ఆ ఏరియా నీ జాగీరా: Kumaraswami

ABN , First Publish Date - 2022-01-23T17:39:50+05:30 IST

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రుల మధ్య వాగ్వాదం జోరుగా సాగుతోంది. ప్రతిపక్షనేత సిద్దరామయ్య వ్యాఖ్యలపై కుమారస్వామి వరుస ట్వీట్‌లతో పలు ప్రశ్నలు సంధించారు. తుమకూరు నీ జాగీరా అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.

ఆ ఏరియా నీ జాగీరా: Kumaraswami

బెంగళూరు: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రుల మధ్య వాగ్వాదం జోరుగా సాగుతోంది. ప్రతిపక్షనేత సిద్దరామయ్య వ్యాఖ్యలపై కుమారస్వామి వరుస ట్వీట్‌లతో పలు ప్రశ్నలు సంధించారు. తుమకూరు నీ జాగీరా అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. అందుకు ధీటుగా శనివారం సిద్దరామయ్య తిప్పికొట్టారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను చాముండేశ్వరిలో ఓడాను... రాజకీయం అంటే గెలుపోటములు సహజమన్నారు. కుమారస్వామి సంస్కృతి ఏమిటో ఆయన వ్యాఖ్యలే రుజువు చేస్తున్నాయి. ఆయన తండ్రి దేవేగౌడ ఓడిపోలేదా..? కుమారుడు మండ్యలో ఓడిపోలేదా..? అన్న రేవణ్ణ ఓడలేదా..? అంటూ సవాల్‌ విసిరారు. ప్రజాక్షేత్రంలో ఓటరుదే అంతిమ నిర్ణయమన్నారు. జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కుమారస్వామి ఎక్కడ ఉన్నారో తెలియదు, నేనెందుకు వెళ్లి చేతులు కట్టుకుంటా? కంటతడి ఎందుకు పడతానన్నారు? రాష్ట్ర ప్రజల ముందు పదే పదే కన్నీరు పెడుతోంది ఎవరో అందరికీ తెలుసునన్నారు. 


ఎవరో కష్టానికి సిద్దూనే నాయకుడు - కుమార 

ఎవరో కష్టపడి సాధిస్తే సిద్దరామయ్య అధికారం అనుభవించారని ఒక నాయకుడిని తయారు చేసే యోగ్యత లేదని, ఒక పార్టీని బలోపేతం చేసే ధైర్యం లేదని, ప్రగతిదశలో ఉండే పార్టీలోకి దూరి అధికారం అనుభవించే నీవు... జేడీఎస్‌ గురించి విమర్శలా... అంటూ ప్రతిపక్షనేత సిద్దరామయ్యపై జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి విరుచుకుపడ్డారు. శనివారం వరుస ట్వీట్‌లతో సిద్దరామయ్యను పలు ప్రశ్నలు వేశారు. తుమకూరు జేడీఎస్‌ నేత బెమల్‌ కాంతరాజు కాంగ్రెస్‌లో చేరిన సందర్భంలో జేడీఎస్‌ను తరిమికొట్టాలని సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తుమకూరు జిల్లా మీ తండ్రి జాగీరా..? లేక కాంగ్రెస్‌ పార్టీ పూర్వీకుల ఆస్తినా అంటూ ప్రశ్నించారు. జేడీఎస్‌కు అన్ని విధాలా బీజేపీ ప్రభుత్వం అండగా ఉందనే వ్యాఖ్యలపైనా తిరగ బడ్డారు. జేడీఎస్‌ సిద్ధాంతాల గురించి మాట్లాడేందుకు సిగ్గుండాలన్నారు. మరోసారి సీఎం అయ్యే దురాశతో వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. మీ యోగ్యతకు అభ్యర్థులు లేక జేడీఎస్‌ వారిని హైజాక్‌ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ చేరే ముందు మీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలన్నారు. గురుస్వామిపై ఓడి ఇక రాజకీయాలు వద్దంటూ ఏడ్చి న్యాయవాదిగా వెనుతిరుగుతానని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకో సిద్దరామయ్య అంటూ వ్యాఖ్యానించారు. మీ రాజకీయంలో ఒక నాయకుడిని ఎదగనిచ్చారా..? పచ్చగా ఉండే పొలంలాంటి పార్టీలో వెళ్లి అధికారం అనుభవించే మీ కుట్రలు ప్రజలు గమనిస్తారన్నారు. జేడీఎస్‌ అంటే ఎందుకంత ఈర్ష్య అని ప్రశ్నించారు. 

Updated Date - 2022-01-23T17:39:50+05:30 IST