Advertisement

కారాకొల్లు కళగల పల్లె

Jan 17 2021 @ 01:16AM
కారాకొల్లులో జక్కీకి వస్తున్న మహిళలు

తెలుగు సంస్కృతికి ప్రత్యక్ష సాక్ష్యం


శ్రీకాళహస్తి, జనవరి 16: మొబైల్‌ ఫోన్‌కి దాసోహం కాని ఒక పల్లె కథ ఇది. బహుశా కనీసం ఏడాదిలో ఒక నెలరోజులు అయినా పల్లెదనం నిలుపుకుంటున్న జనం ఉన్న ఊరు మిగిలే ఉందని, తొట్టంబేడు మండలంలో లోమూలగా ఉండే 80 ఇళ్ల కారాకొల్లును పండుగ నెలలో ప్రత్యక్షంగా చూస్తే తప్ప నమ్మలేం. పిల్లల చదువుల కోసమో, వ్యాపార, ఉద్యోగ అవసరాల కోసమో పల్లెను వదలి వెళ్లిపోయినా ఒక్క నెల రోజులు మాత్రం రెక్కలు విప్పుకుని ఊళ్లో వాలిపోయి ఆకుపచ్చని పొలాల నడుమ స్వచ్ఛంగా జీవిస్తున్నారు వారు. కోలాటాలు, గొబ్బెమ్మలు, ఊరేగింపులు, ఆటలు... ప్రతి రాత్రీ ఆ పల్లెను వెలిగిస్తోంది. ఎంటెక్‌లు, ఎంఫార్మసీలు, పీహెచ్‌డీలు..ఎంత పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా హోదాలు మరచి మావా, బావా, అన్నా, వొదినా, అవ్వా, తాతా అంటూ పాత కాలంలోకి ప్రయాణిస్తారు. 


వృద్ధులు మాత్రమే కనిపించే కారాకొల్లు గ్రామం, పండుగ నెల మొదలు పెట్టగానే కళకళలాడడం మొదలుపెడుతుంది. ప్రతి ఇల్లూ సందడిగా మారుతుంది. నెలసరవ మొదలు పెట్టిందంటూ తొలి రోజు మాంసం వండుకుని సంబరాలు మొదలు పెడుతారు. పేడకళ్లాపికి అవకాశంలేని సిమెంటు రోడ్ల వాకిళ్ళలోనే రంగుల ముగ్గులు కొలువు తీరుతాయి.  ఒక ఇంట్లో గౌరమ్మ కొలువు తీరుతుంది. చీకటి పడ్డాక  ఆడవాళ్లంతా  అల్లికట్టె తడికెలు అల్లిన ప్రాంగణం గల ఆ ఇంటి ముందు కూడుతారు. గొబ్బెమ్మను అలంకరించి వాకిట్లో తీరుస్తారు. చుట్టూ చేరి గొబ్బి తడుతారు. పాట తర్వాత పాట అలలు అలలుగా వ్యాపిస్తూ ఆ పల్లెను గొబ్బెమ్మ కొలువైన చోటుకు రప్పిస్తుంది. కాసేపటికి కోలాటం మొదలవుతుంది. ఆడవాళ్లు అందుకునే పల్లె పాటలకు లయబద్దంగా మోగే కోలాటం కర్రల వాద్య సంగీతం.. వలయాకారంలో తిరుగుతూ పడే అడుగుల చప్పుడు..వీధి దీపాల వింత కాంతిలో  అద్భుత దృశ్యం ఆవిష్కారమవుతుంది. గంటా, రెండు గంటలూ, మూడు గంటలూ.. బృందనృత్యం సాగుతూనే ఉంటుంది. జనజీవితంలోని సకల ఒత్తిళ్లనూ ఆడిపాడి అలసి దించుకుంటారు. పండుగ నెల చివరి రోజున గౌరమ్మను ఊరేగించి, గంగలో నిమజ్జనం చేసి ఇక ఎవరి తావులకు వాళ్లు తిరిగి బయలు దేరుతారు. 

నిజానికి ముప్పయి నలభై ఏళ్ళ కిందట ప్రతి తెలుగు పల్లెలో కనిపించిన దృశ్యమే ఇది. మొదట టీవీ, ఆ తర్వాత మొబైల్‌ మానవ సంబంధాలను మింగేశాక పల్లె కళలు కూడా అంతరించి పోయాయి. పనితోపాటూ వినిపించే పాట మూగబోయింది. సాయంత్రాలు సందడి చేసే ఆటలు అంతరించిపోయాయి. యువత పట్టణాలకు వలసపోయింది. మనుషుల్లేని ఇళ్లలో మిగిలిన ముసలివాళ్లతో పల్లెలు ఈసురోమంటున్నాయి. కారాకొల్లు కూడా ఇందుకు మినహాంపు కాదు. అయితే రచ్చలు రావిళ్లకు దూరంగా, ఆకుపచ్చని సముద్రం నడుమ దీవిలా ఉండే కారాకొల్లు మూలాలను మరచిపోలేకపోయింది. ఏటా పండుగ రోజుల్లో పల్లెకు చేరుకునే ప్రజలు పాత ఆచారాలను కలబోసుకున్నారు. మళ్లీ మనం ఎందుకు మొదు పెట్టకూడదని ఆలోచించారు. ఆట, పాట తెలిసిన గురువు ఊళ్లోనే ఉన్నాడు. శంకరబాబు దగ్గర పిల్లాజెల్లా కూడారు. సాయంత్రాలు శిక్షణ మొదలైంది. వృద్ధుల నుంచి పాటలు సేకరించారు. పుస్తకాలు పోగేసుకున్నారు. సాంకేతిక యుగంలో వేగంతో ప్రయాణించే యువతకు పాట, ఆట నేర్చుకోవడం పెద్ద కష్టం కాలేదు. పదేళ్ల పిల్లలు మొదలు 70 ఏళ్ల వృద్ధుల దాకా కలిసి కోలాటాలు ఆడుతున్నారు. గొబ్బి తడుతున్నారు. మనశ్శరీరాలు రెండూ ఇందు వల్ల ఎంతో తేలికపడుతున్నాయని వీరు గ్రహించారు. నాలుగేళ్ల నుంచీ ఇక క్రమం తప్పకుండా పిల్లలతో సహా ఊరికి చేరుకుంటున్నారు. వీరి రాక, ఊళ్లో ఉన్న పెద్దలకూ ఆనందాన్ని పంచుతోంది. ఈ ప్రయత్నం తెలుగు కళలకు తిరిగి ప్రాణం పోస్తోంది. ప్రతి పల్లె కారాకొల్లును ఆదర్శంగా తీసుకుంటే ‘అయ్యో అంతరించిపోయాయే’ అని ఆవేదన చెందే అవసరం రాదు. మన కళా సంపదను మనం కాపాడుకోవడానికే కాదు, మనల్ని మనం సజీవంగా ఉంచుకోవడానికి అయినా ఇదొక అవసరం. 

 
16శ్రీరామ్‌ 13) మోహిత

పట్టణాల్లో సంపాదనే తప్ప... ఆత్మీయత, అనురాగాలు దొరకవు. మా పల్లెలో వీటికి కొదువ లేదు. అందుకే ప్రతి పెద్ద పండక్కీ హైదరాబాదు నుంచి కారాకొల్లుకు వచ్చేస్తాను.  స్నేహితులందరం కలుస్తాం.  నెల రోజుల పాటు గొబ్బెమ్మను తీర్చి, ఆడి, పాడి సంబరాలు చేసుకుంటున్నాం.     

- మోహిత, ఎంఫార్మసీ

16శ్రీరామ్‌ 14)సిరిచందన

మా పెద్దలు పాడి ఆడిన ఆనందించిన కళలు అంతరించిపోకూడదు అనుకున్నాం. కొనసాగించకపోతే చరిత్ర మా తరాన్ని క్షమించదు. అందుకే  మేము కోలాటం, పండరి భజన, జక్కీకి నేర్చుకున్నాం. చదువు ఒత్తిడిలో ఉండే నాకు పల్లెకు వచ్చి ఆడిపాడగానే ప్రశాంతత లభిస్తోంది. 

- సిరిచందన, బీటెక్‌

16శ్రీరామ్‌ 15)శంకరయ్య

నా వృత్తి సేద్యం. నాకు జానపదకళలు అంటే ప్రాణం. మా పల్లెలో పిల్లలు నేర్పించమంటూ ముందుకు వచ్చారు.  కోలాటం, పండరిభజన, జక్కీకి, గొబ్బి పాటలు నేర్పుతున్నా. ఎంతో ఆసక్తితో నేర్చుకుంటున్నారు. ఆట, పాట వలన పిల్లల మధ్య అనుబంఽదాలు కూడా పెరిగాయి. ఇక అంతరించిపోయాయి అనుకున్నవన్నీ మళ్లీ మా పల్లెలో సజీవంగా ఉండడం ఎంతో సంతోషంగా ఉంది.

- శంకరయ్య, జానపదకళల గురువు

16శ్రీరామ్‌ 16)మొరవనేని సుబ్బారావువ్యాపార రీత్యా ఇరవై ఏళ్లుగా తిరుపతిలో నివాసం ఉంటున్నాం. పండుగ నెల పెట్టగానే పల్లెకు వచ్చేస్తున్నాం. గ్రామ ప్రజల ఏకాభిప్రాయంతో ఐదేళ్లుగా మా ఇంటిలోనే గౌరీదేవిని కొలువుతీరుస్తున్నాం. నా భార్య పద్మ నిష్టతో రోజూ ఈ బాధ్యత నిర్వహిస్తోంది.  మా ఇంటి ముందు రోజూ ఇంతమంది చేరి ఆడడం  ఎంతో ఆనందంగా ఉంది.

     - మొరవనేని సుబ్బారావు, వ్యాపారి


16శ్రీరామ్‌ 17)మహేష్‌


ప్రతి ఏటా సంక్రాంతికి ఇంటికి వస్తా

తిరుపతిలో లెక్చరరుగా పని చేస్తున్నా. పండగంటే పరుగెత్తుకు వచ్చేస్తాం. పల్లెల్లో దొరికే ఆత్మీయత పట్టణాల్లో దొరకదు.  కలసి ఆడుతూ, పాడుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటోంది. మా పిల్లలకు కూడా మన సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వ సంపదగా అందించే అవకాశం దక్కింది.

 - మహేష్‌, లెక్చరర్‌


16శ్రీరామ్‌ 18) గల్లా సుదర్శన్‌

 మనుషుల మధ్య కరువైపోతున్న ఆత్మీయత, అనురాగాలు పునరుద్ధరించుకోవడానికి సంక్రాంతి పండుగ మా పల్లెకు ఓ వేదిక అవుతోంది. ఇందకు మా పల్లె యువత చేస్తున్న కృషి అభినందనీయం. వారిని చూసి మేము గర్వపడుతున్నాం. వృత్తిరీత్యా మా కుటుంబం తిరుపతిలో ఉన్నప్పటికీ పండగ నెల రోజులు మాత్రం ఊళ్లో ఆటపాటల్లో పాల్గొంటున్నాం.

 - గల్లా సుదర్శన్‌, న్యాయవాది, రాష్ట్ర బార్‌ అసోసియేషన్‌ సభ్యుడు


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.