సీఎం బుజ్జగించినా ఆగని కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన

ABN , First Publish Date - 2022-02-18T03:03:08+05:30 IST

జాతీయ జెండాను తొలగించి కాషాయ జెండాను ఆవిష్కరించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నేను అబద్దాలు చెప్పను. కాషాయ జెండా ఎగరేస్తాం. ఇక్కడే కాదు. ఎర్రకోటపై ఎగరేస్తాం. ఈ దేశంలో హిందూయిజం అధికారంలోకి వచ్చాక అదే జరుగుతుంది..

సీఎం బుజ్జగించినా ఆగని కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం నిరసన చేపట్టారు. మంత్రి కేఈ ఈశ్వరప్ప చేసిన ‘కాషాయ జెండా’ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ప్రాంగణంలోనే నిరసన చేపట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప బుజ్జగించినప్పటికీ నిరసన విరమించలేదు. జాతీయ జెండాను అవమానిస్తూ వ్యాఖ్యానించిన మంత్రి కేఈ ఈశ్వరప్పపై చర్యలు తీసుకోవాలని, దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈరోజు బుజ్జగింపులు ఫలితాన్ని ఇవ్వలేదని ఆగిపోమని రేపు కూడా వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తామని యడియూరప్ప అన్నారు.


కర్ణాటకలో హిజాబ్ వివాదం గురించి తెలిసిందే. అయితే ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరిన సందర్భాలు గుర్తుండే ఉంటాయి. శివమొగ్గలోని ఒక పాఠశాలలో కొందరు విద్యార్థులు జాతీయ జెండాను తొలగించి కాషాయ జెండా ఎగురవేసిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధమే కొనసాగింది. ఆ సందర్భంలో మంత్రి కేఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘జాతీయ జెండాను తొలగించి కాషాయ జెండాను ఆవిష్కరించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నేను అబద్దాలు చెప్పను. కాషాయ జెండా ఎగరేస్తాం. ఇక్కడే కాదు. ఎర్రకోటపై ఎగరేస్తాం. ఈ దేశంలో హిందూయిజం అధికారంలోకి వచ్చాక అదే జరుగుతుంది’’ అని అన్నారు.


మంత్రి కేఈ వ్యాఖ్యలపై కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. మంత్రిని తొలగించాలంటూ ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షం డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో తమ పార్టీ ఎమ్మెల్యేలందరితో కలిసి ఆయన నిరసనకు దిగారు. నిరసన విరమించాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కాంగ్రెస్ నేతలను కలిసి విజ్ణప్తి చేశారు. అయితే మంత్రిపై దేశద్రోహం కేసు నమోము చేసి, ఆయనను కేబినెట్ నుంచి తప్పించే వరకు నిరసన కొనసాగుతుందని, అప్పటి వరకు విమరమించబోమని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.


దీంతో చేసేదేమీ లేక.. సీఎం సహా అధికార పార్టీకి చెందిన ఇతర నేతలు ఇంటి ముఖం పట్టారు. అయితే శుక్రవారం సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుస్తామని, వారిని నిరసన విరమింపజేసేందుకు ప్రయత్నిస్తామని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ నేతల నిరసనపై మంత్రి కేఈ ఈశ్వరప్ప స్పందిస్తూ ‘‘నిరసన చేస్తే చేసుకోనివ్వండి. వారిని నేను అస్సలు కదిలించిను’’ అని ఘాటుగా స్పందించారు. ‘‘రాజ్యాంగం ప్రకారం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి అదే రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేసే వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండాను అవమానించారు. అయినప్పటికీ ఆయనపై గవర్నర్ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. గవర్నర్ రాజ్యాంగాన్ని బాధ్యత వహిస్తున్నారా? ఆర్‌ఎస్ఎస్‌కు బాధ్యత వహిస్తున్నారా? దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటే దేశద్రోహం కింద కేసు కూడా నమోదు చేయలేదు’’ అని కార్ణాటక కాంగ్రెస్ అధినేత డికే శివకుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Updated Date - 2022-02-18T03:03:08+05:30 IST