250 మంది కాపు కీలక నేతల రహస్య సమావేశం.. ఏపీ పాలిటిక్స్‌లో హీట్..!?

ABN , First Publish Date - 2021-03-07T17:55:32+05:30 IST

వరుస ఎన్నికలతో తిరుపతిలో క్యాస్ట్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి...

250 మంది కాపు కీలక నేతల రహస్య సమావేశం.. ఏపీ పాలిటిక్స్‌లో హీట్..!?

వరుస ఎన్నికలతో తిరుపతిలో క్యాస్ట్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక, కార్పొరేషన్ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. తిరుపతిలో జరిగిన కాపుల రహస్య సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది. ఇటు వైసీపీతో పాటు అటు బీజేపీని కూడా కలవరానికి గురిచేస్తోంది. తిరుపతి ఉప ఎన్నికకు మారుతున్న రాజకీయ సమీకరణాలను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం.


250 మంది హాజరైనట్లు టాక్..!

తిరుపతిలో కాపుల రహస్య సమావేశం ఏపీ పాలిటిక్స్‌లో హీట్ పుట్టిస్తోంది. తిరుపతి బై పోల్ లక్ష్యంగా ఆ సామాజికవర్గం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ నాయకులు జనసేనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని..లేదంటే ఏ పార్టీకీ ఓటు వేయకుండా నోటాను ఎంచుకోవాలని తిరుపతి బలిజ సంఘాలు తీర్మానించాయనే వార్త సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల ఐదు బలిజ సంఘాలు చంద్రగిరి సమీపంలోని ఒక తోటలో కుటుంబాలతో సహా సమావేశమయ్యాయట. తిరుపతి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన దాదాపు 250 మంది కీలకమైన బలిజ నేతలు ఈ రహస్య సమావేశానికి హజరైనట్లు టాక్. ఈ భేటీలో మహిళా కాపు నేతలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.


సొంతంగానే భవనం..!

అధికార పార్టీకి చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతలు తమను అణిచివేస్తున్నారనే ఆగ్రహంతో ఉన్నారట బలిజ సామాజికవర్గం నేతలు. టీడీపీ ప్రభుత్వ హయంలో బలిజల కోసం తిరుపతి ఎల్ఐసీ సెంటర్ రోడ్ లో భూమిని కేటాయించి.. భవన నిర్మాణానికి నిధులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు బలిజ భవన్ నిర్మాణ పనులకు బ్రేక్ వేశారని ఆరోపిస్తున్నారట. అంతేకాదు ఆ స్థలాన్ని కబ్జా చేసే యత్నించిన విషయాన్ని చంద్రగిరి సమావేశంలో తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. తిరుపతిలో కమ్మ,రెడ్డి, యాదవ భవనాలు ఉన్నప్పుడు బలిజ భవన్ ఎందుకు ఉండకూడదనే అంశాన్ని లేవనెత్తినట్లు టాక్‌. బలిజ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఇక వైసీపీలోని రెడ్డి నేతలను ప్రాధేయపడకుండా సొంతంగానే నిర్మించుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇందుకు బలిజ సామాజికవర్గంలో ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలు లక్ష రూపాయాల చొప్పున చందాలు వేసుకుని సొసైటీ భవనం నిర్మించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాంతో సమావేశంలోనే కొందరు నేతలు తమ వంతుగా విరాళాలు ప్రకటించారట.


మీడియా హైలైట్ చేయకుంటే..! 

మరోవైపు కడప, కర్నూలు వైసీపీ నేతల పేర్లతో కొందరు కాపు నేతల ఆస్తుల్లో అక్రమణలు జరుగుతున్నాయనే విషయం కీలకంగా చర్చకు వచ్చిందనే టాక్. ఇటీవల ఒక టింబర్ డిపో వ్యవహారంపై కూడా సమీక్ష చేశారట. మీడియా హైలైట్ చేయకుంటే ఈ పాటికి దాని యజమాని పరిస్థితి ఏమై ఉండేదోనని అంతా అనుకున్నారట. దీంతో ఇటీవల కాపులు చాలా మంది తమ ఆస్తులు కాపాడుకోవటానికి కేసులు కోర్టుల్లో వేస్తున్న విషయాన్ని ఈ భేటీలో పాల్గొన్న కాపు న్యాయవాదులు ప్రస్తావించారని చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్ హయాంలో 9 మంది బలిజలు ఎమ్మెల్యేలు ఉంటే, ఇప్పుడు ఒక్కరు మాత్రమే వైసీపీలో ఉన్నారని గుర్తుచేస్తున్నారట.


జనసేనకు ఇస్తేనే లేకుంటే..!

ఇక 52 డివిజన్లు ఉన్న తిరుపతి కార్పొరేషన్‌లో.. వైసీపీ  కేవలం ఇద్దరు బలిజలకే మాత్రమే సీట్లు ఇచ్చి, 9 సీట్లు రెడ్లకు కేటాయించిన  విషయాన్ని ప్రస్తావిస్తున్నారట. తిరుపతిలో 48 శాతంతో 60 వేల మంది ఉన్న బలిజలకు అధికార వైసీపీ సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది కాపు మహిళా నేతల ఆరోపణ. ఇక తిరుపతి ఉప ఎన్నికలో లోక్‌సభ అభ్యర్ధిగా బీజేపీ నేతను ఎంపిక చేస్తే, ఎట్టి పరిస్థితిలోనూ ఓటు వేయకూడదని సమావేశంలో తీర్మానించినట్లు ప్రచారం జరుగుతోంది. తిరుపతి సీటు జనసేనకు ఇస్తేనే అందరూ ఓట్లు వేయాలని, దానికి భిన్నంగా ఎంపిక జరిగితే నోటాకు ఓటు వేయాలని బలిజ సంఘాలు డిసైడ్ అయినట్లు ఆ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.


జనసేనకు అవకాశం ఇవ్వండి!

తిరుపతి లోక్‌సభ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్‌ కావడంతో.. ఉప ఎన్నికల్లో కుల రాజకీయాలు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. జనసేనకు టికెట్‌ ఇస్తే ఇక్కడ పేరున్న దళిత నేతను బరిలోకి దింపాలని ఆ పార్టీ అధిష్టానం యోచనగా ఉందట. అభ్యర్థి క్యాస్ట్‌తో సంబంధం లేకుండా గెలిపించాలని బలిజలు నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలని వారి వ్యూహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న బలిజలను దృష్టిలో ఉంచుకుని జనసేనకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారట. ఇదే డిమాండ్‌తో తిరుపతి పార్లమెంటు పరిధిలో బలిజల ప్రాధాన్యం ఉన్న అయిదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో, సంఘ సమావేశాలు త్వరలో నిర్వహించాలని భావిస్తున్నారట. తిరుపతి నియోజకవర్గంలో ఈసారి బలిజలు అధిపత్యం చూపించకపోతే, అక్కడ రెడ్డి వర్గానిదే శాశ్వత ఆధిపత్యం ఉంటుందనేది బలిజ నేతల ఆందోళన. అందుకే తిరుపతి ఉప ఎన్నిక టార్గెట్‌గా బలిజల సత్తా చూపించడానికి ఆ సామాజికవర్గం నేతలు రెడీ అవుతున్నారు.


ఏం జరుగుతుందో.. సర్వత్రా ఉత్కంఠ..!

తిరుపతి ఉప ఎన్నిక లక్ష్యంగా జరుగుతున్న బలిజ నేతల సీక్రెట్ సమావేశాలు.. బీజేపీ నేతలను కలవరానికి గురిచేస్తున్నాయట. దాంతో కమలనాథులు జనసేన నేతలను  కన్విన్స్ చేసి ఉపపోరులో ఉండాలని అభిప్రాయపడుతున్నట్లు టాక్. ఈ సమయంలో బలిజ నేతల సమావేశాలు కమలం నేతలను ఇరుకునపెట్టేలా కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోది. అయితే ఉప ఎన్నికలకు  నాలుగు నెలల క్రితమే నానా హడావిడి చేసిన సునీల్ దియోదర్ ఇప్పుడు తిరుపతి ఊసే ఎత్తడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా.. బీజేపీ నేతల్లో సందడి లేకుండాపోయిందట. చంద్రగిరిలో బలిజల సమావేశంతో కమలం నేతలు అభ్యర్థి విషయంలో కన్ఫ్యూజన్‌లో పడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో తిరుపతి అభ్యర్థిగా పోటీచేసేది జనసేన అభ్యర్థా..? లేక బీజేపీ అభ్యర్థా..? అన్నది ఉత్కంఠ రేపుతోంది. 

Updated Date - 2021-03-07T17:55:32+05:30 IST