ వ్యవస్థాపకుడు అయిన చైతన్యుడిపై మాధవాచార్య ప్రభావం ఉన్నంతగా రామానుజుడి ప్రభావం లేకపోవడం ఒక విశేషం.


ఆధునిక యుగంలో మహారాష్ట్రకు చెందిన మహోన్నత సాంఘిక సంస్కర్తలలో అగ్రగణ్యుడైన మహదేవ్ గోవింద్ రణడే రామానుజుడి బోధనలతో ప్రభావితమయిన వారు. ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అని గర్జించి బ్రిటిష్ వలసపాలకులను గడగడ లాడించిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్‌పై కూడా రామానుజుడి ప్రభావం అమితంగా ఉంది. అద్వైతి అయిన తిలక్, విశిష్టాద్వైతి రామానుజుడిని స్ఫూర్తిగా తీసుకుని స్వరాజ్య సమరాన్ని సంపూర్ణ ప్రజల పోరాటంగా మార్చివేశారు. విద్యారంగంలోనూ, పాలనారంగంలోనూ మాతృభాషగా ప్రాధాన్యమివ్వాలని నొక్కి చెప్పడంలో తిలక్‌పై రామానుజుడి ప్రభావమేమిటో స్పష్టంగా తెలుస్తుంది. 


పుట్టుకతో వైష్ణవుడు అయిన మహాత్మాగాంధీపై రామానుజుడి ప్రభావం విశేషంగా ఉంది. అస్పృశ్యులకు ఆలయప్రవేశం కల్పించడంలోనూ ఒక గౌరవ నామాన్ని ఇవ్వడంలోనూ గాంధీపై రామానుజుడి ప్రభావం విశదమవుతుంది. శంకరుని మాయావాదాన్ని అంగీకరించని రామానుజుడు సహజంగానే మానవ దుఃఖం అనేది భ్రమ మాత్రమే కాదని విశ్వసించాడు. మతపరమైన సంవేదనలను తార్కిక చింతనా ధోరణులతో సమన్వయపరిచేందుకు రామానుజుడు తన శాయశక్తులా కృషి చేశాడని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు.



కందాడై శేషాద్రి

(కీర్తి శేషుడు, న్యూఢిల్లీ జేఎన్‌యూలో రాజనీతిశాస్త్ర ఆచార్యుడు అయిన శేషాద్రి 1996, ఫిబ్రవరి 3 ‘ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’లో రాసిన ‘రామానుజ: సోషల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ టీచింగ్’ వ్యాసంలోని కొన్ని భాగాల స్వేచ్ఛానువాదం)

Updated Date - 2022-02-05T06:22:02+05:30 IST