‘హిజాబ్’ తీర్పుపై కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మయ్ స్పందన

ABN , First Publish Date - 2022-03-15T19:27:02+05:30 IST

విద్యా సంస్థల తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించరాదని

‘హిజాబ్’ తీర్పుపై కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మయ్ స్పందన

బెంగళూరు : విద్యా సంస్థల తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించరాదని కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించడాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ స్వాగతించారు. బాలల ప్రయోజనాల కోసం హైకోర్టు తీర్పును అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. ఇది బాలల విద్యకు, భవిష్యత్తుకు సంబంధించిన విషయమని చెప్పారు. 


కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న ఓ ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాలలో విద్యార్థినులు హిజాబ్ ధరించే హక్కుపై పోరాటం ప్రారంభించారు. తరగతి గదుల్లోకి హిజాబ్ ధరించి, ప్రవేశించడాన్ని యాజమాన్యం అడ్డుకుంటున్నట్లు ఆరోపించారు. అనంతరం కొందరు కాషాయ కండువాలు ధరించడం ప్రారంభించారు. దీంతో యూనిఫాంను నిర్దేశించిన విద్యా సంస్థల్లోని తరగతి గదుల్లోకి మతపరమైన వస్త్రాలను ధరించి, వెళ్ళకూడదని  ఫిబ్రవరి 5న కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై కొందరు విద్యార్థినులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగం ప్రకారం తమ ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని, హిజాబ్ ధరించడం ఇస్లాం ప్రకారం చాలా అవసరమని వాదించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, మతపరమైన వస్త్రాలను ధరించడంపై తాత్కాలిక నిషేధం విధించింది. పిటిషన్లపై దాదాపు 11 రోజులపాటు విచారణ జరిపింది. ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వు చేసింది. మంగళవారం తీర్పు చెప్తూ, హిజాబ్ ఇస్లాం మతాచారాల్లో భాగం కాదని తెలిపింది. 


హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవస్థి నేతృత్వంలోని సంపూర్ణ ధర్మాసనం తీర్పు చెప్తూ, ముస్లిం మహిళలు హిజాబ్‌ను ధరించడం ఇస్లామిక్ విశ్వాసంలో ముఖ్యమైన మతాచారం కాదని తెలిపింది. స్కూల్ యూనిఫాంను నిర్ణయించడం సరైనదేనని, దీనికి రాజ్యాంగం కూడా అనుమతి ఇస్తోందని తెలిపింది. దీనిపై విద్యార్థినీ, విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ ఉన్నారు. 


ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ, ఈ తీర్పును అందరూ పాటించాలని కోరారు. ఇది విద్యార్థినీ, విద్యార్థుల భవిష్యత్తుకు, విద్యకు సంబంధించిన అంశమని చెప్పారు. తరగతులకు, పరీక్షలకు ఎవరూ గైర్హాజరు కావొద్దని కోరారు. ప్రజలంతా శాంతియుతంగా వ్యవహరించాలని కోరారు. మత పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-03-15T19:27:02+05:30 IST