కన్న తండ్రే హంతకుడు

ABN , First Publish Date - 2022-08-14T05:17:08+05:30 IST

తప్పు చేస్తే సరిదిద్దాల్సి న తండ్రే కన్నబిడ్డను పొట్టన పెట్టుకున్నాడు. తన ప్రాణానికి హాని తలపెడతాడేమోనని ముందుగానే గ్రహించి రూ.2 లక్షలు సుపారీ ఇచ్చి బిడ్డను హత్య చేయించాడో తండ్రి.

కన్న తండ్రే హంతకుడు
నిందితులతో సీఐ మురళీకృష్ణ, సిబ్బంది

మేనమామే సూత్రధారి 

హత్య కేసులో తండ్రి సహా ముగ్గురి అరెస్టు

మదనపల్లె క్రైం, ఆగస్టు 13: తప్పు చేస్తే సరిదిద్దాల్సి న తండ్రే కన్నబిడ్డను పొట్టన పెట్టుకున్నాడు. తన ప్రాణానికి హాని తలపెడతాడేమోనని ముందుగానే గ్రహించి రూ.2 లక్షలు సుపారీ ఇచ్చి బిడ్డను హత్య చేయించాడో తండ్రి. ఇందులో హతుడి మేనమామ ప్రధాన సూత్రధారి. హత్య కేసులో తండ్రి సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు టూటౌన్‌ సీఐ మురళీకృష్ణ చెప్పారు. స్థానిక టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను మీడియాకు వెల్లడిం చారు. సీఐ కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ కుతికిబండ  తండాకు చెంది న మూడే రెడ్డెప్పనాయక్‌, శైలజ దంపతులకు ఇద్ద రు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు ఎం.ఠాగూర్‌నాయక్‌ (21) తమిళనాడు రాష్ట్రం చెన్నై లో బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. అతడు ఓ యువతి ప్రేమలో పడి సక్రమంగా కళాశాలకు వెళ్లే వాడు కాదు. దీంతో పాటు మద్యం, గంజాయితో పాటు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కాలేజికి వెళ్లకుండా మదనపల్లెకు వచ్చి స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతున్నాడు.

అయితే జల్సాలకు డ బ్బు కావాలని తండ్రిని అడిగేవాడు. ఆయన ఇవ్వ కపోవడంతో గొడవపడేవాడు. ఇలా పలుమార్లు తండ్రీ, కొడుకులు డబ్బు విషయమై గొడవపడ్డారు. కాగా ఓ రోజు తండ్రీ, కొడుకుల మధ్య ఘర్షణ జరి గింది. ఇందులో భాగంగా ఠాగూర్‌ ఆవేశంతో తండ్రి రెడ్డెప్ప నాయక్‌, సోదరుడు రెడ్డిశేఖర్‌ నాయక్‌ను చంపేస్తే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని ఈ పనిచేసి తీరతానంటూ తండ్రితో ఛాలెంజ్‌ చేశాడు. నువ్వు ఏంది.. నన్ను చంపేది, నేనే నిన్ను చంపే స్తానంటూ తండ్రి కూడా సవాల్‌ విసిరాడు. ఈ క్రమంలో తండ్రీ, కొడుకుల ప్రతి సవాళ్లతో వీరి మధ్య కక్షలు ఏర్పడ్డాయి. ఇదిలా వుండగా రెడ్డెప్ప నాయక్‌ రెండు నెలల కిందట తన భార్య శైలజ సోదరుడైన పెద్దమండ్యం మండలం నత్తిఓబన్నగా రిపల్లెకు చెందిన బుక్కే శేఖర్‌నాయక్‌తో కలసి కు మారుడి హత్యకు పథకం పన్నాడు.

కాగా ప్రస్తుతం శేఖర్‌ నాయక్‌ బెంగళూరులో ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అతడి స్నేహితుడైన సంబేపల్లె మండలం శెట్టిపల్లె పంచాయతీ పెద్దబిడికి వాసి బుక్కే ప్రతాప్‌నాయక్‌ కూడా అదే ఎయిర్‌ పోర్టులో ఫుడ్‌ సప్లయ్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ ఠాగూర్‌ను హత్య చేసేందుకు రూ.2 లక్షలు సుపారీ కుదుర్చుకుని, రూ.50 వేలు అడ్వాన్స్‌ తీసుకున్నారు. ఇందులో భాగంగా హత్య జరగడానికి వారం రోజుల ముందే మదనపల్లెకు చేరుకుని ఠాగూర్‌ కోసం గాలించారు. జూన్‌ 28న ఠాగూర్‌ను వెతికి పట్టుకుని మద్యం తాగేందుకు పట్టణ శివారులోని వైఎస్సార్‌ కాలనీ సమీప గుట్ట లోకి తీసుకెళ్లారు. అక్కడ ఠాగూర్‌, శేఖర్‌, ప్రతాప్‌లు మద్యం, గంజాయి తాగారు. మద్యం మత్తులో కింద పడిపోయిన ఠాగూర్‌ గొంతుకు తీగలు బిగించి, చేతులతో గొంతు నులిమి హత్య చేశారు. అనంత రం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ నేపథ్యంలో జూలై 2వ తేదీ స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అం దించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

అయితే మృతదేహం కుళ్లి గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో, సెల్‌ఫోన్‌ ఆధారంగా బాధిత కుటుంబీకులకు సమాచారం అందించారు. మిస్టరీగా మారిన ఠాగూర్‌ హత్య  కేసులో ఠాగూర్‌ సెల్‌ కాల్‌డేటా ద్వారా కేసును ఛేదించారు. కుమారుడికి భయపడి తండ్రే హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది. సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించినట్లు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితులను శనివారం అరె స్టు చేసి రిమాండుకు తరలించి, వారి నుంచి ద్విచక్ర వాహనం సహా మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసులో సిబ్బందిని ఆయన అభినందించారు. కాగా ప్రతాప్‌నాయక్‌పై రాయచోటి పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఐ చంద్రమోహన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:17:08+05:30 IST