కన్యాశుల్కంలో పూనా

Nov 29 2021 @ 00:32AM

తెలుగువారి వాడుక భాషకు ఆదికావ్యమైన కన్యాశుల్కం నాటకంలో గురజాడ అప్పారావు నేటి పూణే (నాటి పూనా) నగరాన్ని మూణ్ణాలుగుచోట్ల ప్రస్తావించారు. మూడుచోట్ల గిరీశం గప్పాలలోనే దొర్లుతుంది. ఒకటోసారి: ‘‘పూనా డక్కన్‌ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ‘ది ఇలెవెన్‌ కాజెస్‌ ఫర్‌ ది డిజెనరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ గూర్చి మూడు గంటలు ఒక్క బిగిని లెక్చరిచ్చే సరికి ప్రొఫెసర్లు డంగైపోయినారు.’’ (ప్రథమాంకం: 1వ స్థలం). రెండోసారి: ‘‘నేను పూనాలో వున్నప్పుడు నాలుగుగంటలు అందువిషయమై ఒక్కబిగిని లెక్చరిచ్చానండి.’’ (ద్వితీయాంకం: 1వ స్థలం). మూడోసారి: ‘‘పూనావంటి సిటీలో లెక్చర్‌ ఇచ్చామంటే టెన్‌ థౌజండ్‌ పీపుల్‌ వినడానికొస్తారు.’’ (ద్వితీయాంకం: 2వ స్థలం). 


ఇక్కడ గిరీశం చెప్పేవన్నీ అబద్ధాలే! కానీ పూనా నిజం. అక్కడి డక్కన్‌ కాలేజీ నిజం. 


గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని మొదట 1892లో రాశారు. దాన్ని మళ్ళీ తమ మిత్రులు యస్‌. శ్రీనివాసయ్యంగార్‌ ప్రోద్బలంమీద 1909లో పూర్తిగా ఎత్తిరాసి పునర్ముద్రించారు. ఉన్న పాత్రల స్వరూప స్వభావాల్ని మార్చారు. కొత్త పాత్రల్ని సృష్టించారు. పాతవాటిలో కొన్నింటిని తొలగించారు. నిజానికి ఇది సరికొత్త రచనవంటిదే అని వారే స్వయంగా ముందు మాటలో అంగీకరించారు. అయితే ఒకటిన్నర దశాబ్దాల పైగా కాలవ్యవధి తీసుకున్న ఈ రెండు కూర్పులలోనూ పూనా ప్రస్తావన మాత్రం మార్చలేదు. కీ.శే. బంగోరె కూడా తాను సేకరించి ముద్రించిన ‘మొట్టమొదటి కన్యాశుల్కం’ అధోసూచిక లోనూ, అనుబంధంలోనూ పూనా అంశాన్ని లేవనెత్తారు. 


గురజాడ పూనా నగరాన్నే తన చారిత్రాత్మక నాటకంలో ఉటంకించడానికి ప్రత్యేకమైన కారణాల్నీ, ఆనాటి పూనా విశేషాల్నీ ఆరాతీస్తే ఆసక్తికరమైన అంశాలు తెలుస్తున్నాయి. 


1820లో కుంఫిణీ పాలనలో  ఉన్న పూనాలో సంస్కృత విద్యకోసం హిందూ కాలేజీని స్థాపితమైంది. 1840లో ఈ కాలేజీలోనే ఇతర పాఠ్యాంశాలను బోధిస్తూ ‘పూనా డక్కన్‌ కాలేజీ’గా పేరు మార్చారు. లోకమాన్య బాలగంగాధర తిలక్‌ పూనాడక్కన్‌ కాలేజీలోనే గణితంలో పట్టభద్రులయ్యారు. మరో స్వాతంత్య్ర సమర సారథి గోపాలకృష్ణ గోఖలే తరచుగా పూనాను సందర్శించేవారు. మంచి మిత్రులైన ఆ ఇరువురూ పూనాను కార్యనిర్వాహక కేంద్రంగా భావించేవారు. ప్రముఖ సామాజిక సంస్కర్త జ్యోతీరావ్‌ పూలే పూనాకు చెందినవారే. ఈయన అంటరానితనం, కులవ్యవస్థల నిర్మూలనతోపాటు స్త్రీ జనోద్ధరణకూ కృషి చేసాడు. నిమ్నకులాల హక్కుల్ని కాపాడేందుకు ‘సత్య శోధక్‌ సమాజ్‌’ స్థాపించాడు. దీనికి తెలుగువారి విరాళాలే ప్రధాన ఆర్థిక వనరు. 1848లో పూలే దంపతులు భారతీయ మహిళా విద్యాలయాన్ని ఇక్కడే స్థాపించారు. వితంతు వివాహాల్ని ప్రోత్సహించి తమ ఆధ్వర్యంలోనే చాలా వివాహాలు నిర్వహించారు. 


జాతీయవాద రాజకీయ తిరుబాట్లూ, బాల్య వివాహాల నిషేధంకోసం పోరాటాలూ, వితంతు వివాహాల ప్రోత్సాహక ఉద్యమాలూ, కులవ్యవస్థ నిర్మూలనా విప్లవాలూ పురుడు పోసుకున్న నగరం పూనా. ఇలాంటిచోట గిరీశం చెప్పినట్టు గంటలకొద్దీ లెక్చర్లూ, థౌజండ్స్‌ కొద్దీ పీఫుల్‌ హాజర వడమూ, ప్రొఫెసర్లు డంగైపోవడమూ సర్వసాధారణం. పూనాలో మిన్నంటిన కరతాళధ్వనులు సంస్కర్త హృదయం గల గురజాడవారి వీనులకు విజయనగరంలో విందు చెయ్యడంలో ఆశ్చర్యం లేదు. 


ఇక నాల్గవ ప్రస్తావనగా: ‘‘బుచ్చెమ్మను పూనా విడోస్‌ హోమ్‌కు పంపమని మీ గురువుగారి పేర్న టెలిగ్రామ్‌ ఇస్తాను’’ అని సౌజన్యారావు పంతులు గిరీశంతో అంటాడు (సప్త మాంకం: 6వ స్థలం). ఇక్కడే మొదటి కూర్పులో ‘‘రమా బాయి విడోస్‌ హోమ్‌కు పంపించి విద్య చెప్పించవలసిందని వీరయ్య పంతులుగారి పేర్న వ్రాసినాను’’ అని వుంది. 1892 నాటి ‘రమాబాయి విడోస్‌ హోమ్‌’ అన్నమాట 1909 నాటికి ‘పూనా విడోస్‌ హోమ్‌’గా మారింది. ఉత్తరం రాయడం, టెలిగ్రామ్‌ ఇవ్వడంగా మారింది. అప్పారావు గారు కాలంతో పరుగెత్తే దార్శనికులు మరి. 


ఈ అంశం లోతుల్లోనికి శోధిస్తే మరికొన్ని విషయాలు బోధపడుతున్నాయి. మొదటచెప్పుకోవలసిన వారు: పండిత రమాబాయి సరస్వతి (1858-1922). 1880లో ఆమె ఒక బెంగాలీని కులాంతర ప్రాంతీయాంతర వివాహం చేసుకు న్నది. కానీ కొద్దికాలంలోనే వైధవ్యం ప్రాప్తించింది. 1882లో పూనా చేరుకున్నది. అదే సంవత్సరం ఇండియాలోని విద్యా వ్యవస్థ పరిశీలన కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం లార్డ్‌ రిపోన్‌ కమిషన్‌ను నియమించినప్పుడు, రమాబాయి ఆ కమిషన్‌ ముందు హాజరై, భారతీయ మహిళల విద్యాభివృద్ధి కోసం ఒక సవివరమైన నివేదిక సమర్పించింది. అది గొప్ప సంచలనాన్ని సృష్టిస్తూ విక్టోరియా రాణిని చేరు కుంది. ఆ సంవత్సరమే ‘ఆర్య మహిళా సమాజం’అనే సంస్థను స్థాపించి వితంతువులనూ అనాథ మహిళలనూ చేరదీసి సేవ చేసింది. సుమారు మూడేళ్లపాటు అమెరికా ఇంగ్లాండ్‌ దేశాలు తిరిగి క్రైస్తవ మతానికి ఆకర్షితురా లయింది. 1889లో తిరిగి వచ్చి, తర్వాతి సంవత్సరం పూనాలో ‘శారదాసదన్‌’ పేరుతో విడోస్‌ హోమ్‌నూ, ‘రమా బాయి విద్యాసంస్థ’నూ నడిపింది. మొదటి కూర్పు కన్యాశుల్కంలో పేర్కొన్న ‘రమాబాయి విడోస్‌ హోమ్‌’ ఈమెదే కావాలి.


ఇక రెండవవారు, రమాబాయి రనాడే (1862-1924). ఈమెకు పదకొండేళ్ల వయసులోనే పెళ్లయింది. భర్త ప్రముఖ సంఘ సంస్కర్త న్యాయనిపుణుడూ జస్టిస్‌ గోవింద్‌ రనాడే. ఆయన నాటి మూఢ నమ్మకాలకు విరుద్ధంగా ఆమెకు చదువు నేర్పించారు. 1882లో ఈమెకు పండిత రమాబాయితో స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ఒకే లేడీ మిషనరీ వద్ద రనాడేల గృహంలోనే ఇంగ్లీష్‌ నేర్చుకున్నారు. 1901లో ఈమెకు వైధవ్యం ప్రాప్తించింది. అప్పుడామె పూనా చేరుకొని శాశ్వతంగా తమ పూర్వీకుల గృహంలోనే స్థిరపడిపోయింది. 1908లో వితంతువులూ అనాథ మహిళల ఆశ్రయంకోసం వారి విద్యా అభ్యున్నతుల కోసం ‘పూనా సేవాసదన్‌’ని ప్రారంభించింది. 1915లో ఈ సంస్థ ఒక మహిళా శిక్షణ కళాశాలనూ, మహిళా వైద్య విద్యార్థులకోసం ఒకటీ, నర్సులకోసం ఒకటీ, వితంతువుల కోసం ఒకటీ మొత్తం మూడు హాస్టళ్లను ప్రారంభించింది.  


ఇలా కన్యాశుల్కం రెండవ కూర్పునాటికి ఒకే పేరుగల వ్యక్తులు వితంతువులకోసం నడిపే సేవాసంస్థలు రెండున్నాయి. అప్పటికే జ్యోతీరావు పూలే సంస్థకూడా వున్నది. కాబట్టి గురజాడవారు యుక్తిగా పేరుని ప్రస్తావించకుండా కేవలం ‘పూనాలోని విడోస్‌ హోమ్‌’ అనిమాత్రమే ఉల్లేఖించారు బాల్యవివాహాలూ బాలవితంతువులూ ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు. అందుకే ఆ దురాచారాల్ని దుయ్యబట్టడమే లక్ష్యంగా సంస్కరణాభిలాషతో నాటకాన్ని రాస్తున్న గురజాడ వీరి సేవల్ని విస్మరించకుండా నమోదుచేసుకున్నారు. కన్యాశుల్కం రెండు కూర్పులకూ ఇద్దరు రమాబాయి గార్లూ సజీవులుగా ఉండటం విశేషం. 

టి. షణ్ముఖ రావు

99493 48238


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.