ఘోర బస్సు ప్రమాదం ఎలా జరిగింది..? 35 మందిలో 28 మంది ఒకే కుటుంబానికి చెందినవారే..!

ABN , First Publish Date - 2022-06-03T17:56:20+05:30 IST

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది ప్రయాణికులుండగా.. వారిలో 28 మంది ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది.

ఘోర బస్సు ప్రమాదం ఎలా జరిగింది..? 35 మందిలో 28 మంది ఒకే కుటుంబానికి చెందినవారే..!

హైదరాబాద్/కర్ణాటక : కర్ణాటకలో ఇవాళ ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది ప్రయాణికులుండగా.. వారిలో 28 మంది ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. బర్త్‌డే పార్టీ కోసం వీరంతా గోవా వెళ్లినట్టుగా తెలుస్తోంది. 16 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 8 మంది సజీవ దహనమయ్యారు. మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


బస్సు గోవా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఉదయం 5.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కలబురిగి జిల్లా కమలాపురలో ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సు అదుపుతప్పి కల్వర్టు పైనుంచి బోల్తాపడింది. ప్రమాదం తర్వాత బస్సు డీజిల్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా పేలింది. 8 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ ఉన్నారు. ఆస్పత్రిలో మరో డ్రైవర్‌ చికిత్స పొందుతున్నాడు.


మృతులు వీరే.. 

అర్జున్‌కుమార్‌ (37), అతని భార్య (32), బివాన్‌ (4), దీక్షిత్‌ (9), అనితా రాజు (40), శివకుమార్‌ (35), రవళి (30)తో పాటు మరొకరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. రెండు కుటుంబాలకు చెందిన 32 మంది బర్త్‌డే పార్టీ చేసుకోవడానికి గోవాకు వెళ్లినట్లు  తెలియవచ్చింది. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-06-03T17:56:20+05:30 IST