అసెంబ్లీ శీతాకాల సమావేశాలు Bengaluruలోనే..?

ABN , First Publish Date - 2021-12-03T18:23:15+05:30 IST

ఒమైక్రాన్‌ వైరస్‌ భయంతో మహారాష్ట్ర సరిహద్దులోని బెళగావిలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన శాసనసభ శీతాకాల సమావేశలలో పాల్గొనేందుకు సచివాలయం సిబ్బంది విముఖంగా ఉండటంతో ప్రభుత్వం

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు Bengaluruలోనే..?

- బెళగావి సమావేశాల్లో పాల్గొనేందుకు సిబ్బంది ససేమిరా

- వెంటాడుతున్న ఒమైక్రాన్‌ భయం 

-  సీఎంతో చర్చించాక నిర్ణయం


బెంగళూరు: ఒమైక్రాన్‌ వైరస్‌ భయంతో మహారాష్ట్ర సరిహద్దులోని బెళగావిలో ఈనెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన శాసనసభ శీతాకాల సమావేశలలో పాల్గొనేందుకు సచివాలయం సిబ్బంది విముఖంగా ఉండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నగరానికి తిరిగి వచ్చాక ఆయనతో ఈ అంశంపై చర్చలు జరపాలని శాసనసభ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డే కాగేరి భావిస్తున్నట్లు సమాచారం. బెళగావి సమావేశాలను రద్దుచేయాలని ఇప్పటికే సచివాలయం ఉద్యోగుల సంఘం ఇటీవల స్పీకర్‌ కాగేరికి లేఖరాసిన సంగతి విదితమే. అవసరమైతే ఒకసారి సంఘం పదాదికారులతో చర్చించి వారిని బెళగావి సమావేశాలకు హాజరయ్యేలా ఒప్పించాలని కూడా స్పీకర్‌ ఆలోచిస్తున్నట్లు కథనం. ఒమైక్రాన్‌ వైరస్‌ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇటీవల ఆరోగ్య నిపుణులు సైతం ప్రభుత్వానికి సూచన చేయడంతో బెళగావి శీతాకాల సమావేశాలపై కారుమేఘాలు కమ్ముకుంటున్నాయి. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఎమ్మెల్యే ఆర్‌వీ దేశ్‌పాండే కూడా బెళగావిలో సమావేశాలు వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసిన సంగతి విదితమే. వైరస్‌ తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు మదింపు వేస్తున్న ప్రభుత్వం బెళగావి సమావేశాల విషయంలో తన నిర్ణయాన్న పునర్‌ పరిశీలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు శాసనసభలోనే ఈసారికి సమావేశాలను నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రితో చర్చించిన పిదప ఈ అంశంపై స్పీకర్‌ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రిమండలి సమావేశంలో దీనిపై తీర్మానం చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2021-12-03T18:23:15+05:30 IST