కాంతులు విరజిమ్మేనా!?

ABN , First Publish Date - 2021-10-31T05:23:00+05:30 IST

కుల మతాలకు అతీతంగా ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ దీపావళి. నవంబరు 4న ఈ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకునేందుకు సిద్ధపడుతున్నారు.

కాంతులు విరజిమ్మేనా!?
టపాసులు తయారు చేస్తున్న కూలీలు

పెరిగిన బాణసంచా తయారీ ఖర్చు

ఈసారి తారజువ్వలా పెరగనున్న ఽధరలు

నిబంధనలు పాటించని లైసెన్స దారులు

ఇష్టానుసారంగా తయారీ కేంద్రాలు

అధికారుల తనిఖీలు నామమాత్రమే!

ఇంకా కళ్ల ముందే ‘పొర్లుకట్ట’ ఘటన


నెల్లూరు (క్రైం), అక్టోబరు 30 : కుల మతాలకు అతీతంగా ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ దీపావళి. నవంబరు 4న ఈ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకునేందుకు సిద్ధపడుతున్నారు. అయితే, టపాసుల తయారీ ఖర్చులు పెరగడం, మార్కెట్లో వాటి ధరలు ఆకాశాన్ని అంటడంతో పండుగ కాంతులు ఈసారి విరజిమ్మేలా లేవు. జిల్లావ్యాప్తంగా టపాసులు విక్రయించే తాత్కాలిక లైసెన్స  పొందిన దుకాణాల ఏర్పాటుకు అధికారులు ఆదివారం లక్కీడిప్‌ తీయనున్నారు.. జిల్లావ్యాప్తంగా 319 రెన్యువల్‌, 23 తాత్కాలిక దుకాణాలకు అనుమతులు ఉన్నాయి. వీటిలో నెల్లూరులో రెన్యువల్‌, కొత్తవి మొత్తం కలిపి 207 దుకాణాలకు దరఖాస్తులు అందగా, 173 దుకాణాలకు ఇప్పటికే అధికారులు అనుమతులు ఇచ్చారు. మిగిలినవి అనుమతులు పొందితే అన్నింటికి కలిపి లక్కీడి్‌పను నిర్వహించి దుకాణాలను కేటాయించనున్నారు. కాగా, దీపావళి రోజున బాణసంచా పేలుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇది కూడా విక్రయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.


నిబంధనలు గాలికి..


జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే టపాసుల తయారీ కేంద్రాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. గతంలో అసలు తయారీ కేంద్రాలకు అనుమతులు  ఇవ్వబోమని తెలిపినా ఆ పనులు చేసుకునే వారి జీవనాధారం దృష్ట్యా అనుమతులు మూడేళ్లపాటు రెన్యువల్‌ చేశారు. దీంతో నెల్లూరులోని పొర్లుకట్ట ప్రాంతం, గూడూరు, ఆత్మకూరు, సూళూరుపేట, వింజమూరు ప్రాంతాల్లో మాత్రమే టపాసుల తయారీకీ అనుమతులు ఉన్నాయి. వీటిల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుని కేటాయించిన ప్రాంతాల్లోనే టపాసులు తయారు చేయాలి. అందుకు భిన్నంగా జిల్లాలో ఇష్టానుసారంగా కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఎక్కువ సంఖ్యలో తయారు చేయిస్తున్నారు. అనుమతి పొందిన ప్రకారం  నిర్ణయించిన కిలోల నల్లమందుతోనే టపాసులు తయారు చేయాలి.  నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ కిలోల మందును నిల్వ ఉంచి టపాసులను రేయింబవళ్లు తయారు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గోదాములు, తయారీ కేంద్రాలు 38 ఉన్నాయి. 319 రెన్యువల్‌, 23 తాత్కాలిక దుకాణాలకు అనుమతులు ఉన్నాయి. గోదాముల్లో అనుమతులు ఇచ్చిన ప్రకారమే సరుకు నిల్వ ఉంచాలి. అధికారులు 10 కిలోల నుంచి 1500 కిలోల వరకు నిల్వ కోసం  గోదాములకు, దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తూ వేల కిలోల సరుకును గోదాముల్లో వ్యాపారులు నిల్వ ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. ఇక గోదాములు, దుకాణాల వద్ద నిబంధనల మేరకు జాగ్రత్తలు  తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 2016 ఏడాది చివరిలో నెల్లూరులోని పొర్లుకట్ట ప్రాంతంలో టపాసుల తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటన ఇంకా జిల్లా ప్రజల కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అలాంటి ఘటన పునరావృతం కాకూడదంటే నిబంధనలు, జాగ్రత్తలు పాటించాల్సిందిపోయి గాలికి వదిలేశారు.


అధికార పార్టీ నేతల పేర్లు చెబుతూ


ఇటీవల టపాసుల తయారీ కేంద్రాలు, గోదాములను పలు శాఖల అధికారులు తనిఖీ చేశారు. పలు జాగ్రత్తలు, నిబంధనలు పాటించడం లేదని, అనుమతులకు మించి నల్లమందును తయారీ కేంద్రాల్లో నిల్వ ఉంచుతున్నారని తనిఖీల్లో గుర్తించినట్లు సమాచారం. అయితే కొందరు వ్యాపారులు అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పడం, వారి అనుచరుల నుంచి ఫోన్లు చేయించడంతో అధికారులు సైతం ఏమీ చేయలేక తనిఖీలు ముగించుకొని వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రెన్యువల్‌, కొత్త దుకాణాల అనుమతులు, తనిఖీల సమయంలో అంతా బాగుంది అని చెప్పేందుకు సిండికేట్‌గా మారిన వ్యాపారులు పలు శాఖల అధికారులకు భారీగానే  ముడుపులు ముట్టచెప్పినట్లు సమాచారం. 


20 శాతం పెరిగిన తయారీ ఖర్చు


 టపాసుల తయారీకి ఉపయోగించే కాగితం, దారం, ఇతర కెమికల్స్‌తో పాటు నల్లమందు ధరలు గత  ఏడాదితో పోల్చుకుంటే 20 శాతానికి పైగా పెరిగాయని వ్యాపారులు తెలుపుతున్నారు. కూలీల ఖర్చులు కూడా పెరిగాయని అంటున్నారు. అందువల్ల టపాసులను ఎక్కువ ధరలకు అమ్మక తప్పదని తెలుపుతున్నారు. అంటే ఈ ఏడాది టపాసుల ధరలు ఆకాశాన్ని అంటక తప్పవని అందరూ భావిస్తున్నారు. 

Updated Date - 2021-10-31T05:23:00+05:30 IST