Kapil Dev: ఆసియాకప్‌తో కోహ్లీ కెరియర్ ఖతమేనా?.. కపిల్ ఏమన్నాడు?

ABN , First Publish Date - 2022-08-29T00:02:14+05:30 IST

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ గతంలో ఎప్పుడూ ఎదుర్కోని గడ్డుకాలన్ని ఎదుర్కొంటున్నాడు

Kapil Dev: ఆసియాకప్‌తో కోహ్లీ కెరియర్ ఖతమేనా?..  కపిల్ ఏమన్నాడు?

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ గతంలో ఎప్పుడూ ఎదుర్కోని గడ్డుకాలన్ని ఎదుర్కొంటున్నాడు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీ ఖేల్ ఖతం అయిపోయిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రారంభమైన ఆసియాకప్ అతడికి లిట్మస్ పరీక్షగా మారింది. ఈ టోర్నీలో అతడు కనుక తనను తాను నిరూపించుకోలేకపోతే విమర్శల నుంచి మరోమారు విమర్శల తూటాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 


ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా మాజీ సారథి, దేశానికి తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ మాట్లాడుతూ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీ స్థానాన్ని గతంలో ప్రశ్నించిన కపిల్.. తాజాగా అతడికి చక్కని సలహా ఇచ్చాడు. కోహ్లీ వీలైనన్ని మ్యాచ్‌లు ఆడాలని, ఐసీసీ ఈవెంట్స్‌ ఈవెంట్స్‌లో ఆడేందుకు అవసరమైన ఫామ్‌ను అది అందిస్తుందని అన్నాడు. కోహ్లీకి ఈ ఆసియా కప్ చివరిదన్న వార్తలపై కపిల్ స్పందిస్తూ.. ఈ అభిప్రాయం సరికాదని కొట్టిపడేశాడు. కోహ్లీ మ్యాచ్‌లు ఆడుతూనే ఉండాలని తాను అతడికి చెప్పాలనుకుంటున్నానని పేర్కొన్నాడు. విరామం ఎక్కువ తీసుకోవద్దని, చాలా మ్యాచ్‌లు ఆడాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నట్టు చెప్పాడు. అతడు పరుగులు చేయడం ప్రారంభించినప్పుడు ఆలోచనా విధానంలో కూడా మార్పు వస్తుందని కపిల్ చెప్పుకొచ్చాడు. 


కోహ్లీ ఈ ఏడాది జులైలో ఇంగ్లండ్‌తో జరిగిన ఒక టెస్టు మ్యాచ్, రెండు టీ20లు, రెండు వన్డేలు ఆడి 76 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు దూరమయ్యాడు. కాగా, ఆసియాకప్‌తో మళ్లీ జట్టులోకి వచ్చిన కోహ్లీకి నేటి మ్యాచ్ 100వ టీ20 గేమ్. ఫలితంగా అన్ని ఫార్మాట్లలోనూ వంద మ్యాచ్‌లు ఆడిన తొలి ఇండియన్‌గా కోహ్లీ రికార్డులకెక్కబోతున్నాడు. 

Updated Date - 2022-08-29T00:02:14+05:30 IST