తెలంగాణకు పాటల దండ కందికొండ

Published: Wed, 16 Mar 2022 00:16:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తెలంగాణకు పాటల దండ కందికొండ

తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ గేయ రచయితల్లో డాక్టర్ కందికొండ ఒకరు. ఆయన మరణం తెలుగు భాషాభిమానుల్ని, పాటల ప్రియుల్ని శోకసంద్రంలో ముంచింది. అనతి కాలంలోనే చిరస్థాయిగా నిలిచిపోయే సుమధుర గేయాలు ఆయన కలం నుంచి జాలువారాయి. ఆయన రాసిన పాటలన్నీ ఆయా సినిమాలకు, నటించిన హీరోలకు, చిత్రదర్శకులకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సాధారణ ప్రజల నాలుకలపై అలవోకగా ఆడే పదాల కూర్పుతో ఆయన పాటలు రాసేవారు. చదువురానివారు సైతం పాట మొత్తం గుర్తుపెట్టుకొని పాడే అంత తేలికగా రాశారు. ఎలాంటి పాండిత్య నేపథ్యం, సినీ నేపథ్యం లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, ఎంతో కష్టపడి లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించాడు. ఒక పక్క ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా, కెరీర్‍లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా అవి తను రాసే పాటలపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. చివరి శ్వాస వరకు పాటతోనే జీవించాడు. ఆ పాటల దాహం తీరకముందే చిన్న వయసులో తనువు చాలించాడు.


కందికొండ వ్యక్తిత్వం గురించి, జీవితం గురించి తెలిసినవాళ్లు తక్కువమంది. ఆయన ఎప్పుడూ వ్యక్తిగత విషయాలను పంచుకునేవారు కాదు. చివరికి క్యాన్సరుతో బాధపడుతూ చికిత్స చేయించుకునే విషయం కూడా ఎవరితో చెప్పలేదు. చాలా రోజుల వరకు కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలియనివ్వలేదు. అదే చివరకు ప్రాణం మీదకు తెచ్చింది. తన ఆత్మీయ మిత్రుడు చక్రి మరణం కూడా ఆయనకు తీరని లోటు. ఆయనది ఎవరినీ నొప్పించని మనస్తత్వం. అందరితో కలుపుగోలుగా ఉండే కందికొండ జాతీయవాద భావజాలంతో విద్యార్థి పరిషత్తులో చాలా కాలం పని చేశాడు. ఆరెస్సెస్ శాఖకు చక్రితో కలిసి వెళ్లడం వలన ఇద్దరూ కలిసి జాతీయవాద సాహితీ సంస్థను స్థాపించి పలు గీతాలను తీసుకొచ్చారు. హైదరాబాదుకు వచ్చిన తొలినాళ్లలో ఎన్నో కష్టనష్టాలను భరించి నిలదొక్కుకున్నాడు. తాను ఇండస్ట్రీలో నిలబడ్డాక కూడా ఎన్నడూ సంపాదన గురించి, ఆస్తుల గురించి ఆలోచించలేదు. చివరి రోజుల్లో అనుభవించిన బాధలు ఆర్థిక వనరుల ఆవశ్యకత గురించి ఆలోచించేలా చేశాయి. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. కొంతమంది మిత్రుల సాయంతో, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కొంతకాలం క్యాన్సరుపై పోరాటం చేశాడు.


తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమయ్యాక చిత్ర పరిశ్రమలో అవకాశాలు తగ్గాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రాంతీయ అసమానతలు కందికొండ కెరీరుకు సవాలుగా మారాయి. తన చిరకాల మిత్రుడు చక్రి మరణం కూడా అవకాశాలు తగ్గటానికి కారణమైంది. తెరచాటు రాజకీయాలు చేయటం రానందువల్ల పని దొరకటం మానేసింది. చింతిస్తూ, ఇతరులను నిందిస్తూ కూర్చోకుండా దాన్ని కూడా అవకాశంగా మలుచుకున్నాడు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న పల్లె పదాలను, జానపదాలను వెలికితీసి చిత్రీకరించే నూతన సాంప్రదాయాన్ని సృష్టించాడు.  అంతకుముందు ప్రాచుర్యం లేని పండుగలకు, వేడుకలకు పాటలు రాసే పద్ధతి కందికొండ వల్లే ప్రాచుర్యంలోకి వచ్చింది. తెలంగాణ జానపద సాహిత్యానికి ఆయన ఒక బ్రాండు అంబాసిడరుగా మారాడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ గీతం మొదలుకొని బతుకమ్మ, బోనాలు, పండుగలు అనే తేడాలు లేకుండా వందల సంఖ్యలో జానపద గేయాలను సినిమా పాటలకు దీటుగా రాయడమే కాకుండా స్వయంగా చిత్రీకరించాడు. ఒక దశలో ఆయన పాటలకు సినిమా పాటల స్టార్‍డమ్‌ను మించి కోట్ల సంఖ్యలో వ్యూయర్‌షిప్ పొందటం మొదలైంది. ఇది గొప్ప చరిత్ర. సొంతంగా యూట్యూబ్ ఛానలు పెట్టి పాటలను ప్రమోట్ చేసుకున్నాడు. పల్లెల నుంచి మొదలుకొని విదేశాలలో సైతం తన బతుకమ్మ, బోనాల పాటలతో తెలుగు జాతిని తట్టి లేపాడు. పెళ్లి అయినా, పండుగ అయినా కందికొండ పాట ఉండాల్సిందే అన్నవిధంగా కొత్త ఒరవడి సృష్టించాడు. పాటల్లో సాహిత్యపరమైన గ్రాంథిక భాషను పటాపంచలు చేసి సాధారణ సాంప్రదాయ వాడుక భాషలో మరుగు పడిన పదాలను వెలికితీశాడు. తెలంగాణ భాషలోని సందుగ, సాయబాను, డల్లం–భల్లం, కుడుకల బెల్లం, చేతి సంచి, యాట ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పదాలతో నిఘంటువే తయారవుతుంది.


ఇక సినిమాల్లోని చరిత్ర సృష్టించిన పాటల గురించి చెప్పనవసరం లేదు. ‘మళ్ళి కూయవే గువ్వా’ అంటూ మొదలు పెట్టిన ఆ పదాల ఝరి తెలుగు సినిమాను ఒక కుదుపు కుదిపింది. కందికొండ కేవలం పాటలకే పరిమితం కాదు, ఒక మంచి బాడీ బిల్డర్, అథ్లెట్ కూడా. అంతేగాక, మంచి కథకుడు కూడా. ఆయన రాసిన ఎన్నో కథలు ప్రచురితం అయ్యాయి. ‘భూ లచ్చువమ్మ కథ’ కథల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. కన్న తల్లిని, మాతృభూమిని ఎలా పూజిస్తాడో, తనకు జ్ఞానభిక్ష పెట్టిన చదువుల తల్లి ఉస్మానియా యూనివర్సిటీని కూడా అంతే సమానంగా పూజించేవాడు. ఉస్మానియాకు వచ్చేముందు ఫోన్ చేసి ‘అన్నా మా అవ్వ దగ్గరికి వచ్చిన’ అనేవాడు. ‘ఓయూ మా అవ్వ’ అంటూ కవిత్వంలో ఎలుగెత్తి చాటాడు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఎంతోమంది గేయ రచయితలను సంప్రదించిన ఉత్సవ నిర్వాహకులు చివరకు కందికొండకే ఆ అవకాశం ఇచ్చారు. వందేళ్ల ఉస్మానియా వైభవాన్ని ‘గగన గగనమున ఉదయించేను ఉస్మానియా’ అంటూ అయిదు నిమిషాల పాటలోనే నిక్షిప్తం చేసి అవ్వ ఋణం కొంతైనా తీర్చుకున్నాడు. ఆ అవ్వ ఒడిలో పాఠాలు చెప్పాలన్న తన చిరకాల కోరిక మాత్రం తీరకుండానే వెళ్ళిపోయాడు.


బీసీ కులాలపై తాను రాసిన ‘ఉత్పత్తి కులాలం, పొలం దున్నే హలాలం’ పాట కోసం ఎంతో శ్రమించాడు. ఆ పాటను సామాజిక చైతన్యానికి ప్రతీక అయిన ఉద్యమాల గడ్డ ఉస్మానియాలోనే చిత్రీకరించాలని పట్టుబట్టాడు. సినిమా షూటింగులు చేసే భారీ క్రేన్ సహాయంతో ఆర్ట్స్ కళాశాల మీద నుంచి మెట్ల వరకూ అద్భుతంగా చిత్రీకరించాడు. డ్రోన్ సహాయంతో చిత్రీకరించమని ఎంత చెప్పినా వినలేదు. క్రేన్‍తో కాకపోతే ఆర్ట్స్ కళాశాల అందం పోయేది అనేవాడు. ఆర్ట్స్ కాలేజీలో సినిమా షూటింగు ఆ రేంజిలో చేసిన ఘనత ఒక్క శంకర్ తర్వాత కందికొండకే దక్కుతుంది.


తెలంగాణ ఏర్పాటు కంటే ముందు అజరామరమైన ఎన్నో తెలుగు హిట్ సాంగ్స్ అందించినప్పటికీ అగ్ర సినీ గేయ రచయితలకు దక్కిన గౌరవం ఆయనకు దక్కలేదు. వారి సరసన నిలబెట్టే అవార్డులు ఆయనకు రాలేదు. ప్రతిభలో మాత్రం ఆయన అగ్ర సినీ గేయ రచయితలకు ఏమాత్రం తీసిపోడు. అనారోగ్యానికి గురై చావు బతుకుల మధ్య రెండేళ్లుగా కొట్టుమిట్టాడుతున్నప్పుడు మిత్రులూ శ్రేయోభిలాషులూ సాయమందించారే తప్ప తాను ఎంతగానో ప్రేమించిన సినీ పరిశ్రమ నుంచి ఆశించిన స్పందన కరువైంది. చివరకు తెలంగాణ ప్రభుత్వం చొరవతో ఆయన్ను అన్ని రకాలుగా ఆదుకుంది. తనకంటూ ఏమీ మిగుల్చుకోక సర్వస్వం భాష, సంస్కృతి, సాహిత్యానికే ధారపోసిన కందికొండ చిరస్మరణీయుడు. తెలంగాణ సంస్కృతి, జానపదం, పండుగలు బ్రతికున్నంత కాలం కందికొండ ప్రజల నాలుకలపై బతికే ఉంటాడు.

దొంతగాని వీరబాబు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.