సమస్యల గిరి కనిగిరి

ABN , First Publish Date - 2021-02-28T06:52:25+05:30 IST

కనిగిరి పట్టణం పంచాయతీ నుంచి నగర పంచాయతీగా మారి పదేళ్లు గడుస్తున్నా.., అభివృద్ధిలో నేటికీ పాత ఆనవాళ్లే దర్శనమిస్తున్నాయి.

సమస్యల గిరి కనిగిరి
కనిగిరి పట్టణం

 ఏడాదిన్నరగా అభివృద్ధి శూన్యం  

నిరంతరం ట్రాఫిక్‌ సమస్య  

ఊసే లేని మాసం, కూరగాయల మార్కెట్లు

కనిగిరి, ఫిబ్రవరి 27: కనిగిరి పట్టణం పంచాయతీ నుంచి నగర పంచాయతీగా మారి పదేళ్లు గడుస్తున్నా.., అభివృద్ధిలో నేటికీ పాత ఆనవాళ్లే దర్శనమిస్తున్నాయి. 2011 ఆగస్టులో నగర పంచాయతీగా మారడం వెనుక మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్‌చార్జ్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృషి ఎంతో ఉందని చెప్పుకోవాలి. కనిగిరి నగర పంచాయితీగా మారితే ఆయా నిధులతో కనిగిరి ఎంతో అభివృధ్ధి చేయవచ్చని భావించి పట్టణానికి సమీపంలో ఉన్న పామూరు రోడ్డులోని మాచవరం, కందుకూరు రోడ్డులోని శంఖవరం, చింతలపాలెం, పొదిలి రోడ్డులోని కాశీపురం గ్రామాలను కలిపి 20 వార్డుల మున్సిపాల్టీగా మార్చారు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కనిగిరి బహింరంగ సభలో ఈ అంశాన్ని ప్రకటించడం విశేషం. అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, నగర పంచాయతీగా కనిగిరి రూపురేఖలు మార్చేందుకు డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి విశేష కృషి చేసి ప్రశంసలందుకున్నారు. ఆ తర్వాత 2014లో అధికారాన్ని చేపట్టిన టీడీపీ పాలనలో కనిగిరిలో రోడ్లు, డ్రైన్లు, మౌలిక వసతులు, మంచినీటా సరఫరా చేసింది. ఆ తర్వాత పట్టణంలో సమగ్ర అభివృద్ధే లక్ష్యం అని, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అయితే ఈ ఏడాదిన్నరలో ఆయన పట్టణ అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేసిన దాఖలాలు లేవని ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏడాదిన్నరగా అభివృద్ధి శూన్యం

వైసీపీ అధికారంలో ఉండి.. అధికార పార్టీ ఎమ్మెల్యేగా బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ ఉండి కూడా పట్టణంలో ఈ ఏడాది కాలంలో అభివృద్ధి శూన్యమనే చెప్పాలి.  ప్రధానంగా మంచినీటి సమస్యతో ప్రజలు  తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నీటి సరఫరా కోసం ఏటా రూ. 3.5 కోట్లు ఖర్చు చూపడం గమనార్హం. ఇక  2019-20 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.16 కోట్లు, 2020-21 సంవత్సరానికి మొదటి విడతగా ఇప్పటికి రూ.2.7 కోట్లు వచ్చినప్పటికీ, అభివృద్ధి ఛాయలు కనిపించడం లేదు. ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే మాట  నీటి మూట మాదిరే మిగిలి పోయింది.  

నిరంతరం ట్రాఫిక్‌ సమస్య

నగరంలో వీధులన్నీ ట్రాఫిక్‌తో ఇబ్బంది పడుతున్నాయి. ప్రధాన రోడ్లల్లో ట్రాఫిక్‌ సమస్య జఠిలంగా మారింది. పామూరు బస్టాండ్‌, ఒంగోలు బస్టాండ్‌, నగర కంటి బసవయ్య సెంటర్‌, బొడ్డు చావిడి సెంటర్‌, తీగల గొంది, ఉప్పు రోడ్డులో నిత్యం ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు  ఇబ్బంది పడుతున్నారు. జాతీయ రమదారి పనులు సగంలోనే ఆగిపోవడంతో భారీ వాహనాలన్నీ నగరంలో నుంచి వెళుతున్నాయి. దీంతో ప్రతి పావుగంటకోసారి వాహనాలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతు న్నారు. వాహనాలు నుంచి వచ్చే పొగతో అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. 

నామమాత్రంగా రోడ్ల విస్తరణ

నగరంలోని ఒంగోలు బస్టాండ్‌ నుంచి కొట్లబజారు, బొడ్డుచావిడి, మహాలక్ష్మి చెట్టు, ఎంఎ్‌సఆర్‌రోడ్డు, స్టేట్‌ బ్యాంక్‌ మీదగా సూరా పాపిరెడ్డి చౌక్‌ వరకు చేసిన రోడ్ల విస్తరణ పనులు తూతూ మంత్రంగా మారాయి. రోడ్డు ఆక్రమణలతో షాపులు నిర్వహించుకుంటున్న కొంత మంది ఇచ్చిన తాయిలాలు పుచ్చుకొని అధికారులు మిన్నకుంటున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కూడా ఉపయోగం లేకుండా పోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

     మాంసం, కూరగాయల మార్కెట్లకు జాగా ఏది..?

పట్టణంలో కూరగాయల మార్కెట్‌, మాంసం మార్కెట్‌ లేకపోవడంతో బొడ్డు చావిడి చుట్టూ కూరగాయల దుకాణాలను నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అదేవిధంగా చేపలు, మాంసం దుకాణాలు, నగరంలో ఎక్కడపడితే అక్కడ నిర్వహిస్తున్నారు. చేపల మార్కెట్‌ లేక పోవడంతో చేపలను విక్రయించేవారు తీగల గొంది, పార్కు, నగర పంచాయతీ కార్యాలయం ఎదురు అమ్మకాలు చేస్తున్నారు. వాటి వ్యర్థాలను మురుగు కాల్వల్లో వేయడం వలన దుర్వాసన వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఊసే లేని సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు నిర్మాణం 

 ఏళ్ల తరబడి పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మంచినీటి సమస్య. కనిగిరి పెద్ద చెరువును సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌గా మార్చి   పట్టణంలో ఇంటింటికి కుళాయితో పాటు పల్లెలకు మంచినీటి సరఫరా కోసం గత టీడీపీ హయాంలో మొదటి దశ నిర్మాణానికి నిధులు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుత శాసనసభ్యులు అలసత్వం కారణంగా నిధులు కూడా వెనక్కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే మరో హామీ నీరుగారిపోయింది. దీంతో కనిగిరి పట్టణ ప్రజలు బిందె నీటిని రూ.10ల పెట్టి కొనుక్కొనే దుస్థితి ఏర్పడింది. 

 పార్కు ఏర్పాటులో అలసత్వం   

కనిగిరిలో గార్లపేట రోడ్డులోని పాత ప్రైమరీ స్కూల్‌ స్థలంలో పార్కు ఏర్పాటు చేస్తామన్న నేతల హామీలు నెరవేరలేదు. 2019 ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే అదే స్థలంలో కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తానని చెప్పారు. అనంతరం సచివాలయం ఏర్పాటు చేశారు.  అనంతరం పార్కు, కూరగాయల మార్కెట్‌కు ప్రత్యామ్నాయ స్థలం చూడలేదు. దీంతో  నగరంలో ఎక్కడ పడితే అక్కడ కూరగాయల దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. కూరగాయల వ్య ర్ధాలను రోడ్ల వెంబడి వేయడంతో వీధుల వెబండి అపరిశుభ్రత ఏర్పడుతోంది.

దొరువు అభివృద్ధి హామీలకే పరిమితం

ఎంతో పురాతన చరిత్ర కలిగిన దొరువు ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా మర్చి హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ మాదిరిగా మారుస్తామని ప్రస్తుత ఎమ్మెల్యే గతంలో హామీ ఇచ్చారు. ట్యాంకుబండ్‌గా మారడమేమో కానీ, ప్రస్తుత ఆక్రమణలతో పాత చరిత్ర ఆనవాళ్లు కోల్పోయి అక్రమార్కులకు అడ్డగా మారింది. దొరువు ప్రాంతం ఆక్రమణలతో, అశుద్ధంతో నిండి దుర్గంధం వెదజల్లుతోంది. దొరువు ఒడ్డున దుర్గాలయం, కొండపైన శివాలయానికి భక్తులు స్వామివార్లను దర్శించుకోవాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. 

గుర్తింపులేని మురికివాడలు

నగర పంచాయతీగా మారి పదేళ్లు కావస్తున్నా అధికారికంగా మురికి వాడలను గుర్తించలేదు. దీంతో పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 1వ వార్డు ఇందిరా కాలనీలో 50 నివాసాలకు 351 మంది జీవిస్తున్నారు. 2వ వార్డులోని శివనగర్‌కాలనీ, ఎన్జీవోకాలనీ, బొగ్గుల గొంది కాలనీలు 150 కుటుంబాలు ఉండగా 606 మంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 3వ వార్డులో శంఖవరం, ఎస్సీ కాలనీల్లో 105 ఇళ్లలో 702 మంది జీవనం సాగిస్తున్నారు.  4వ వార్డులో చింతలపాలెం ఎస్సీ కాలనీలో 105 కుటుంబాలకు 590 మంది ప్రజలు జీవిస్తుండగా,  10వ వార్డు పాతూరు ఎస్సీ కాలనీలో 65 కుటుంబాలకు 345 మంది ప్రజలు జీవిస్తున్నారు. అదేవిధంగా 11వ వార్డులో కాశీపురం, కాశిరెడ్డి కాలనీ, దేవాంగనగర్‌లలో 710 కుటుంబాలకు 2201 మంది ప్రజలు జీవిస్తున్నారు. 12వ వార్డులో టకారిపాలెం ఎస్సీ కాలనీ, మంగళమాన్యంలలో 360 కుటుంబాలకు 975 మంది జీవిస్తున్నారు. 15వ వార్డు నక్కల తిప్పలో 100 కుటుంబాలకు 703 మంది నివసిస్తున్నారు.  19వ వార్డులో దొంతులమ్మ గుడి వీధిలో 55 కుటుంబాలకు 620 మంది నివసిస్తున్నారు. ఆయా ప్రాంతాల మౌలిక వసతులు, పారిశుధ్య నిర్వహణ నామమాత్రం గానే ఉంది. దాదాపు 7 వేల మంది నివసిస్తున్న ఈ మురికివాడల్లో మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్‌ దీపాలు, వంటి మౌలిక వసతుల కల్పనలో కూడా అధికార ులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.  ఎన్నికల ముందు పేద వర్గాల ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పిన ప్రస్తుత ఎమ్మెల్యే ఏడాదిన్నర గడిచినా ఆ దిశగా ఎప్పుడూ ఆలోచించక పోవ డంతో నగరం పట్ల చిత్తశుద్ధి ఏ పాటిదో అద్దం పడుతోంది.

Updated Date - 2021-02-28T06:52:25+05:30 IST