నిర్వహణకు నామం.. లీకేజీల మయం!

ABN , First Publish Date - 2021-12-14T05:22:17+05:30 IST

కండలేరు డ్యాం భద్రతపై స్థానికుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. సర్వేపల్లి, వెంకటగిరి ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రాంనారాయణ హడావుడిగా సందర్శించి, డ్యాం భద్రతకు ఢోకా లేదని హామీ ఇచ్చినా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తున్నాయి.

నిర్వహణకు నామం..  లీకేజీల మయం!
గేటు దెబ్బతిని హెడ్‌రెగ్యులేటర్‌ నిర్మాణం మీద ప్రవహిస్తున్న నీరు, పాచిపట్టిన దృశ్యం

‘కండలేరు’ భద్రతపై సందేహాలు


రాపూరు, డిసెంబరు 13:  కండలేరు డ్యాం భద్రతపై స్థానికుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. సర్వేపల్లి, వెంకటగిరి ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రాంనారాయణ హడావుడిగా సందర్శించి, డ్యాం భద్రతకు ఢోకా లేదని హామీ ఇచ్చినా,  క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల కడప జిల్లాలోని పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులు ధ్వంసమై సృష్టించిన విలయం స్థానికుల్లో భయాందోళనకు తావిస్తోంది. ప్రస్తుతం ఐదో నెంబర్‌గేటు పని చేయకపోగా, 4వ నెంబరు గేటు దెబ్బతినడంతో  నీరు పైకి ఎగసిపడుతోంది. హెడ్‌ రెగ్యులేటర్‌ పరిస్థితి సైతం ప్రమాదకరంగా కనిపిస్తున్నా డ్యాం ఇంజనీర్లలో ఎలాంటి చలనం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


నిర్వహణ లోపం

ఒక్కొక్కటి 113.27 క్యూసెక్కుల సామర్థ్యంతో హెడ్‌ రెగ్యులేటర్‌పై  ఐదు వెంట్స్‌ నిర్మించారు. విద్యుదుత్పత్తి కోసం మూడు వెంట్స్‌, మూడు పెన్‌స్టాక్స్‌ ఏర్పాటు చేశారు. అయితే, వీటి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఐదో నెంబరు గేటు చాలాకాలంగా పని చేయడం లేదు. ప్రస్తుతం నాలుగో నెంబరు గేటు సైతం అదే పరిస్థితికి చేరుకుంది. దీంతో ఈ గేటు వద్ద నీరు లీకవుతోంది. మరోవైపు నిర్వహణ లోపం కారణంగా హెడ్‌ రెగ్యులేటర్‌ కాంక్రీటు నిర్మాణం బీటలు వారుతోంది. కాంక్రీటులోని ఇనుప కమ్ములు బయటపడటంతో  లీకేజీలు అధికమయ్యాయి.


నాటి పాపమే..

గతంలో 15టీఎంసీల నిల్వకే డ్యాం ప్రమాద ఘంటికలు మోగించింది. ఈ విషయంపై  ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో నిపుణుల కమిటీ సందర్శించి, నీటిని నిల్వ చేస్తే డ్యాం కొట్టుకుపోవడం ఖాయమని తేల్చి చెప్పింది. దీంతో డ్రిల్లింగ్‌, గ్రౌటింగ్‌ పనులు చేసి పటిష్టం చేశారు. అయినా, మట్టికట్ట బీటలు వారడం, కాంక్రీటు నిర్మాణాలు దెబ్బతినడం, గేట్లు మొరాయించడం జరుగుతూనే ఉంది. 


కుంగిన మట్టికట్ట

గతేడాది 61టీఎంసీల నీరు నిల్వ చేయడంతో  లోపలివైపు రివిట్‌మెంట్‌ కుంగిపోయింది. దీనికి ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు.  ఇటీవల కట్ట బయటివైపు కుంగిపోగా తాత్కాలికంగా మరమతులు చేశారు. కాగా, ఈ ఏడాది 62 టీఎంసీలు నిల్వ చేయనున్నట్లు తెలుగుగంగ సీఈ హరినారాయణ రెడ్డి ప్రకటించినా, ప్రస్తుత పరిస్థితుల్లో 60 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసి, మిగిలిన నీటి దిగువకు విడుదల చేస్తున్నారన్న ప్రచారం ఉంది. 





Updated Date - 2021-12-14T05:22:17+05:30 IST