నెమ్మదిగా సాగు

ABN , First Publish Date - 2021-06-12T05:42:22+05:30 IST

నెమ్మదిగా సాగు

నెమ్మదిగా సాగు
నీరు అంతంతమాత్రంగానే ఉన్న బందరులోని కాలువ

ఊరిస్తున్న వర్షాలు.. కళకళలాడని కాలువలు..

వర్షాలు భారీగా కురిస్తేనే ఖరీఫ్‌కు అనుకూలం

ఇప్పటివరకు సాధారణ వర్షపాతమే..

పట్టిసీమ, పులిచింతల నుంచి ఇంకా విడుదల కాని నీరు

వెలవెలబోతున్న కాలువలు

వరుణుడు కరుణిస్తున్నా.. రైతుల మోముల్లో ఆశలు చిగురించట్లేదు. ఖరీఫ్‌ ప్రారంభమై 10 రోజులు గడిచినా జిల్లాలో సగటు వర్షపాతమే నమోదు కావటం.. పట్టిసీమ, పులిచింతల నుంచి కాలువలకు సాగునీరు విడుదల చేసే అంశంపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో రైతులు ఏమీ పాలుపోలేని స్థితిలో పడ్డారు. 

మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : ఈ ఖరీఫ్‌ సీజన్‌పై రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే, వరుణుడు ఊరిస్తున్నాడు తప్ప.. ఆశించిన మేర వర్షాలను కురిపించట్లేదు. ఈనెల 1 నుంచి ఖరీఫ్‌ ప్రారంభమైనా అనుకున్న స్థాయిలో వర్షాలు కురవలేదు. రెండు రోజులుగా జిల్లాలో ముసురుపట్టినా సగటు వర్షపాతమే నమోదైంది. శుక్రవారం జిల్లాలో 13.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గురువారం 2.5 మిల్లీమీటర్లు కాగా, 8, 9 తేదీల్లో అసలు వర్షమే కురవలేదు. 

పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా పంపింగ్‌కు ఆలస్యం

గోదావరిపై నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా జూన్‌ 15 నుంచి 20వ తేదీలోగా కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పట్టిసీమ ప్రాజెక్టు వద్ద  గోదావరిలో 14 మీటర్ల మేర నీరు అందుబాటులోకి రాలేదని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. వారం తరువాతే పంపింగ్‌కు అవకాశం ఉంటుందని సూచనప్రాయంగా చెబుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 14 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఈ నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తే అక్కడి నుంచి కాలువలకు సాగునీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని, అయితే, ఈ అంశంపై ప్రభుత్వం  తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

నాణ్యమైన విత్తనాలు వచ్చేనా..?

జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తే 1.87 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు కావాల్సి ఉంటుంది. గత ఏడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలు, వాతావరణంలో మార్పుల కారణంగా విత్తనాల్లో మొలకశాతం తక్కువగా ఉంటుందని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో బీపీటీ 5204, 2231, ఎంటీయూ, 1075, 1061, 1153, 1156, 7029,1239 ఎన్‌ఎల్‌ఆర్‌ 4001 తదితర రకాల వంగడాలను సాగు చేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. వర్షాలు కురిసి వాతావరణం అనుకూలంగా మారితే పత్తి, ఇతర పంటల సాగు వేగవంతమవుతుంది. ప్రస్తుతం రైతులు దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. వరి, పత్తి, మిరప తదితర విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచితే వాతావరణం అనుకూలంగా మారిన వెంటనే సాగుకు ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. 

కాలువలు కళకళలాడేది ఎన్నడో..

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో వరి 2.50 లక్షల హెక్టార్లు, పత్తి 48వేల హెక్టార్లు, చెరుకు 9వేల హెక్టార్లు, మొక్కజొన్న, కందులు, మిర్చి, పసుపు, వేరుశెనగ, మినుము, పెసలు తదితర పంటలు మొత్తంగా 3,32,650 హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా.  కాగా, తాగునీటి అవసరాల నిమిత్తం కృష్ణాడెల్టా ప్రాంత కాలువలకు ఈనెల 20వ తేదీన నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.  వరుణుడు కరుణిస్తేనే జలాశయాలు నిండి కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. దీంతో ప్రభుత్వం కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేసే అంశంపై పెదవి విప్పడం లేదు. ఈ ఖరీఫ్‌లో కృష్ణాడెల్టాకు సాగు, తాగునీటి అవసరాలకు 85 టీఎంసీల నీరు అవసరమవుతుంది. నెలాఖరు నాటికి సాగు అవసరాల నిమిత్తం కాలువలకు నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందా, లేదా అనేది వరుణుడిపైనే ఆధారపడి ఉంటుంది. 


Updated Date - 2021-06-12T05:42:22+05:30 IST