
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్‌కు 2019 బాగానే కలిసొచ్చింది. అప్పటి వరకు ఆమె చేసిన 'క్వీన్, తను వెడ్స్ మను'.. చిత్రాలకు మించిన సక్సెస్‌ను 'మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' రూపంలో అందుకుంది. ఇండస్ట్రీలో కంగనారనౌత్ బాక్సాఫీస్ రేంజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లిన చిత్రమిది. ఈ సినిమాతో కంగనా దర్శకురాలిగా కూడా మారింది. ఈ సినిమాకు కంగనా రనౌత్ ఇప్పుడు సీక్వెల్ చేయడానికి సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని అంటున్నారు. గజనీ మొహ్మద్‌ను రెండు సార్లు ఓడించిన కాశ్మీర్ రాణి జీవితగాథను 'మణికర్ణిక.. ది లెజెండ్ ఆఫ్ దిద్దా' పేరుతో మణికర్ణిక సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. టైటిల్ పాత్రలో కంగనా రనౌత్ నటించనుంది. కమల్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం 'తేజస్' సినిమాలో కంగనా రనౌత్ నటిస్తోంది. ఈ ఏడాదిన ఆమె కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేసి 2022లో 'మణికర్ణిక.. ది లెజెండ్ ఆఫ్ దిద్దా' ను సెట్స్‌పైకి తీసుకెళతారట.