ఈ ఫలితాలు.. ప్రమాద ఘంటికలే...

ABN , First Publish Date - 2022-03-12T18:13:05+05:30 IST

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయాలను మూటగట్టుకోవడం ప్రమాద ఘంటికలను సూచిస్తోందని రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాదిన

ఈ ఫలితాలు.. ప్రమాద ఘంటికలే...

- కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్ల మనోగతం

 - వచ్చే ఏడాదే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 

- ఐదు రాష్ట్రాల ఫలితాల ప్రభావంపై అంతర్మథనం


బెంగళూరు: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయాలను మూటగట్టుకోవడం ప్రమాద ఘంటికలను సూచిస్తోందని రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాదిన ప్రస్తుతం కాంగ్రెస్‌ కొద్దో గొప్పో బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక కావడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ ఓటమిపై లోతుగా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి కేహెచ్‌ మునియప్ప అంటున్నారు. వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ అనేక ఎన్నికల్లో ఎన్నో ఆటుపోట్లను చవి చూసిందని ఓటమినే గెలుపు సోపానంగా మలుచుకుందని, అయితే ఇటీవలి కాలంలో వరుస ఓటములు పార్టీ శ్రేణులను కుంగదీసే ప్రమాదం ఉందని పార్టీ సీనియర్‌ నేతల్లో ఒకరైన శ్యామనూరు శివశంకరప్ప అన్నారు. గతంలో ఆయన సుదీర్ఘకాలం ఏఐసీసీ కోశాధికారిగా సేవలందించిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. లోటుపాట్లను దిద్దుకుని 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవ స్థితిగతుల ఆధారంగా వ్యూహాలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్‌గాంధీ సమర్థుడైన నాయకుడేనని, అయితే సంస్థాగతంగా పార్టీలో భారీ మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని పాతతరం కొత్తతరం నేతలను కలుపుకుని పోయేలా కూర్పు అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో నేడు కాంగ్రెస్‌ కేవలం రెండు రాష్ట్రాలకు పరిమితం కావడం ఆందోళన కలిగించే అంశమేనని మాజీ ముఖ్యమంత్రి ఎం. వీరప్పమొయిలీ పేర్కొన్నారు. రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతున్న తరుణంలో కాలానుగుణంగా పరుగులు తీయకపోతే వెనుకబడిపోతామన్నారు. కాగా సుదీర్ఘకాలం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన ప్రస్తుత కర్ణాటక ఎమ్మెల్సీగా ఉన్న బీకే హరిప్రసాద్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలపై సర్వత్రా సందేహాలు ప్రారంభమయ్యాయన్నారు. బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించిన అన్ని చోట్లా కాంగ్రెస్‌ ఘన విజయాలు సాధించిందని మరి ఈవీఎంలలో ఏమేమి లొసుగులు ఉన్నాయో పెరుమాళ్లకే ఎరుక అంటూ చురకలంటించారు. ఎన్నికల సంఘం పనితీరు పారదర్శకంగా ఉండటం లేదన్నారు. దేశంలోని అనేక స్వయం ప్రతిపత్తి సంస్థలపై వత్తిడి అధికంగా ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. బ్యాలెట్‌పేపర్లతో ఎన్నికలు జరిగేలా ప్రతిపక్షాలు ఉమ్మడిగా కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని పార్టీ  సీనియర్‌ నేతల్లో ఒకరైన కేపీసీసీ కార్యాధ్యక్షుడు, ఎమ్మెల్సీ సలీం అహ్మద్‌ పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఉన్న సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని అయితే ఐదు రాష్ట్రాల ఫలితాలు మాత్రం తమకు ఒకింత నిరాశ కలిగించిన మాట నిజమేనని అంగీకరించారు. ఈ ఫలితాలతో కుంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. ఫలితాలపై త్వరలోనే ఢిల్లీలో ఆత్మావలోకన సమావేశం జరుగుతుందన్నారు. కాగా ఈ ఫలితాలు పార్టీకి పెనుసవాల్‌ లాంటివని లోపాలు సరిదిద్దుకుని లోక్‌సభ ఎన్నికలకు సమాయాత్తం కావాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయని ఎమ్మెల్యే  హెచ్‌కె. పాటిల్‌ అభిప్రాయ పడ్డారు.


రాష్ట్రాల వారీగా వ్యూహాలు అవసరం

ఐదు రాష్ట్రాల ఫలితాల అనంతరం కాంగెస్‌ ఆన్ని రాష్ట్రాలలోనూ వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉం దని తమ పేర్లను వెల్లడించేందుకు ఇష్టపడని పలువురు కాం గ్రెస్‌ నేతలు అభిప్రాయపడటం గమనార్హం. గతం గురించి గొప్పలు చెప్పుకుంటూ కూర్చుంటే ఫలితం లేదు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా కాంగ్రెస్‌ పెద్దన్న పాత్రను పోషించాలని అభిప్రాయపడుతున్నారు. కు టుంబ పార్టీ అనే కళంకాన్ని కూడా దూరం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని పార్టీలో సీనియర్‌నేతకు పగ్గాలు అప్పగించి చూడాలని మరికొందరు నేతలు సూచించారు. ఐదు రాష్ట్రాల ఫలితాల ప్రభావం కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయావకాశాలపై కూడా పడుతుందేమోన్న మరికొందరు నేతలు వ్యక్తంచేశారు. ఒక్కో రాష్ట్రం చేజారిపోతోంది. పరిస్థితులకు అనుగుణంగా ఇచ్చిపుచ్చుకునే విధానానికి అలవాటు పడాలి. లేకపోతే భవిష్యత్తు అంధకారమయం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2022-03-12T18:13:05+05:30 IST