జయ వారసుడిని నేనే...!

ABN , First Publish Date - 2022-07-11T14:34:52+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి జయలలితకు తానే అసలైన వారసుడినని, ఆమె సంపాదించిన ఆస్తుల్లో సగ భాగం తనకే చెందేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ

జయ వారసుడిని నేనే...!

 సగం ఆస్తులు నాకే చెందాలి - హైకోర్టులో కర్ణాటక వృద్ధుడి పిటిషన్‌

చెన్నై: మాజీ ముఖ్యమంత్రి జయలలితకు తానే అసలైన వారసుడినని, ఆమె సంపాదించిన ఆస్తుల్లో సగ భాగం తనకే చెందేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జయలలిత మృతి తర్వాత ఆమె వారసులమంటూ పలువురు కేసులు వేయడం ఆనవాయితీగా మారింది. ఈ కేసులు వేసినవారిలో ఎక్కువమంది కర్ణాటకకు చెందినవారే కావటం విశేషం. జయలలిత బతికున్నప్పుడు ఆమె చెల్లెలు తానేనంటూ కర్ణాటకకు చెందిన శైలజ అనే యువతి ప్రకటించుకున్నారు. జయలలిత ఆమెపై పరువునష్టం దావా వేయడంతో చివరకు ఆ కేసు తోసివేతకు గురైంది. ఆ తర్వాత కర్ణాటకకు చెందిన అమృత అనే యువతి జయలలిత కుమార్తె తానేనంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సినీనటుడు శోభన్‌బాబు, జయలలితకు జన్మించింది తానేనని, డీఎన్‌ఏ పరీక్షలకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. 2018లో ఆరోపణలకు తగిన ఆధారాలు లేవంటూ హైకోర్టు ఆ పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది. ఈపరిస్థితుల్లో జయలలిత సోదరుడి కుమార్తె దీప, కుమారుడు దీపక్‌ ఆమెకు వారసులని హైకోర్టు ప్రకటించడంతో వారసుల వివాదం సద్దుమణిగింది.

ఈ పరిస్థితుల్లో కర్ణాటక రాష్ట్రం మైసూరు సమీపం వ్యాసరాయపురానికి చెందిన ఎన్‌జే. వాసుదేవన్‌ (83) అనే వృద్ధుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన తండ్రి ఆర్‌. జయరామ్‌  వేదవళ్లి అలియాస్‌ వేదమ్మ (జయలలిత తల్లి)ను రెండో పెళ్ళి చేసుకున్నాడని, వీరిద్దరికి జన్మించిన వారే జయలలిత, జయకుమార్‌ అని వాసుదేవన్‌ ఆ పిటిషన్‌లో తెలిపారు. జయలలిత తనకు సోదరి అవుతుందని పేర్కొన్నారు. అంతే కాకుండా 1950లో తన తండ్రి జయరామ్‌ వద్ద జీవనభత్యం కోరుతూ తన తల్లి (ఆర్‌. జయమ్మ) మైసూరు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని, ఆ కేసులో వేదవళ్లి, జయకుమార్‌, జయలలితను ప్రతివాదులుగాను చేర్చారని తెలిపారు. ఆ తర్వాత రాజీ కుదరడంతో కేసును కొట్టివేశారని వివరించారు. జయలలిత మృతి చెందటానికి ముందే ఆమె సోదరుడు జయకుమార్‌ మృతి చెందారని, ఈ పరిస్థితుల్లో జయలలితకు అసలైన వారసుడిని తానేనని వాసుదేవన్‌ పిటిషన్‌లో తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని జయలలిత సంపాదించిన ఆస్తుల్లో సగం వాటా తనకే చెందేలా ఉత్తర్వు జారీ చేయాలని కోరారు. అదే సమయంలో 2020లో జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌ను ఆమె వారసులుగా మద్రాసు హైకోర్టు డివిజన్‌ జారీ చేసిన ఉత్తర్వును కూడా రద్దు చేయాలని వాసుదేవన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ నకలును దీప తరఫు న్యాయవాది తొండన్‌ సుబ్రమణ్యంకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో త్వరలో విచారణ జరుగనుంది.

Updated Date - 2022-07-11T14:34:52+05:30 IST