సినిమా రివ్యూ : కణ్మణి రాంబో ఖతీజా (కేఆర్‌కే)

Published: Thu, 28 Apr 2022 16:34:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సినిమా రివ్యూ : కణ్మణి రాంబో ఖతీజా (కేఆర్‌కే)

చిత్రం : కణ్మణి రాంబో ఖతీజా (కేఆర్‌కే)

విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2022

నటీనటులు : విజయ్ సేతుపతి, సమంత, నయనతార, రెడిన్ కింగ్స్‌లే, శ్రీశాంత్, ప్రభు, సీమ తదితరులు

సంగీతం : అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ : యస్.ఆర్.కదిర్, విజయ్ కార్తిక్ కణ్ణన్

నిర్మాణం : రౌడీ పిక్చర్స్, సెవెన్ స్ర్కీన్ స్టూడియోస్ 

దర్శకత్వం : విఘ్నేష్ శివన్ 

కేవలం యాక్షన్ మూవీస్‌కే పరిమితమవకుండా.. డిఫరెంట్ జోనర్స్‌లో సినిమాలు చేసే మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి.. ‘96’ మూవీ తర్వాత మరోసారి నటించిన ప్రేమకథాచిత్రం ‘కణ్మణి రాంబో ఖతీజా’. అయితే ఈ సారి ఏకంగా ఇద్దరు ముద్దుగుమ్మలు నయనతార, సమంతలతో రొమాన్స్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు. ‘కాతు వాక్కుల రెండు కాదల్’ తమిళ చిత్రానికిది డబ్బింగ్ వెర్షన్. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సమంత పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ రోజే (ఏప్రిల్ 28) థియేటర్స్ లోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది? విజయ్ సేతుపతి, నయనతార, సమంతల ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ ఏ రేంజ్ లో వర్కవుట్ అయింది? అనే విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథ

పుట్టుకతోనే దురదృష్ణవంతుడిగా పేరు తెచ్చుకున్న రాంబో (విజయ్ సేతుపతి) చిన్నప్పుడే తన తల్లికి దూరంగా పారిపోతాడు. 30 ఏళ్ళు దాటుతున్నా ప్రేమ, పెళ్ళిలాంటివి పెట్టుకోకుండా సింగిల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తుంటాడు. పగలు క్యాబ్ డ్రైవర్ గానూ, రాత్రిపూట పబ్బులోనూ పనిచేస్తుంటాడు. ఇంతలో అతడికి కణ్మణి (నయనతార), ఖతీజా (సమంత) పరిచయం అవుతారు. ఇద్దరితోనూ ఒకే సమయంలో ప్రేమలో పడతాడు. ఇద్దరినీ సమానంగా ప్రేమిస్తాడు.  వారు కూడా రాంబోకి ఒకేసారి ప్రపోజ్ చేస్తారు. దాంతో రాంబో జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఆ ఇద్దరితోనూ కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఇంతకీ ఇద్దరిలో అతడు ఎవరిని పెళ్ళి చేసుకుంటాడు? ఎవరిని వదలుకుంటాడు అన్నది మిగిలిన కథ. 

విశ్లేషణ

గతంలో ఎన్నో ట్రయాంగులర్ లవ్ స్టోరీస్ వచ్చాయి. వాటిలో చాలా వరకూ ప్రేక్షకుల్ని మెప్పించాయి. అయితే ‘కణ్మణి రాంబో ఖతీజా’ సినిమా మాత్రం చాలా డిఫెరెంట్. ఇందులో ఒక హీరో, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పటికీ  ఇది  మాత్రం ముక్కోణపు ప్రేమకథా చిత్రం కోవలోకి రాదు. హీరో ఒకేసారి ఇద్దరితోనూ ప్రేమలో పడతాడు. ఆ ఇద్దరమ్మాయిలూ ఒకరికి తెలియకుండా ఒకరు అతడికి ప్రపోజ్ చేస్తారు. కథగా చూస్తే..  ఎంతో ఆసక్తిని కలిగిస్తోన్నప్పటికీ.. తెరపై దాన్ని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. చిన్నప్పటి నుంచి తాను కోరుకున్నది తనకు దూరమవుతుంది అనే నెగెటివ్ థాట్స్‌తో ఉన్న రాంబో.. దాని కారణంగానే తల్లికి దూరమవుతాడు. ఎప్పుడైతే తను కణ్మణి, ఖతీజాతో ప్రేమలో పడ్డాడో అప్పటి నుంచి అతడికి అన్నీ పాజిటివ్ గానే జరుగుతుంటాయి. దాంతో ఆ ఇద్దరూ జీవితాంతం తన తోడుంటే తనలైఫ్ బాగుంటుందని మెంటల్‌గా ఫిక్సయిపోతాడు. అయితే కణ్మణి, ఖతీజా మాత్రం రాంబో ఇద్దరిలో ఒక్కరికే దక్కాలని కోరుకుంటారు. దాని వల్ల రాంబో పని అడకత్తెరలో పోకచెక్క చందాన మారుతుంది. ఈ వ్యవహారాన్ని పూర్తి కామెడీగా చెప్పాలని, దర్శకుడు భావించడం వల్ల కథనం గాడితప్పింది. పలు సన్నివేశాల్లో నయనతార, సమంత, విజయ్ సేతుపతి మాత్రమే కనిపించడం వల్ల బోర్ అనిపిస్తుంది. మొదటి నుంచి చివరి వరకూ ‘నాకు మీ ఇద్దరూ కావాలి, మీ ఇద్దరినీ పెళ్ళి చేసుకుంటానని.. హీరో పదే పదే అంటుంటే..’ ప్రేక్షకులు అసహనానికి గురవుతారు. ఒక దశలో దర్శకుడు బైగమీని (ఇద్దరు భార్యలు) ప్రోత్సహించినట్టు అనిపించినా.. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం ప్రేక్షకులకు షాకింగ్ గా అనిపిస్తుంది. 


దర్శకుడు తను రాసుకున్న కథ కంటే.. స్టార్ కేస్టింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. టీజర్, ట్రైలర్ తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌ను సినిమాతో క్రియేట్ చేయలేకపోయాడు. అలాగే ఇందులో ఎమోషన్స్ పలికించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. మొత్తానికి ఈ సినిమాకి విజయ్ సేతుపతి, సమంత, నయనతార లాంటి స్టార్ కేస్టింగ్ ఓపెనింగ్స్ తెచ్చిపెడతాయేమో కానీ.. ఆడియన్స్ ను పూర్తి స్థాయిలో అలరించడం కష్టమే అని చెప్పాలి. నయనతార క్లాస్‌గా కనిపించి ఆకట్టుకుంటే.. సమంత ఓ రేంజ్ లో గ్లామర్ ను ఒలికించింది. విజయ్ సేతుపతి రాంబో పాత్రను తన స్టైల్లో కూల్‌గా చేసుకుంటూ పోయాడు. ఎక్కడా ఓవర్ అనిపించకుండా పాత్రకి కావాల్సిన రీతిలో తన నటనను కనబరిచాడు. రెడిన్ కింగ్ స్లే, క్రికెటర్ శ్రీశాంత్ ల కామెడీ ఆకట్టుకుంటుంది. విజయ్ సేతుపతి తల్లిగా సీనియర్ నటీమణి సీమ ఆకట్టుకుంటుంది. అనిరుధ్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. వెరైటీ ప్రేమకథా చిత్రాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బెటర్ ఆప్షన్. 

ట్యాగ్ లైన్ : వెరైటీ లవ్‌స్టోరీ

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International