కంగనా వివాదం

ABN , First Publish Date - 2020-09-11T06:27:30+05:30 IST

సినీనటి కంగనా రనౌత్‌కు అనవసరంగా ప్రచారం కల్పించే పనులు చేయవద్దని మహారాష్ట్ర రాజకీయ భీష్ముడు శరద్ పవార్ ఇచ్చిన సలహాను రాష్ట్రప్రభుత్వం, అందులోనూ...

కంగనా వివాదం

సినీనటి కంగనా రనౌత్‌కు అనవసరంగా ప్రచారం కల్పించే పనులు చేయవద్దని మహారాష్ట్ర రాజకీయ భీష్ముడు శరద్ పవార్ ఇచ్చిన సలహాను రాష్ట్రప్రభుత్వం, అందులోనూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పాటించడం మంచిది. ముంబై నగరపాలక సంస్థ కంగనా కార్యాలయ భవనానికి సంబంధించిన ఉల్లంఘనలపై తన నియమాల ప్రకారమే నోటీసులు జారీచేసి ఉండవచ్చు, ఇరవై నాలుగు గంటల గడువు ఇచ్చి, ఆపైన కూల్చివేతకు ఉపక్రమించి ఉండవచ్చు. కానీ, ఏ నేపథ్యంలో, ఏ పరిణామాల సందర్భంలో ఆ పని చేస్తున్నదీ గుర్తించకపోతే ఎట్లా? అని పవార్ ప్రశ్నించారు. కూల్చివేత పూర్తికాక ముందే, న్యాయస్థానం స్టే ఇచ్చింది, ఈ నెల 30 దాకా రనౌత్‌కు వ్యవధి లభించింది. కానీ, ఈ లోగా, కంగనా నిజంగానే వార్తల రాణి అయిపోయారు. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఆవిడేనా- అన్న ప్రశ్నలతో సామాజిక మాధ్యమాలలో చర్చలు జరుగుతున్నాయి. 


హిమాచల్ ‌ప్రదేశ్‌కు చెందిన కంగనా రనౌత్ ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, అతి కష్టం మీద సినీపరిశ్రమలో నిలదొక్కుకున్న నటి. ప్రముఖ నటుల కుటుంబాలకు చెందినది కాకపోవడం, ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడలేకపోవడం, రూపురేఖల రీత్యా కూడా బాగా అలవాటైన ప్రమాణాలలో లేకపోవడం- ఇవన్నీ ఆమె ప్రయాణంలో ఎదురీతకు కారణమయ్యాయి. కానీ, వాటిని ఆమె తన సంకల్పబలంతో, స్థైర్యంతో ఎదుర్కొన్నది. ఇప్పుడామె బాలీవుడ్‌లో అత్యంత ఫ్యాషనబుల్‌గా ఉండే నటి. జాతీయస్థాయిలో ఉత్తమనటి అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. బాలీవుడ్ పెద్దమనుషులను ముఖం మీదనే కడిగేయగలిగే సాహసం కూడా ఆమె సొత్తు. ఆమెతో వ్యవహరించడం ఎంతో కష్టమని ఆమె దర్శకులు, సహనటులు, నిర్మాతలు వ్యాఖ్యానిస్తారు. అయినా, ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి, రాణించారు. ‘మణికర్ణిక’ సినిమా సమయంలో అభిప్రాయభేదాల కారణంగా ఆ చిత్రదర్శకుడు క్రిష్ వైదొలగడం, తక్కిన భాగానికి కంగనా తానే దర్శకత్వం వహించి పూర్తిచేయడం తెలుగువారికి ప్రత్యేకంగా గుర్తుండే విషయమే. కొన్ని సినీకుటుంబాల ప్రాబల్యం కారణంగా బాలీవుడ్ కొత్తవారికి దుర్భేద్యమైన రంగం కావడం మీద కంగనా అనేక పర్యాయాలు మాట్లాడారు. సుశాంత్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ కొత్తవారి నిరాదరణపై మరోసారి చర్చ రావడం, కంగనా ఆ వివాదాన్ని ప్రత్యేకంగా ముందుకు తీసుకుపోవడం ఇటీవలి పరిణామాలు. ఆత్మాభిమానం కలిగిన ‘క్వీన్’గా, ధైర్యవంతురాలైన ‘మణికర్ణిక’గా కంగనాను అందరూ అభినందిస్తారు. అదే సమయంలో, ఆమె తనకు లభించిన గుర్తింపును దారి మళ్లించారా, విచక్షణ లేకుండా వ్యాఖ్యలు గుప్పిస్తూ సంచలనాలను ఆశ్రయిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఒక రాజకీయ వ్యూహానికి అనుగుణంగా ఆమె వ్యవహరిస్తున్నారా అని కలుగుతున్న సంశయం కూడా నిరాధారం కాదు. 


సినిమా రంగంలోని అనైతిక పద్ధతులు, స్వార్థపూరిత వ్యక్తిత్వాలు, ఈర్ష్యాసూయలు- కొత్తవీ కావు, రహస్యాలూ కావు. ఒకప్పుడు ముంబై సినీరంగానికి అధోజగత్తు మాఫియాకూ పెట్టుబడుల సంబంధమే ఉండేది. గతంలో ఉన్నంత లేకపోయినా, ఇప్పుడు కూడా ఆ అనుబంధం అవశేషంగా అయినా మిగిలే ఉన్నది. ఒకప్పుడు కపూర్‌లు, ఇప్పుడు ఖాన్‌లు, జోహార్లు సినీరంగంలో ప్రాబల్యంలో ఉన్నారు. సుశాంత్ దుర్ఘటన జరిగిన వెంటనే, సినీరంగాన్ని తక్షణం ప్రక్షాళన చేసి తీరాలన్న హడావుడి కేవలం సత్సంకల్పంతో మాత్రమే మొదలయిందా అన్నది ప్రశ్న. మహారాష్ర్ట రాష్ట్రంలో శివసేన-–ఎన్‌సిపి–-కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మునుపటి ప్రభుత్వంలో కూడా శివసేన బిజెపితో కలిసి అధికారాన్ని పంచుకుని, గత ఎన్నికల తరువాత కొత్త కూటమిలోకి వచ్చింది. ప్రాంతీయ- మతవాద పార్టీకి, జాతీయ- మతవాద పార్టీకి మధ్య ఏర్పడిన స్పర్థ చిన్నదేమీ కాదు. మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, బొంబాయిపై శివసేన పట్టు గత యాభై ఏళ్లుగా సాగుతూనే ఉన్నది. అందులో భాగంగానే సినీపరిశ్రమలో కూడా ఆ పార్టీకి గట్టి పలుకుబడి ఉన్నది. శివసేనను బలహీనపరిచే అవసరం ఉన్నవారికి, ఆ పార్టీకి సినీపరిశ్రమతో ఉన్న బంధాన్ని తెగగొట్టడం అవసరం. సుశాంత్ ఆత్మహత్యకు కారకులయినవారిని గుర్తించి అరెస్టు చేయడంలో మహారాష్ట్ర పోలీసులు విఫలమయ్యారన్నది కంగనాతో సహా అనేకుల విమర్శ. అదే సమయంలో ఒక కేంద్ర ప్రభుత్వానికి చెందిన మత్తుపదార్థాల నేర పరిశోధన సంస్థ, సుశాంత్ స్నేహితురాలినే మత్తు పదార్థాల కేసులో గుర్తించి, అరెస్టు కూడా చేసింది. బాలీవుడ్ లోలోపలికి దర్యాప్తు చేయడానికి ఇప్పుడు ఒక దారి దొరికింది. 


సుశాంత్ సంఘటనను, తన స్వీయ అనుభవాలను పేర్కొంటూ కంగనా మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఇటీవలి కాలంలో ఆమె విమర్శలు క్రమంగా మితవాదానికీ, మతతత్వానికీ దగ్గరగా మారుతూ వచ్చాయి. రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదంటూ, ముంబైను ఆమె పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చారు. సహజంగానే, ఆ వ్యాఖ్య శివసేనకు ఆగ్రహం తెప్పించింది. ఆ సమయంలో తన స్వరాష్ట్రంలోని మనాలీలో ఉన్న కంగనాను, ‘‘అట్లా అనుకుంటే, నువ్వు ముంబై తిరిగి రాకు, అక్కడే ఉండు’’ అని శివసేన అగ్రనాయకుడు సంజయ్ రౌత్ ప్రతిస్పందించారు. ముంబైకి రావద్దని తనను హెచ్చరిస్తున్నారని చెబుతూ కంగనా రక్షణ కోరింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమెకు ‘వై’ శ్రేణి భద్రతను మంజూరు చేసింది. బుధవారం నాడు ఆమె విమానాశ్రయంలో సాంప్రదాయ వస్త్రధారణలో భద్రతావలయం మధ్యలో ఠీవిగా నడుస్తూ వచ్చి నగరంలోకి ప్రవేశించారు. తన కార్యాలయాన్ని కూల్చివేసే ప్రయత్నం చేసినందుకు ఆమె మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మొగల్ చక్రవర్తి బాబర్‌తో పోల్చారు. త్వరలోనే శివసేన ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. ఆమెకు ఫలానా రాజకీయాల నుంచి పూర్తి హామీ లభించిందని, ఆమె ఆ రాజకీయాలకు అనుగుణంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని బుధవారం నాడు మరింత స్పష్టమైంది. కొద్దిరోజుల కిందట ఆమె రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లే కులాన్ని నిలిపి ఉంచుతున్నాయని అన్నారు. 


తన ప్రతిష్ఠను, ఆత్మాభిమాన వ్యక్తిత్వాన్ని మరో బలమైన రాజకీయ పక్షం ప్రయోజనాలకోసం వినియోగించడం కంగనాకు తప్పనిసరి అయి ఉండవచ్చు. లేదా, ఆమెకు సొంతంగా రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశ్యం ఉండవచ్చు. అయినంత మాత్రాన ఆమె ముంబై మీద, అక్కడి ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలు సమర్థనీయాలు కావు. గతంలో ఒక పెద్ద హీరో దేశంలోని అసహన వాతావరణం కారణంగా, తన కుటుంబం అభద్రతా భావానికి లోనవుతోందని వ్యాఖ్యానించినప్పుడు, సామాజిక మాధ్యమాలు, తీవ్ర జాతీయవాదులు, ఆ నటుడిని మరో దేశం వెళ్లి జీవించమని మాటల దాడులు చేశారు. మరి, దేశంలోని ఒక ప్రాంతాన్ని శత్రుదేశపు భాగంతో ఒక నటి పోలిక తెస్తే, ఆమెకు కేంద్రం భద్రత కల్పించడమేమిటి- అని ఎవరైనా ప్రశ్నించడంలో పొరపాటేమున్నది?

Updated Date - 2020-09-11T06:27:30+05:30 IST